Joshimath Uttarakhand: ఉత్తరాఖండ్ .. చాలామంది దేవ భూమి అని పిలుస్తారు.. దానికి తగ్గట్టుగానే హిమాలయాలకు దగ్గరగా ఉన్న ఆ రాష్ట్రంలో లెక్కకు మిక్కిలి గుడులు ఉన్నాయి. ఏటా లక్షలాది మంది యాత్రికులు వస్తూ ఉంటారు. మరో వారణాసి లాగా కనిపిస్తూ ఉంటుంది. కానీ ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే.. అభివృద్ధి పేరుతో నిర్మిస్తున్న విద్యుత్ ప్రాజెక్టులు, రహదారులు ఈ హిమగిరి కి తీవ్రమైన నష్టం చేకూర్చుతున్నాయి. ఏకంగా అక్కడి భూమి కుంగిపోతోంది.. వాస్తవానికి ఉత్తరాఖండ్ రాష్ట్రం భూకంపం వచ్చే ప్రాంతాల జాబితాలో ముందు వరుసలో ఉంది. గతంలో భూకంపాలు వచ్చినప్పటికీ ఈ ప్రమాద సంకేతాలు ఎప్పుడూ కనిపించలేదు.

జోషి మఠం కుంగుతున్నది
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో జోషి మఠానికి మంచి పేరు ఉంది.. బద్రీనాథ్ కి వెళ్లే దారిలో ఈ మఠం ఉంది.. ఈ మఠం పరిధిలో 560 ఇళ్ళకు పగుళ్ళు వచ్చాయి. రోడ్డు కూడా రెండుగా చీలిపోయింది. భూమి పొరల్లో సర్దుబాటు కారణంగా ఇలా జరిగి ఉంటుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.. సముద్రమట్టానికి 6 వేల అడుగుల ఎత్తులో ఉండే జోషి మఠం ఉత్తరాఖండ్ లోని చమొలీ జిల్లాలో ఉంది.. బద్రీనాథ్, హేమాకుండ్ సాహెబ్ వెళ్లే భక్తులు జోషి మఠం లో ఆగి ముందుకు వెళ్లేందుకు కావలసిన వస్తువులు కొనుక్కొని వెళ్తారు. అయితే జోషి మఠం లో ప్రజలు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. మున్సిపాలిటీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
కారణాలు ఇవీ
జోషి మఠం లోని ఇళ్ళు బీటలు వారి భూమిలో కుంగేందుకు అక్కడికి దగ్గర్లోని ఎన్టీ పీ సీ టన్నెల్, బై పాస్ రోడ్ నిర్మాణంలో ఉన్నాయి. అలాగే అక్కడికి దగ్గర్లోనే ఎన్టీపీసీ తపోవన్, విష్ణు గడ్ హైడల్ ప్రాజెక్ట్ నిర్మాణంలో ఉంది. ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని నిలిపివేయాలని అక్కడి ప్రజలు చాలాకాలంగా డిమాండ్ చేస్తున్నారు. కానీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.. వాస్తవానికి భారతదేశపు టెక్టానిక్ ప్లేట్( భూమి అంతరాలలో ఉండే ఫలకం) సంవత్సరానికి ఒక సెంటీమీటర్ ముందుకు నెట్టుకుంటున్నది. అంటే హిమాలయాలు మన దేశపు టెక్టానిక్ ప్లేట్, ఆసియా ఖండపు టెక్టానిక్ ప్లేట్ ను గుద్దుకోవడం వల్ల హిమాలయాలు ఏర్పడ్డాయి. అందుకే హిమాలయాల వద్ద చాలా ప్రదేశాలలో ఎలాంటి మొక్కలు మొలవవు. అక్కడ మట్టి ఉంటుంది కనుక. ఇక హిమాలయ పర్వత శ్రేణుల దగ్గర ఉండే ప్రాంతం మొత్తం తీవ్ర భూకంపాలు వచ్చే ప్రమాదకర జోన్-5 లో ఉంది. కాబట్టి హైడల్ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో అక్కడ భూకంపాలు మరింత ఎక్కువగా బాటిల్లే అవకాశం కనిపిస్తోంది.

యూపీఏ హయాంలో..
2006 లో ఎన్టీపీసీ జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణానికి యూపీఏ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఆ పనులనే ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం కొనసాగిస్తోంది.. వైపు రహదారుల నిర్మాణం కూడా సాగుతోంది.. ఈ నేపథ్యంలో అక్కడ భూమి పొరల్లో కదలికల వల్ల జోషి మఠం వంటి ప్రాంతాల్లో ఇళ్ళు కుంగిపోతున్నాయి. కొన్నిచోట్ల గోడలకు బీటలు వాడుతున్నాయి. ఇటీవల ఉత్తరఖాండ్ లో పలుమార్లు భూకంపాలు వచ్చాయి. వాస్తవానికి అక్కడ భూమి అతి సున్నితమైనదని ప్రభుత్వాలకు తెలుసు.. కానీ నీరు సమృద్ధిగా లభిస్తుందనే ఒక సాకుతో విద్యుత్ ప్రాజెక్టులు నిర్మిస్తున్నాయి. కానీ భవిష్యత్తులో సంభవించే నష్టాలను మాత్రం అంచనా వేయలేకపోతున్నాయి. కానీ దాని పర్యవసానాలను అక్కడి ప్రజలు అనుభవిస్తున్నారు.. అభివృద్ధి అనేది కావాల్సిందే. కానీ ప్రకృతి ఇస్తున్న ప్రమాద సంకేతాలను ఏమాత్రం పట్టించుకోకుండా ప్రభుత్వాలు ముందుకు వెళ్లడం మూర్ఖత్వం కాకపోతే మరేమిటి.