
సీనియర్ జర్నలిస్ట్ తెలకపల్లి రవి గురువారం ఏపీ ప్రభుత్వం ప్రకటించిన జీవితకాల సాఫల్య అవార్డును తిరస్కరించి సంచలనం సృష్టించారు. ఏపీలో కొలువుదీరిన జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రకటించిన అవార్డును తిరస్కరించిన రెండో జర్నలిస్టు ఇతడు.
వివిధ రంగాలలో రాణించిన వ్యక్తులను గౌరవించేందుకు ప్రభుత్వం ఈ జీవిత కాల సాఫల్య అవార్డులను ప్రకటిస్తుంది. ఈ ఏడాది జులై ప్రారంభంలో ప్రభుత్వం ప్రకటించిన వెంటనే సాయినాథ్ ను ఈ అవార్డు వరించింది.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గౌరవార్థం ఏపీ ప్రభుత్వం ఈ పురస్కారం ప్రధానం చేసి రూ.10 లక్షల ప్రశాంసపత్రం, నగదు బహుమతిని అందిస్తుంది. సాయినాథ్ మరియు తెలకపల్లి రవిలను ఈ అవార్డుకు ఏపీ ప్రభుత్వం ఎంపిక చేసింది.
ప్రజాశక్తిలో సుధీర్ఘకాలం పనిచేసిన కమ్యూనిస్టు వాది సీనియర్ జర్నలిస్ట్ తెలకపల్లి రవికి గురువారం వైఎస్ఆర్ లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డును ప్రకటించారు. అయితే దీన్ని ఆయన తిరస్కరించడం సంచలనమైంది. అవార్డును తిరస్కరిస్తున్నట్టు ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు.
తనను ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపిక చేసినందుకు తెలకపల్లి రవి ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి , అవార్డుల కమిటికి కృతజ్ఞతలు తెలిపారు. ఇక తనను అభినందించినందుకు స్నేహితులకు కృతజ్ఞతలు తెలిపారు.కానీ తాను ఎందుకు ఈ అవార్డును తిరస్కరిస్తున్నాన్నది మాత్రం తెలుపలేదు.