CM Jagan : గెలిచే పార్టీని ఎవరైనా గెలిపిస్తారు. మరి ప్రజాభిమానం పోగొట్టుకున్న పార్టీని ఎవరైనా గెలిపించగలరా? ఇటువంటి క్లిష్ట పరిస్థితినే ఐ ప్యాక్ బృందం ఎదుర్కొంటోంది. మొన్నటివరకూ వారి నిర్ణయాలు వర్కవుట్ అయ్యాయి. వైసీపీ వరుస గెలుపులను ఐప్యాక్ తన ఖాతాలో వేసుకుంది. ఎప్పుడైతే ప్రభుత్వానికి, పార్టీకి ప్రతికూల ఫలితాలు ప్రారంభమయ్యాయో ఇక తమ వల్ల కాదని తెలిసిపోయింది. అందుకే జగన్ కు అసలు విషయం చెప్పింది. ఇప్పటివరకూ కోర్ ఓటు బ్యాంకు అంతా దూరమైందని.. చేరదీసుకోకుంటే మాత్రం మూల్యం తప్పదని హెచ్చరించింది. దీంతో జగన్ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు.
వరుస కార్యక్రమాలతో..
అయితే చేతులు కాలక ఆకులు పట్టుకున్న విధంగా ఇప్పుడు జయహో బీసీ, జయహో ఎస్సీ అంటూ కొత్త స్లోగన్ అందుకున్నారు. అందుకే వరుసగా ఎస్సీ, బీసీల కోసం ప్రత్యేకంగా జయహో కార్యక్రమాలు ప్లాన్ చేస్తున్నారు. పార్టీలో ఓ మాదిరి పదవులు పొందిన వారిని పిలిపించుకుని తమ కులానికి జగన్ ఎంతో చేశారని పొగిడించుకోవడం.. టీడీపీపై విమర్శలు చేయడం ఈ సమావేశాల ఉద్దేశం. ఇప్పటికే రాష్ట్రస్థాయిలో ఈ భజన జయహో కార్యక్రమాలను పూర్తిచేశారు. ఇప్పుడు కింది వరకూ తీసుకెళ్లి అన్నిచోట్ల ఎన్నికల సభలకు తలదన్నే రీతిలో సమావేశాలు పెట్టడానికి డిసైడ్ అయ్యారు.
ఎస్సీ నేతల తిరుగబాటు..
అయితే బీసీలను మభ్యపెట్టినట్టు ఎస్సీలను పెట్టాలని చూశారు. కానీ అది పెద్దగా వర్కవుట్ అయ్యేలా లేదు. జయహో ఎస్సీ పేరుతో గత వారం నిర్వహించిన సమావేశంలో పెద్ద రభసే చోటుచేసుకుంది. అసలు ఎస్సీలకు ప్రభుత్వం ఇచ్చిన నిధులు ఏమిటన్న ప్రశ్న ఉత్పన్నమైంది. అందరికీ ఇచ్చే పథకాలు తప్ప.. ఇక ఎస్సీలకు ప్రత్యేకంగా ఏం చేశారని సమావేశానికి వచ్చిన సొంత లీడర్లు మండిపడ్డారు. సబ్ ప్లాన్ నిధులను పక్కదారి పట్టిస్తున్నారన్న అసంతృప్తి ఎస్సీల్లో ఉందని నేరుగానే హైకమాండ్ కు చెప్పారు. అయితే అప్పటికప్పుడు సర్దుబాటు చేసి జగన్ సర్కారుకు పొగడ్తలు ఇప్పించుకున్నారు, షరా మామ్మూలుగా చంద్రబాబుపై తిట్ల దండకాన్ని పూనుకునేలా చేసి వాటినే గొప్పగా ప్రచారం చేసుకోవడం ప్రారంభించారు.
పనిలేని కార్పొరేషన్లు..
ఏపీలో 50కు పైగా కుల కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. వాటికి పాలకవర్గాలను ఏర్పాటుచేశారు. సొంత పార్టీల నేతలకు పదవుల దాహం తీర్చారే తప్ప.. వాటికి నిధులు లేవు.. విధులు లేవు. వాటి ద్వారా ఏ సమాజికవర్గానికి ప్రయోగం కల్పించిన దాఖలాలు లేవు. నవరత్నాల్లో లబ్ధిదారులు ఏ సామాజికవర్గానికి చెందిన వారైతే.. వారి లెక్క కట్టి .. ఇంత ఇచ్చామంటూ ప్రకటనలే తప్ప పైసా విదిల్చింది లేదు. నిజానికి ప్రభుత్వ విధానాల వల్ల దారుణంగా నష్టపోయిన వర్గాలు ఎస్సీ, ఎస్టీ, బీసీలు. వారికి ఉపాధి కరువైపోయింది. అలాంటి వారు కనీస ఆదాయాన్ని కోల్పోయి.. నిరుపేదలుగా మారుతున్నారు. ఏదో ఓ పని చేసుకుని గౌరవంగా బతుకుతున్న వారి కుటుంబాలు ఇప్పుడు రేషన్ బియ్యం కోసం… ప్రభుత్వం ఇచ్చే పథకాల డబ్బుల కోసం ఎదురు చూసేలా చేశారు. ప్రభుత్వ బాధిత వర్గాలుగా మార్చేశారు.