Perni Nani : మంత్రి పదవిని అడ్డం పెట్టుకుని పేర్ని నాని పెద్ద ఎత్తున అక్రమాస్తులు కూడబెట్టుకున్నారని జనసేన పార్టీ కృష్ణాజిల్లా అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణ ఆరోపించారు. మచిలీపట్నం నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

మచిలీపట్నం పరిసర ప్రాంతాలతో పాటు విశాఖపట్నం, కైకలూరు వంటి ప్రాంతాలలో వందలాది ఎకరాల భూములను ఆక్రమించుకున్న పేర్ని నాని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఆస్తులు కూడబెట్టుకున్నారని ఆరోపించారు.
పేర్ని నాని అక్రమ ఆస్తులకు సంబంధించి పూర్తి స్థాయి ఆధారాలను త్వరలోనే తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ బయటపడతారని తెలిపారు. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడు ఏళ్లలో చేసిన అభివృద్ధి శూన్యమన్నారు.
మంత్రులు, మాజీ మంత్రులు అభివృద్ధిని విస్మరించారని రామకృష్ణ ఆరోపించారు. బందరు పోర్టు పేరుతో ఈ ప్రాంత ప్రజలను పేర్ని నాని మోసగించారన్నారు.
ఈ సమావేశంలో బందరు నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ బండి రామకృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి లంకిశెట్టి బాలాజీ తదితరులు పాల్గొన్నారు.