Homeజాతీయ వార్తలుJapan : జపాన్ సంచలనం.. 6 గంటల్లో 3D ప్రింటెడ్ రైల్వే స్టేషన్

Japan : జపాన్ సంచలనం.. 6 గంటల్లో 3D ప్రింటెడ్ రైల్వే స్టేషన్

Japan : టెక్నాలజీ విషయంలో జపాన్‌ను మించిన దేశం లేదంటే అతిశయోక్తి కాదు. వాళ్లు చేసే ప్రతి పని ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తుంది. తాజాగా జపాన్ మరో సంచలనానికి తెరతీసింది. కేవలం ఆరు గంటల్లో హట్సుషిమా రైల్వే స్టేషన్‌ను 3D ప్రింటింగ్‌తో నిర్మించి అందరినీ షాక్‌కు గురి చేసింది. ఇది కలలో కూడా ఊహించలేని విషయం.. కానీ జపాన్ దీన్ని నిజం చేసి చూపించింది.

Also Read : జపాన్‌లో మరో భూకంపం.. క్యూషులో 6.2 తీవ్రత, మెగా క్వేక్‌ భయం!

జపాన్‌లోని వకాయామా ప్రాంతంలోని అరిడా నగరంలో ఉన్న హట్సుషిమా స్టేషన్ ఈ అద్బుతానికి వేదికగా మారింది. 1948లో నిర్మించిన ఒక చిన్నపాటి చెక్క స్టేషన్ ఇది. ప్రతిరోజూ దాదాపు 530 మంది ప్రయాణికులు ఇక్కడి నుండి రాకపోకలు సాగిస్తుంటారు. కాలం గడుస్తున్న కొద్దీ స్టేషన్ పాతబడిపోవడంతో, దాని స్థానంలో కొత్త స్టేషన్‌ను నిర్మించాలని వెస్ట్ జపాన్ రైల్వే నిర్ణయించింది.

ఈ భారీ ప్రాజెక్ట్‌ను పూర్తి చేసే బాధ్యతను Serendix అనే వినూత్న నిర్మాణ సంస్థకు అప్పగించారు. సమయం చాలా తక్కువగా ఉండటంతో, Serendix ఇంజనీర్లు ఒక తెలివైన ప్రణాళికను రూపొందించారు. నైరుతి క్యుషు ద్వీపంలోని ఒక ప్రత్యేక ఫ్యాక్టరీలో 3D ప్రింటింగ్ టెక్నాలజీని ఉపయోగించి స్టేషన్ వివిధ భాగాలను ముందుగానే తయారు చేశారు. ఈ భాగాలకు కాంక్రీట్ పూతలను కూడా అందించారు. ఇలా అన్ని భాగాలను సిద్ధం చేయడానికి దాదాపు వారం రోజుల సమయం పట్టింది.

ఆ తర్వాత, మార్చి 24న ఈ భారీ భాగాలన్నింటినీ లారీలపై దాదాపు 500 మైళ్ల దూరం రవాణా చేసి హట్సుషిమా స్టేషన్‌కు చేర్చారు. రాత్రిపూట రైళ్ల రాకపోకలు ఉండవనే విషయాన్ని తెలివిగా ఉపయోగించుకున్నారు. చివరి రైలు స్టేషన్ నుండి బయలుదేరిన వెంటనే, అంటే రాత్రి 11:57 గంటలకు నిర్మాణ పనులు మొదలుపెట్టారు. అబ్బురం కలిగించే విషయం ఏమిటంటే, కేవలం ఆరు గంటల కంటే తక్కువ సమయంలో అంటే తెల్లవారుజామున 5:45 గంటలకు మొదటి రైలు వచ్చే సమయానికి ఒక కొత్త, మెరిసే రైల్వే స్టేషన్ సిద్ధమైపోయింది.

Also Read : జపాన్‌కు భూకంప భయం.. ప్రమాదంలో 3 లక్షల ప్రాణాలు..!

అయితే, టికెట్ మెషిన్‌లు, ట్రాన్స్‌పోర్టేషన్ కార్డ్ రీడర్‌లను అమర్చడం వంటి కొన్ని చిన్న పనులు ఇంకా మిగిలి ఉన్నాయి. వెస్ట్ జపాన్ రైల్వే అధికారులు తెలిపిన ప్రకారం, జూలై నాటికి ఈ స్టేషన్ కోసం ఒక కొత్త భవనాన్ని కూడా నిర్మించనున్నారు. ఇంత తక్కువ సమయంలో, ఇంతటి అద్భుతమైన నిర్మాణం కేవలం జపాన్ వంటి టెక్నాలజీ దిగ్గజానికి మాత్రమే సాధ్యమవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

Japan

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular