Rahul Gandhi questions Jay Shah : మనదేశంలో రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు నిబంధనల గురించి పట్టించుకోవు.. విధానాలను అమలు చేయలేవు. ఏకపక్షంగా వ్యవహరిస్తుంటాయి. నచ్చిన వాళ్లకు పదవులు ఇచ్చేస్తూ ఉంటాయి. నచ్చిన వాళ్లకు కాంట్రాక్టర్లు దక్కుతూ ఉంటాయి.. ఈ జాబితాలో అన్ని పార్టీల వ్యవహార శైలి అంతే.. కాకపోతే అధికారం దూరమైన తర్వాత రాజకీయ పార్టీలకు ఉన్నట్టుండి విలువలు గుర్తుకొస్తాయి. ప్రజాస్వామ్యం కళ్ళ ముందు కనిపిస్తుంది. నిబంధనలు అమలు చేయాలనే డిమాండ్ రాజకీయ పార్టీల నుంచి వ్యక్తమౌతూ ఉంటుంది.
తాజాగా ఇదే డిమాండ్ ను కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ వ్యక్తం చేశారు.. ప్రస్తుతం ఆయన బీహార్ రాష్ట్రంలో రెండవ విడత ఎన్నికల ప్రచారంలో ఉన్నారు.. ఓటు చోరీ.. ఆదాని కంపెనీలలో వ్యవహారాల మీద విమర్శలు చేస్తున్న ఆయన.. ఈసారి ఏకంగా అమిత్ షా కొడుకు మీద పడ్డారు. అమిత్ షా కొడుకు జై షా ప్రస్తుతం ఐసీసీ చైర్మన్గా ఉన్నారు. దానికంటే ముందు ఆయన బీసీసీఐ సెక్రటరీగా పని చేశారు. జై షా కు క్రికెట్ ఆడిన అనుభవం లేదని.. కనీసం ఆయన ఒక పరుగు కూడా చేయలేదని.. అటువంటి వ్యక్తికి ఐసీసీ బాధ్యతలు ఎలా అప్పగిస్తారని రాహుల్ గాంధీ ప్రశ్నించారు.. “మీరు కలలు కనాలంటే.. వాటిని నిజం చేసుకోవాలంటే కచ్చితంగా అమిత్ షా కుమారుడై పుట్టాలి.. లేదా అదాని లాగా ఉండాలి. అప్పుడే మీరు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీ కలలు సాకారం చేసుకోగలరు. ఎటువంటి అనుభవం ఉందని జై షాకు ఐసీసీ చైర్మన్ పదవి ఇచ్చారు. దానికంటే ముందు బీసీసీఐ సెక్రెటరీ చేశారు” అని రాహుల్ ఆరోపించారు.
రాహుల్ గాంధీ జై షా మీద చేసిన ఆరోపణ తర్వాత దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.. ఈ నేపథ్యంలో బిజెపి నాయకులు రాహుల్ గాంధీ విమర్శలకు కౌంటర్ ఇస్తున్నారు. ఎలాంటి క్రీడలు ఆడాడని ఖేల్ రత్న పురస్కారానికి ముందు రాజీవ్ గాంధీ పేరు జత చేశారని మండిపడుతున్నారు. జై షా గత ఏడాది డిసెంబర్లో ఐసీసీ చైర్మన్ పదవిని స్వీకరించారు. అంతకుముందు ఆయన బీసీసీఐ సెక్రటరీగా పని చేశారు.. ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా పని చేశారు. 2021 నుంచి 2024 వరకు ఆయన ఈ పదవిలో ఉన్నారు. రెండు సంవత్సరాల కాలానికి గత ఏడాది డిసెంబర్లో ఐసీసీ చైర్మన్ గా ఎన్నికయ్యారు.. ఐసీసీ వ్యవహారాలపై బిసిసిఐ కి విపరీతమైన పట్టు ఉంది. అందువల్ల జై షా కు ఈ పదవి దక్కింది అని తెలుస్తోంది..