JD Lakshmi Narayana: వీవీ లక్ష్మీనారాయణ మళ్లీ రాజకీయంగా యాక్టివ్ అవ్వాలనుకుంటున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఏవరీ వీవీ లక్ష్మీనారాయణ అనుకుంటున్నారే…అదే సీబీఐ జేడీగా దేశవ్యాప్తంగా సుపరిచితులైన మాజీ అధికారి. ప్రజాసేవ చేయాలన్న తలంపుతో సీబీఐకి స్వచ్ఛంద పదవివిరమణ ఇచ్చారు. 2019 ఎన్నికలకు రెండేళ్ల ముందే ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టారు. ప్రజా సమస్యలపై పోరాడారు. గత ఎన్నికల సమయంలో అనూహ్యంగా జనసేనలో చేరి విశాఖ పార్లమెంట్ స్థానం నుంచి పోటీచేశారు. కేవలం 15 రోజుల పాటు ప్రచార పర్వంలో పాల్గొని దాదాపు 2.85 లక్షల ఓట్లు సాధించుకున్నారు. యూత్ లో మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకున్న ఆయన గణనీయమైన ఓట్లు పొందగలిగారు. దేశవ్యాప్తంగా కీలకమైన సీబీఐ కేసులు పర్యవేక్షించారు. నిజాయితీ గల అధికారిగా పేరు ఉండడంతో ..ఆయన పేరు అప్పట్లో దేశ వ్యాప్తంగా మార్మోగింది. మంచి వాగ్ధాటి ఉన్న వ్యక్తి. అటు విద్యార్థులు, యువతరం ఆయన స్పీచ్ లతో స్ఫూర్తిని పొందారు. విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. అందుకే నాడు పక్షం రోజుల పాటు ఎన్నికల ప్రచారం చేసినా గౌరవప్రదమైన ఓట్లు ఆయన దక్కించుకున్నారు.
గత ఎన్నికల్లో ఓటమి తరువాత ఆయన కొద్దిరోజుల పాటు రాజకీయంగా సైలెంట్ అయ్యారు. అటు తరువాత జనసేన పార్టీకి కూడా రాజీనామా చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తూ సామాజిక కార్యక్రమాలు చేపడుతూ వస్తున్నారు. ఇప్పుడు మళ్లీ రాజకీయ ఆసక్తి చూపిస్తున్నారు. ఏదో రాజకీయ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. వాస్తవానికి సీబీఐకి స్వచ్ఛంద పదవీవిరమణ చేసినప్పుడే ఆయన రాజకీయ పార్టీ పెడతారని అంతా భావించారు. కానీ అప్పటికే జయప్రకాష్ నారాయణ వంటి వారు పార్టీ స్థాపించి నడిపించలేకపోయారు. అందుకే తన భావాలకు దగ్గరగా ఉన్న పార్టీగా జనసేనను ఎంచుకున్నారు. జగన్ సీబీఐ కేసులో లక్ష్మీనారాయణ యాక్టివ్ గా పనిచేయడంతో తెలుగునాట ఆయనకు మంచి గుర్తింపే ఉంది. దీంతో జనసేన నుంచి పోటీచేసిన ఆయనకు విశాఖ ప్రజలు పట్టంకడతారని అంతా భావించారు. కానీ ఆయనకు ఓటమి తప్పలేదు. అటు తరువాత రాజకీయాలంటే ఇష్టం లేదన్నట్టు ఆయన దూరంగా జరిగిపోయారు. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండడంతో మరోసారి బరిలో దిగాలని ప్రయత్నిస్తున్నారు. ఇందుకు సరైన పార్టీ కోసం అన్వేషిస్తున్నారు.
ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఆయన జనసేనలో మాత్రం చేరే పరిస్థితులు అయితే కనిపించడం లేదు. గత ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి బరిలో దిగి ఓటమి తరువాత రాజీనామా చేశారు. ఇప్పుడదే పార్టీలోకి వెళితే తప్పుడు సంకేతాలువెళతాయని భావిస్తున్నారు. వైసీపీ అధినేత జగన్ కు వ్యతిరేకంగా విధులు నిర్వహించినందున ఆ పార్టీలో చేరే ఛాన్స్ లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన ముందున్న ఆప్షన్ టీడీపీ, బీజేపీ, ఆప్. టీడీపీ బలమైన ప్రాంతీయ పార్టీగా ఉంది.పైగా అక్కడ ఇప్పటికే సీనియర్ నాయకత్వం ఉంది. అక్కడ తాను కోరుకునే స్వేచ్ఛ., గౌరవం లభించే చాన్స్ లేదు. అందుకే అటు వైపుగా వెళ్లే అవకాశంలేదు. అమ్ ఆద్మీ పార్టీని దక్షిణాది రాష్ట్రాలకు విస్తరించే ఉద్దేశంలో కేజ్రీవాల్ ఉన్నారు. ఇప్పటికే జేడీ లక్ష్మీనారాయణకు టచ్ లోకి వచ్చారని.. ఏపీ బాధ్యతలు చూసుకోవాలని సూచించారని టాక్ నడుస్తోంది. అయితే అంత బలం లేకపోవడంతో జేడీపునరాలోచనలో పడినట్టు తెలుస్తోంది.
ఇప్పుడున్న పరిస్థితిలో జేడీ లక్ష్మీనారాయణ బీజేపీయే కరెక్ట్ అని భావిస్తున్నట్టు సన్నిహితులు చెబుతున్నారు. బీజేపీలో చేరి విశాఖ ఎంపీగా పోటీచేస్తే బాగుంటుందన్న అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది. గతంలో ఇక్కడ నుంచి ఎంపీగా హరిబాబు గెలుపొందారు. అప్పట్లో అది పొత్తుతో సాధ్యమైంది. కానీ ఈ సారి కూడా టీడీపీ, జనసేనతో బీజేపీకి పొత్తు కుదిరే అవకాశముంది. దీంతో బీజేపీలో చేరితే తానే అభ్యర్థి అయ్యే చాన్స్ ఉందని లక్ష్మీనారాయణ భావిస్తున్నారు. అందుకే బీజేపీలో చేరేందుకే దాదాపు మొగ్గుచూపిస్తున్నారు. అక్టోబరు 2న కీలక ప్రకటన చేయాలని నిర్ణయించుకున్నట్టు విశ్వసనీయ సమాచారం.