Hyper Aadi- YCP: బుల్లితెర స్టార్ కమెడియన్ హైపర్ ఆది అంటేనే వైసీపీ శ్రేణులు మండిపడిపోతున్నారు. ఇటీవల శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జరిగిన యువశక్తి సభలో హైపర్ ఆది కీలక ప్రసంగం చేశారు. వైసీపీ నేతలు, మంత్రులను ఏకిపారేశారు. సంచలన కామెంట్స్ చేశారు. దీంతో వైసీపీ నేతలు దీనిపై రియాక్టవుతున్నారు. హైపర్ ఆదిని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో యుద్ధం ప్రకటించారు. జబర్దస్త్ లో టైమింగ్ బట్టి పంచ్ వేయడంలో ముందంజలో ఉండే ఆది పవన్ కు మద్దతుగా వైసీపీ మంత్రులకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు తెగ వైరల్ అయ్యాయి. వారికి ఎక్కడ తగలాలో అక్కడ తగిలాయి. దీంతో వారు ఆదిపై రివేంజ్ కు సిద్ధపడుతున్నారు.

హైపర్ ఆది మెగా సోదరులకు వీరాభిమాని. అది చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు. గత ఎన్నికల్లో జనసేన తరుపున ప్రచారం కూడా చేశారు. అడదడపా సోషల్ మీడియాలో జనసేనకు మద్దతుగా పోస్టులు పెడుతుంటారు. తాజాగా రణస్థలంలో జరిగిన యువశక్తి సభకు హాజరయ్యారు. పవన్ కు మద్దతుగా మాట్లాడారు. ఆయన గురించి కీలక విషయాలు చెప్పుకొచ్చారు. అదే సమయంలో వైసీపీ మంత్రులు, నేతలపై విరుచుకుపడ్డారు. తరచూ పవన్ గురించి ఓడిపోయాడని ఎద్దేవా చేస్తున్నారని.. ఓడిపోతే ఇంత మంది కష్టాలు తీర్చగలిగాడు.. గెలిస్తే వారి కష్టాలు కాంపౌండ్ వాల్ దాటకుండా చూస్తాడంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు.ఆయనది ఆస్తులు కూడబెట్టే మనస్తత్వం కాదని.. ప్యాకేజీ అన్న విమర్శకు ధీటుగా బదులిచ్చాడు. ఈ శాఖ ఆ శాఖ ఎందుకని? పవన్ ను తిట్టే శాఖ పెట్టుకోండి అంటూ ఎద్దేవా చేశారు. తరచూ దత్తపుత్రుడు అని మాట్లాడుతున్నారని… అదే నోటితో ఆయన అంజనీపుత్రుడు అని ఒప్పుకునే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పారు.ఇటీవల మెగా బ్రదర్స్ ను టార్గెట్ చేసుకున్న మంత్రి రోజాపై సెటైరికల్ గా మాట్లాడారు.

పవన్ కళ్యాణ్ పై కామెంట్స్ చేసి ప్రతిఒక్కడూ పాపులర్ అయిపోవాలని చూస్తున్నారని .. తాము పాపులర్ అవ్వడానికి పవన్ పర్సనాలిటీని దెబ్బతీస్తారా అంటూ హైపర్ ఆది ప్రశ్నించారు. ఈసారి జనసేన కొట్టే దెబ్బకు మీ అబ్బ గుర్తుకొస్తారంటూ హాట్ కామెంట్స్ చేశారు. ఆది వ్యాఖ్యలు వైసీపీ వర్గాల్లో పెద్ద దుమారమే రేపాయి. దీంతో వైసీపీ నేతలు ఆదిని టార్గెట్ చేయడం ప్రారంభించారు. హైపర్ ఆదిగాడికి డైపర్ వేయాల్సిన సమయం వచ్చిందని..అతని ఫోన్ నంబర్ సోషల్ మీడియాలో వైరల్ చేసి అందరూ పద్ధతిగా పలకరించాలంటూ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ఆర్మీ సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టింది. ఈ ఫేస్ బుక్ పోస్టును రోజా సెల్వమణి పేరుతో ఉన్న మరో అకౌంట్ ద్వారా షేర్ చేశారు. ఈ పోస్టు ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆ నంబరుకు కాల్ చేసి ట్రోల్ చేయడానికి వైసీపీ బ్యాచ్ రెడీ అవుతోంది. అయితే ఇంతకీ ఆ ఫోన్ నంబరు హైపర్ ఆదిదా కాదా అన్నది స్పష్టత లేదు.