జనవరి 20వ తేదీన బైడెన్ దేశాధ్యక్షుడిగా ప్రమాణం చేశారు. అప్పటికే ఆ దేశంలో కరోనా ఉగ్రరూపం దాల్చింది. దీంతో.. బైడెన్ ఎంచుకున్న ప్రధాన లక్ష్యాల్లో కరోనా వ్యాక్సిన్ పంపిణీ కూడా ఒకటి. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వంద రోజుల్లోనే 100 మిలియన్ డోసుల వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.
పక్కా ప్రణాళికతో కార్యక్రమాన్ని కొనసాగించిన ప్రభుత్వం.. అనుకున్న సమయానికి ముందుగానే టార్గెట్ ను చేరుకుంది. దీంతో.. ఈ లక్ష్యాన్ని 200 మిలియన్ డోసులకు పెంచారు. ఇప్పుడు ఆ లక్ష్యాన్ని కూడా ముందుగానే చేరుకోవడంతో బైడెన్ ఆనందం వ్యక్తంచేశారు. ఈ విషయంలో ప్రభుత్వ తీరును ప్రశంసించారు.
కాగా.. మన దేశంలో మాత్రం పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ఇప్పటి వరకూ 20 శాతం మందికి కూడా వ్యాక్సిన్ అందలేదని వార్తలు వస్తున్నాయి. మరోవైపు.. కేసులు కూడా అత్యంత వేగంగా పెరిగిపోతున్నాయి. రోజూవారి కేసులు 3 లక్షలు దాటిపోవడంతో పరిస్థితి చేయి దాటిపోతుందా? అనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.
మొన్నటి వరకూ టీకా తయారీకి కూడా డబ్బుల్లేక తయారీ సంస్థలు ఇబ్బందులు పడ్డట్టుగా వార్తలు వచ్చాయి. దీంతో.. 1500 కోట్లను భారత్ భయోటెక్ సంస్థకు కేంద్రం రుణంగా ఇచ్చినట్టు సమాచారం. తాజాగా.. కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మరి, ఈ పరిస్థితులు ఎప్పుడు చక్కబడతాయో చూడాలి.