Janasena- Krishna District: వైసీపీలో బాగా నోరుండి బండ బూతులు తిట్టే నేతలు ఎవరయ్యా అంటే అందరూ ఠక్కున చెప్పే పేర్లు కొడాలి నాని, జోగిరమేశ్, పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్.. జగన్ కు నమ్మిన బంట్లుగా ఉండే వీళ్లకు మంత్రి పదవులు ఇచ్చాడు. కృష్ణ జిల్లాలో ఈ ఉద్దండ పిండాలు ప్రత్యర్థులను చెడుగుడు ఆడడంలో ఆరితేరారు. జగన్ పిలుపునిస్తే చాలు చంద్రబాబు నుంచి పవన్ కళ్యాణ్ వరకూ చెడుగుడు ఆడేస్తారు.

అయితే అన్ని రోజులు ఒకలా ఉండవు. వైసీపీ ఈ బూతు మంత్రులకు ధీటుగా ఇటీవల పవన్ కళ్యాన్ కౌంటర్లు ఇస్తున్నారు. చెప్పు చూపించి మరీ బుద్ది చెప్పాడు. అంతేకాదు.. ఈ నలుగురిని ప్రజాక్షేత్రంలోనే ఎదుర్కోవాలని పవన్ కళ్యాణ్ డిసైడ్ అయ్యారు.మొదటి నుంచి తనపై, తన పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్న వెల్లంపల్లి శ్రీనివాస్, కొడాలి నాని, పేర్ని నాని, జోగి రమేశ్ లకి కచ్చితంగా చెక్ పెట్టాల్సిందేనని జనసేనాని భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. విజయవాడ పశ్చిమ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, గుడివాడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడాలి నాని, మచిలీపట్నం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పేర్ని నాని ఓటమే లక్ష్యంగా పవన్ పావులు కదుపుతున్నారు.
ఇటీవల చంద్రబాబు కలిసిన సమయంలో కృష్ణా జిల్లాలో టీడీపీతో కలిసి జనసేన అవగాహన కల్పించుకోవాలని.. ఒకవేళ పొత్తు కుదిరితే మాత్రం ఈ నలుగురిని టార్గెట్ చేసి ఓడించాలని చర్చించుకున్నట్టు ప్రచారం సాగుతోంది. పొత్తులో సీట్ల సర్దుబాటు జరిగితే విజయవాడ పశ్చిమ, గుడివాడ, మచిలీపట్నం నియోజకవర్గాలను జనసేనకే ఇవ్వాలని టీడీపీని కోరే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. జగన్ ఆదేశాల మేరకు రెచ్చిపోయే వీరిని ప్రజాక్షేత్రంలో ఓడించే బుద్ది చెప్పాలని జనసేన బలంగా నిర్ణయించుకుంది.
పవన్ కళ్యాణ్ కృష్ణా జిల్లాపై ఫుల్ ఫోకస్ పెట్టారు. కొడాలి నాని, జోగి రమేష్, వెలంపల్లి శ్రీనివాసరావు,పేర్ని నానిలపై బలమైన అభ్యర్థులను దింపడానికి ఇప్పటినుంచే కసరత్తు ప్రారంభించారు.జనసేనకు చెందిన నేతలతోపాటు ఇక్కడ బలంగా ఉన్న వారిని జనసేనలో చేర్పించుకొని మరీ వారిని ఓడించడానికి స్కెచ్ గీస్తున్నారు.

విజయవాడ పశ్చిమలో వెల్లంపల్లి శ్రీనివాస్ మీద భారీగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇక్కడ జనసేన నుంచి పోతిన మహేశ్ పనిచేస్తున్నారు. ఆ వ్యతిరేకతను ఓట్ల రూపంలో మలుచుకుంటే చాలనే భావనలో మహేశ్ ఉన్నారు. మచిలీపట్నంలో కాపుల ఓట్లను సమీకరించగలిగితే పేర్ని నాని మీద విజయం సునాయమవుతుందనే భావనలో జనసేనాని ఉన్నారు. అక్కడ నుంచి ఎవరిని బరిలో దింపాలనే నిర్ణయాన్ని తర్వాత తీసుకుంటారంటున్నారు. ఇక గుడివాడలో కొడాలిని ఓడించడానికి, ఆయనకు ఓటర్లుగా ఉన్న తన అభిమానులను పార్టీవైపు తిప్పే ప్రయత్నాలను ప్రారంభించారు. పెడనలో జోగిరమేశ్ పై కూడా బలమైన అభ్యర్థిని బరిలోకి దింపి ఓడించేందుకు ప్లాన్ చేస్తున్నారు. సరైన అభ్యర్థి కోసం వేట మొదలుపెట్టారు. పొత్తు ఉన్నా లేకున్నా ఓడించేలా ప్రయత్నాలు ప్రారంభించారు. పవన్ కల్యాణ్ చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు సఫలీకృతమవుతాయో చూడాలి.