కరోనాకు పాత్రికేయులు సైతం బలవుతున్నారు. వృత్తి రీత్యా పలువురిని కలిసే సందర్భంలో కరోనా వైరస్ బారిన పడుతున్నారు. దీంతో విలేకరులకు సైతం కష్టంగానే మారింది. సెకండ్ వేవ్ ప్రారంభమైన తరువాత రోజుకో ఐదారుగురు జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోతున్నారని తెలుస్తోంది. అయినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఫలితంగా కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతూ విచ్చలవిడిగా అవుతోంది. నిబద్ధతకు కట్టుబడి పనిచేసే తరుణంలో వైరస్ ధాటికి ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. ప్రతి రోజు వాట్సాప్, ఫేస్ బుక్ ల్లో చూస్తే మనసు చలించిపోతోంది. కరోనా విలయ తాండవం చూస్తుంటే భయమేస్తోంది.
అందరినీ కబలిస్తున్న..
విలేకరి నుంచి ఎడిటర్ వరకు కరోనా బారిన పడుతూ తమ ప్రాణాలు కోల్పోతున్నారు. కొన్ని పత్రికలు తమ వారి మరణవార్తలు ప్రచురిస్తున్నా ఇతర పత్రికలు మాత్రం ప్రచురించడం లేదు. దీంతో చాలావరకు కేసుల సంఖ్య వెలుగు చూడడం లేదు. పాత్రికేయుల జీవితాలకు భద్రత లేకుండా పోతోంది. దీనికి ఎవరిని బాధ్యులను చేయాలి. ఎవరిని నిందించాలి. వ్యవస్థలోనే లోపాలతోనే ప్రాణాలు బలవుతున్నాయన్నది సత్యం.
బెడ్లు దొరకక..
కరోనా బారిన పడిన బాధితులకు సరైన విధంగా బెడ్లు దొరకడం లేదు. ఆక్సిజన్ అందుబాటులో ఉండడంలేదు. ఫలితంగా వారి పలుకుబడి ఉపయోగించినా లాభం లేకుండా పోతోంది. పై స్థాయిలో ఉన్న వారికే సదుపాయాలు దొరుకుతున్నాయి. కింది స్థాయిలో ఉన్న వారికి నిరాశే మిగులుతోంది. దీంతో మరణాల సంఖ్య నానాటికి ఎక్కువవుతోంది.
గ్యారంటీ లేని జీవితాలు
పాత్రికేయులవి గ్యారంటీ లేని జీవితాలు. పని నిబద్ధతకు కట్టుబడి పని చేయాలనే నిబంధనలతో నిత్యం సమస్యలతోనే సహవాసం చేయాల్సి వస్తోంది. కేంద్ర ప్రభుత్వం సైతం జర్నలిస్టుల జీవితాలకు భరోసా ఇచ్చినా తదుపరి పరిణామాలు వేరేలా ఉన్నాయి. దీంతో జర్నలిస్టులు తమ ప్రాణాలు పణంగా పెట్టి మరీ పని చేయాల్సి వస్తోంది.