YCP Government: ఏపీలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో గెలుపునకు అన్ని రాజకీయ పక్షాలు ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించాయి. విపక్షాల నుంచి విమర్శలు వస్తున్నా వెరవకుండా జగన్ సర్కారు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. రాత్రికి రాత్రే ఉత్వర్వులు జారీచేసి అమలు చేస్తోంది. జగన్ తీసుకుంటున్న నిర్ణయాలను విపక్షాలు తప్పుపడుతున్నాయి. ప్రజల్లోకి వెళ్లి విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి. దీంతో కొన్నింటి విషయంలో వైసీపీ సర్కారు అబాసుపాలవుతోంది. ఉక్కిరిబిక్కిరవుతోంది. అటు ప్రజల నుంచి సైతం విమర్శలు, నిలదీతలు ఎదురవుతుండడంతో పునరాలోచనలో పడుతోంది. మరీ ముఖ్యంగా పాఠశాలల విలీన ప్రక్రియ విషయంలో ప్రజల నుంచి వచ్చిన వ్యతిరేకత అంతా ఇంతా కాదు. దశాబ్దాలుగా గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలల ఎత్తవేత నిర్ణయాన్ని సొంత పార్టీ శ్రేణులే తప్పుపడుతున్నాయి. కానీ ఇటువంటి సమయంలో ప్రభుత్వ చర్యలను సమర్థించారు లోక్ సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాష్ నారాయణ. పాఠశాలల విలీన ప్రక్రియ విషయంలో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న జగన్ సర్కారుకు ఇది కాస్తా ఊరట. ఇటువంటి సమయంలో చిన్న మాట సాయం కొండంత అండగా నిలుస్తుందనడంలో ఎటువంటి అతిశయోక్తి కాదు. అయితే కొన్ని సూచనలతో మాత్రమే జయప్రకాష్ నారాయణ ప్రభుత్వ చర్యలకు మద్దతు పలికారు. పాఠశాలల విలీన ప్రక్రియలో కొన్ని అంశాలను సరిదిద్దుకుంటేనే సత్ఫలితాలనిస్తాయని చెబుతున్నారు జేపీ. అయితే జేపీ తాజావ్యాఖ్యలపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. అన్నివర్గాలు వ్యతిరేకిస్తున్న తరుణంలో జేపీ ఇలా మాట్లాడడమేమిటని ఉపాధ్యాయవర్గాలు, మేధావులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు సైతం ప్రశ్నిస్తున్నారు.

పెద్ద దుమారం..
జాతీయ విద్యావిధానంలో భాగంగా ప్రాథమిక పాఠశాలల్లోని 3,4,5 తరగతులను కిలోమీటరు దూరంలో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో విలీనం చేశారు. మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాథమిక పాఠశాలలను సైతం ఉన్నత పాఠశాలల్లో కలిపేశారు. వాస్తవానికి ఈ నిర్ణయాన్ని రెండేళ్ల కిందటే అమలుచేయాలని ప్రభుత్వం ప్రయత్నించింది. కానీ ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని భావించి వెనక్కి తగ్గింది. ఈ ఏడాది కూడా విద్యాసంవత్సరం ప్రారంభానికి ఒక రోజు ముందు విలీనానికి సంబంధించి ఉత్తర్వులు జారీచేసింది. కనీసం వేసవి సెలవుల్లోనైనా విలీనానికి సంబంధించి ఏ సన్నాహాలు ప్రారంభించలేదు. పాఠశాల విద్యను బలోపేతం చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం చెబుతున్నా విద్యార్థులను, తల్లిదండ్రులను సంసిద్ధత చేయడంలో మాత్రం విఫలమైంది. కనీసం ఉపాధ్యాయుల చెవిలో సైతం ఈ విషయం వేయలేదు. అందుకే ఈ నిర్ణయం పట్ల ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చింది. ఎక్కడికక్కడే నిరసనలు పెల్లుబికాయి. అయినా ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. అటు ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు, యూనియన్లు సైతం నిరసన బాట పట్టాయి. మరోవైపు స్థానికుల నుంచి వచ్చిన వ్యతిరేకతతో చాలాచోట్ల విలీన ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేశారు. ఇటువంటి పరిస్థితుల్లో విద్యాధికుడు అయిన జయప్రకాష్ నారాయణ స్పందించారు. ఉపాధ్యాయులు గొప్ప వనరులని.. వారిని సరిగ్గా వినియోగించుకునేందుకు పాఠశాలల విలీన ప్రక్రియ కీలకమని వ్యాఖ్యానించారు. అయితే దీనిని సరిగ్గా అమలుచేస్తేనే మంచి జరుగుతుందని కూడా సూచించారు.
కీలక సూచనలు చేసిన జేపీ…
అదే సమయంలో జయప్రకాష్ నారాయణ ప్రభుత్వానికి కీలక సూచనలు చేశారు. పాఠశాల దూరమైతే బడి నిర్వహణ ఖర్చులు విద్యార్థుల రవాణాపై పెట్టాలని అభిప్రాయపడ్డారు. పాఠశాలలు, విద్యార్థుల లెక్కలను సైతం గణాంకాలతో వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థిపై ప్రభుత్వం రూ.91 వేలు ఖర్చు చేస్తోందన్నారు. అయినా విద్యా ప్రమాణాలు పెరగడం లేదని ఆందోళన వ్యక్తంచేశారు. ఇందులో ప్రభుత్వ లోటుపాట్లు ఉన్నాయని కూడా చెప్పుకొచ్చారు. అందుకే విలీన ప్రక్రియను తెరపైకి తెచ్చారని అభిప్రాయపడ్డారు. అయితే ప్రక్రియ సక్రమంగా జరగకుంటే మొదటికే మోసం వచ్చే ప్రమాదముందన్నారు. వైసీపీ సర్కారు విద్యా ప్రమాణాలు పెంచేందుకు బైజూస్ వంటి సంస్థలతో ఒప్పందం చేసుకోవడం శుభ పరిణామమన్నారు. ఇది ఆహ్వానించదగ్గ విషయమన్నారు. అయితే అమ్మఒడి విషయంలో మాత్రం చురకలు అంటించారు. 9 వేల కోట్లు ఖర్చుచేశారని.. కానీ తొమ్మిది కోట్ల రూపాయలతో కొత్త సాంకేతిక ప్రమాణాలతో విద్యావ్యవస్థను మెరుగుపరచవచ్చని గుర్తుచేశారు. అటు కొన్నిరకాల వైఫల్యాలను సైతం జేపీ ప్రస్తావించారు. కానీ పాఠశాలల విలీన ప్రక్రియ విషయంలో విమర్శల జడివానతో ఉక్కిరిబిక్కిరవుతున్న జగన్ సర్కారు నెత్తిన పాలుపోసేలా జేపీ వ్యాఖ్యానాలు చేయడం విశేషం.
[…] […]