Janasena Pawan Kalyan: జనసేనాని పవన్ కళ్యాణ్ పొలిటికల్ హీట్ పెంచారు.అధికార పార్టీని ఉలిక్కిపడేలా చేశారు. వచ్చే ఎన్నికల్లో పొత్తులు ఉంటాయని స్పష్టం చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కడతాయని చెప్పుకొచ్చారు. ఫ్యాక్షన్ రాజకీయాలకు స్వస్తిచెప్పేందుకు మూడు పార్టీల కలయిక ఆవశ్యకత గురించి ఢిల్లీ పెద్దలకు వివరించినట్టు ప్రకటించారు. అధికార వైసీపీలో ప్రకంపనలకు ఇవే కారణమవుతున్నాయి. ఢిల్లీ పెద్దల నుంచి సంకేతాలు వచ్చిన తరువాతే పవన్ ఈ ప్రకటనలు చేసి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సహజంగా పవన్ ప్రకటనతో చంద్రబాబు ఖుషీ అవుతుండగా..జనసేన శ్రేణులు మాత్రం నిరాశ చెందుతున్నాయి.సందట్లో సడేమియా అన్నట్టు టీడీపీ శ్రేణులకు మాత్రం ఇది మింగుడుపడడం లేదు.
ఆ ఒక్క ప్రకటనతో..
సీఎం పదవి వరించేలా ఉండాలి.. కానీ దాని కోసం వెంపర్లాడకూడదు. కష్టపడి పనిచేస్తే ఆటోమెటిక్ గా పదవి తానంతట తానే వస్తుందని పవన్ స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో తనకు సీఎం పదవి తప్పనిసరి కాదని.. వైసీపీ విముక్త ఏపీయే తన లక్ష్యమని పవన్ చెప్పినట్టు విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే పవన్ నోటి నుంచి ఆ ఒక్క మాటే కాదని.. తమకు ఓటింగ్ పెరిగిందని.. తమ గౌరవానికి తగ్గట్టు సీట్లు ఇవ్వాల్సిందేనని చెప్పడం ద్వారా బంతిని తన కోర్టులో ఉంచుకున్నారు. గత ఎన్నికల్లో 7 నుంచి 8 శాతం వరకూ ఓట్లు లభించాయని.. ఇప్పుడు రెట్టింపయ్యిందని.. బలంగా ఉన్నచోట 30శాతంవరకూ పెరిగిందని పవన్ గుర్తుచేశారు. అంటే తాను సీట్ల పరంగా వెనక్కి తగ్గలేదని పవన్ సంకేతాలిచ్చారున్న మాట.
గౌరవం అన్న పదంతో…
గౌరవముంటేనే పొత్తులుంటాయని పవన్ పదే పదే చెబుతున్నారు. ఇప్పుడు సీఎం పదవిపై ఒక రకమైన క్లారిటీ వచ్చిన తరుణంలో సీట్లపైనే ఇప్పుడు చర్చ నడుస్తోంది. వచ్చే ఎన్నికల్లో 40 సీట్లు జనసేన డిమాండ్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. టీడీపీ మాత్రం 20కు మించి సీట్లు ఇవ్వలేమని చెబుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. అందుకే పవన్ రూటుమార్చారని తెలుస్తోంది. అయితే ఈ పరిణామంతో టీడీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. ఎంతమంది త్యాగరాజులు కావాల్సి ఉంటుందోనని లెక్కలు వేసుకుంటున్నాయి. ప్రధానంగా గోదావరి, ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లోని టీడీపీ నాయకులు హడలెత్తిపోతున్నారు.
సీట్ల పంపకం జఠిలం..
సీఎం పదవి వద్దని చెప్పటం ద్వారా పొత్తు మార్గం క్లియర్ చేసిన పవన్..ఇప్పుడు చంద్రబాబు కు ముందు 40 సీట్ల వరకు డిమాండ్ పెట్టేందుకు సిద్దమైనట్లు విశ్వసనీయ సమాచారం. టీడీపీ 20 సీట్ల వరకు జనసేనకు ఇచ్చేందుకు సిద్ధమైందని చెబుతున్నారు. బీజేపీ కూడా కలిస్తే ఈ సంఖ్య మరింత పెరగనుంది. అదే ఇప్పుడు టీడీపీలో అసలు సమస్యగా మారుతోంది. మొత్తంగా 40-45 సీట్లు పొత్తులో భాగంగా వదులుకోవటానికి టీడీపీలో అభ్యర్దులు త్యాగరాజులుగా మారాల్సిన అవసరం ఉంటుంది. ఇది వైసీపీకి అనుకూలంగా మారే అవకాశం ఉందనే అభిప్రాయం వినిపిస్తోంది. దీంతో, సీట్ల విషయంలో ఇప్పుడు పవన్ ప్రతిపాదనలు..చంద్రబాబు నిర్ణయాలు టీడీపీ ఆశావాహుల్లో కొత్త ఆందోళనకు కారణమవుతోంది. దీనిపై కొద్దిరోజుల్లో మరింత క్లారిటీ రానుంది.