TDP: సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్న నినాదంతో నాలుగు దశాబ్దాల కిందట పురుడు పోసుకున్న పార్టీ.. తెలుగుదేశం. తెలుగు సినీ వినీలాకాశంలో ధ్రువతారగా నిలిపిన ప్రజల రుణం తీర్చుకోవాలని నందమూరి తారక రామారావు ఆశయం నుండి వెలువడిందే టిడిపి. దేశాన్ని ఏకచత్రాధిపత్యంగా పాలిస్తున్న కాంగ్రెస్ కు వ్యతిరేకంగా తెలుగువారి ఆత్మ అభిమానం పేరిట పార్టీ పెట్టిన తొమ్మిది నెలల వ్యవధిలోనే అధికారంలోకి వచ్చిన ఘనత టిడిపి సొంతం. వందేళ్ల కాంగ్రెస్ పార్టీని అనతి కాలంలోనే పురుడుబోసుకున్న పార్టీ మట్టి కరిపించడం ఒక చరిత్రను తిరగరాసింది. ఎంతోమంది నేతలను ఈ జాతికి అందించింది కూడా టిడిపియే.
1983, జనవరి 5. తొలి తరం నాయకులకు ఈరోజు కచ్చితంగా గుర్తుంటుంది. ఈ రోజునే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. ఓ అసాధారణ విజయాన్ని సొంతం చేసుకుంది. సినిమావాడికి ఎవరు ఓట్లు వేస్తారులే అని చాలామంది ఎగతాళిగా మాట్లాడారు. ప్రజల్లో సైలెంట్ విప్లవం ప్రారంభమైంది. ఇప్పటిలా ప్రజాభిప్రాయాన్ని సేకరించే సర్వేలు లేవు. కానీ అందరి అంచనాలను పటాపంచలు చేస్తూ తెలుగుదేశం పార్టీ అద్భుత విజయాన్ని అందుకుంది. తెలుగు రాష్ట్రంలో 46% ఓట్లతో 201 సీట్లు సాధించింది. గతంలో కాంగ్రెస్ పార్టీ కూడా సాధించలేని విజయాన్ని.. టిడిపి తన ఖాతాలో వేసుకుంది.
నాయకుల తయారీ ఫ్యాక్టరీలా మారింది తెలుగుదేశం పార్టీ. తనతో పాటు ఎంతోమంది నాయకులను జాతికి అందించారు ఎన్టీఆర్. కనీస రాజకీయ అనుభవం లేనివారు సైతం ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా గెలుపొందారు. ముఖ్యంగా నేటితరం బీసీ నాయకులంతా నాడు టిడిపిలో అరంగేట్రం చేసిన వారే. కొందరు ఎన్నికల్లో ఖర్చు చేయడానికి కూడా డబ్బులు లేవు. అటువంటి వారికి ఎన్టీఆర్ స్వయంగా డబ్బులు సమకూర్చారు. అలాంటి నేతలు ఎందరో రాజకీయాల్లో రాణించి ఉద్దండులుగా మారారు. ఎర్రం నాయుడు, దేవేందర్ గౌడ్, కళా వెంకట్రావు, అయ్యన్నపాత్రుడు, యనమల రామకృష్ణుడు లాంటి బీసీ నాయకులంతా ఎన్టీఆర్ తయారుచేసిన వారే. 6 పదులు దాటిన నాయకులంతా టిడిపి మూలాలు ఉన్నవారే. ఓ విప్లవ ఉద్యమం, ప్రజల తీర్పుతో వందలాది మంది నాయకులు పుట్టుకొచ్చింది మాత్రం 1983, జనవరి 5న మాత్రమే.
ఎన్నో ప్రాంతీయ పార్టీలు వచ్చాయి. కానీ టిడిపి మాత్రం నిలదొక్కుకుంది. తన బలమైన పునాదులతో చెక్కుచెదరకుండా నిలిచింది. ఎన్నో రకాల సంక్షోభాలను ఎదుర్కొంది. బలహీనపరచడానికి జరిగిన ప్రయత్నాలను అధిగమించింది. ఒక ప్రాంతీయ పార్టీ పార్లమెంటులో ప్రధాన ప్రతిపక్షంగా నిలిచిన ఘనత కూడా తెలుగుదేశానిదే. 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది. సరిగ్గా తొమ్మిది నెలల వ్యవధిలోనే జనవరి 5న అధికారంలోకి వచ్చింది. తెలుగుదేశం ఏకపక్ష విజయం ప్రపంచాన్ని అబ్బురపరిచింది. ప్రజాస్వామ్య పద్ధతిలో తెలుగుదేశం నిర్వహించిన పాత్ర రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగాల్లో తెచ్చిన మార్పులు, ప్రవేశపెట్టిన ఆలోచనలు రాష్ట్ర అభివృద్ధికి దోహదపడ్డాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. అందుకే నిజమైన టిడిపి అభిమానికి జనవరి 5 నిజంగా గుర్తుండిపోతుంది.