JK Election Results: జమ్మూ కశ్మీర్‌లో పదేళ్ల తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆ రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు తర్వాత జరిగిన ఎన్నికల్లో బీజేపీకి ఎదురు దెబ్బ తగిలింది. ఆర్టికల్ 370రద్దు తమకు కలిసి వస్తుందని కమలం నేతలు భావించారు. కానీ, దాని ప్రభావం పెద్దగా చూపలేదు. తాము అధికారంలోకి వస్తే ఆర్టికల్ 370ని పునరుద్ధరిస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్న నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీనే అక్కడి ఓటర్లు విశ్వసించారు. దీంతో బీజేపీ నిర్ణయానికి కశ్మీరీలు మద్దతు ఇవ్వలేదని చెప్పాలి.
మ్యాజిక్ ఫిగర్ దాటిన కూటమి..
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం జమ్మూ కశ్మీర్‌లో 90 అసెంబ్లీ స్థానాలు ఉండగా, ఎన్‌సీ, కాంగ్రెస్ కూటమి స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తోంది. 49 స్థానాల్లో కూటమి ఆధిక్యంలో ఉంది. బీజేపీ కేవలం 26 స్థానాలకే పరిమితమైంది. ఇతరులు 12, పీడీపీ 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. జమ్మూ కశ్మీర్‌లో ప్రభుత్వం ఏర్పాటుకు 45 సీట్లు కావాలి. ప్రస్తుత ట్రెండ్స్ చూస్తుంటే నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ కూటమి మ్యాజిక్ ఫిగర్‌కు చేరువలో ఉంది. ట్రెండ్స్ ఇలాగే కొనసాగితే నేషనల్ కాన్ఫరెన్స్ సారథ్యంలో ప్రభుత్వం ఏర్పడుతుంది.