Janasena Social Media: మీడియా ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభం. ప్రజలు, పాలకులకు మధ్య వారధి. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చూసే శక్తి మీడియాకే ఉంది. అయితే ప్రస్తుతం మీడియా పాలకుల గుప్పిట్లో బంధీ అయింది. అధికారంలో ఉన్నవారి భజనలో తరిస్తోంది. దీంతో ప్రత్యామ్నాయంగా ఎదుగుతోంది సోషల్ మీడియా. సోషల్ మీడియాలో బలంగా ఉంటే వాళ్లవే రోజులు. అది సినిమా హీరో అయినా, పొలిటికల్ పార్టీ అయినా. గత కొన్నాళ్లుగా జనసేన సోషల్ మీడియా విభాగం దూకుడుగా వ్యవహరిస్తోంది. అంతే కాదు విభిన్నంగా ఆలోచిస్తోంది.
రెండు రకాల ట్రెండ్స్..
సోషల్ మీడియాలో రెండు మూడు రకాల ట్రెండ్‌లు ఉన్నాయి. ఒకటి ట్రోల్ చేయడం. అదే కీలకంగా వుంటుంది సోషల్ మీడియాలో ఈ విషయంలో ఏపీలోని వైఎస్సార్‌సీపీ ముందంజెలో ఉంది. కానీ ఈ టైపు వల్ల పెద్దగా ఉపయోగం లేదు. వైరి పక్షం మీద విరుచుకుపడిపోవడం, తిట్లు, ఘాటు విమర్శలతో.. ఇలా చేయడం వల్ల స్వపక్షం వాళ్లు మాత్రమే కాస్త ఆనందిస్తారు. మన వాళ్లు గట్టిగా ఇస్తున్నారులే అని సంబర పడతారు.
సరికొత్తగా జనసేన షోషల్ మీడియా..
అలా కాకుండా ఆలోచింప చేసేలా ఓ స్ట్రాటజీ తీసుకుని, ఆ స్ట్రాటజీ ఆధారంగా కంటెంట్ తయారు చేసుకుని, దాన్ని తమపై వస్తున్న ట్రోలింగ్ లేదా విమర్శలకు వాడడం అనే కొత్త పద్దతిని మొదలు పెట్టింది జనసేన. ఇక్కడ జనసేనకు అడ్వాంటేజ్ ఏమింటంటే వైసీపీకి జనసేన మీద ఇలా చేయడానికి వేరే పాయింట్లు లేవు. ఎందుకంటే జనసేన ఇప్పటి వరకు పాలక పక్షంగా లేదు. అందువల్ల వైఫల్యాలను ఎత్తిచూపే అవకాశం అధికార పార్టీకి లేదు.
మంత్రులు, అనుచరులపై ఫోకస్..
ఇక జనసేన సోషల్ మీడియా ఇప్పుడు జగన్ మీద కన్నా అతని మంత్రులు, అనుచరగణం మీద ఎక్కువ దృష్టి పెట్టింది. ఎవరు యాక్టివ్ గా ఉంటే వారిని విమర్శలతో టార్గెట్ చేస్తోంది. ఉదాహరణకు మంత్రి రోజా అసలు మంత్రిగా ఏం సాధించారు.. ఏం చేశారు.. చెప్పండి అంటూ నిలదీస్తోంది. ఇలా చేయడం వల్ల కేవలం విరుచుకుపడడం, రొడ్డ కొట్టుడు విమర్శలు చేయడం అనే రొటీన్ వ్యవహారం కాదు. ప్రశ్నలు, పాయింట్‌లతో టార్గెట్ చేయడం. అదే సమయంలో గ్రౌండ్ లెవెల్‌లో సమావేశాలు నిర్వహించి వాటిని సోషల్ మీడియాలోకి తెస్తున్నారు. అధికార వైసీపీ ఇలాంటి ప్రయత్నాలేవీ చేయడం లేదు. ఎంత సేపూ తిట్టడం.. తిట్టడం.. తిట్టడం. ఇది జనాలకు చికాకు తెప్పిస్తుంది.
కన్‌స్ట్రక్టివ్ క్రిటిసిజమ్‌తో..
జనసేన తిట్ల వ్యవహారం పదిశాతానికి పరిమితం చేసింది. 90 శాతం కన్‌స్ట్రక్టివ్ క్రిటిసిజమ్‌కు ఇస్తోంది. ఇందుకు కంటెంట్ ఎక్కడి నుంచి వస్తోంది. జనసేనకు అంత బలమైన కంటెంట్ వింగ్ వుందా? లేక తెలుగుదేశం పార్టీ కి మొదటి నుంచి ఉన్న బలమైన రీసెర్చ్ వింగ్ సహకరిస్తోందా అన్న అనుమానం ఉండొచ్చు. కానీ దాని వల్ల జరగాల్సిన కార్యం జరుగుతోంది. ఒక విధంగా చెప్పుకోవాలంటే టీడీపీ సోషల్ మీడియా వింగ్ కూడా ఈ విషయంలో వెనుకబడే వుంది. గత ఎన్నికల టైమ్ లో డేటా సేకరణ మీద వైసీపీ నేతలు టీడీపీని విమర్శించారు. ఇప్పుడు ఆ వీడియోలను తీసుకుని, ఇప్పుడు చేసినట్లు కలర్ ఇస్తూ జనసేన సోషల్ మీడియా వింగ్ ప్రచారం ప్రారంభించింది.
మొత్తం మీద ఇప్పటికి మాత్రం సోషల్ మీడియా ప్రచారం లేదా ఎదురుదాడిలో జనసేన శతృఘ్ని టీమ్ ముందు ఉందనడంలో సందేహం లేదు.