
Janasena : ఏపీలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత దాదాపు తొంభై శాతం మంది ఒక విషయంలో ఏకాభిప్రాయానికి వచ్చారు. అదేమంటే.. జనసేనాని ప్యాకప్ చెప్పేసి వెళ్లిపోతారని. కానీ.. వారి అంచనాలను తలకిందులు చేశారు పవన్. తాను టైమ్ పాస్ రాజకీయాలు చేయడానికో.. అదృష్టాన్ని పరీక్షించుకోవడానికో రాలేదని చాటి చెప్పారు. సుదీర్ఘ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నానని చెప్పిన పవన్.. అన్నట్టుగానే రాజకీయాల్లో కొనసాగారు. ఓడిపోయినా.. ప్రజల మధ్యే ఉంటానని నిరూపించుకున్నారు. ఇప్పుడు పవన్ విషయంలో జనాలకు ఈ క్లారిటీ వచ్చేసింది.
అయితే.. ప్రజాఉద్యమాలపై ఎలాంటి పోరాటం చేయగలరు? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. కేంద్రంలోని బీజేపీతో పొత్తు కారణంగా.. పలు విషయాల్లో పవన్ కల్యాణ్ కావాల్సినంతగా స్పందించలేకపోతున్నారనే అభిప్రాయం బలంగానే ఉంది. ఇక, రాష్ట్ర ప్రభుత్వంపై ఇతర సమస్యలపై ఉద్యమించడానికి రెండేళ్లుగా కరోనా పరిస్థితులు ఆటంకంగా మారాయి. ఇందులో పవన్ కూడా కరోనా బారిన పడి విశ్రాంతి తీసుకున్నారు. దీంతో.. పవన్ ప్రత్యక్ష పోరాటం పూర్తిగా మొదలు కాలేదనే చెప్పాలి.
ఈ క్రమంలో ఏపీలో ధ్వంసమైన రహదారులను బాగుచేసే కార్యక్రమాన్ని తీసుకుంది జనసేన. నిజానికి.. రహదారిపై గుంతలు అనేది చూడడానికి చాలా చిన్న సమస్యలా కనిపిస్తుంది. ఒక చోట కనిపిస్తే చిన్న సమస్య. కానీ.. దారి పొడవునా ఉంటే..? జిల్లాలను కలుపుతూ.. రాష్ట్రం మొత్తం గుంతలమయమైతే..? ఖచ్చితంగా పెద్ద సమస్యే. వీటి కారణంగా ప్రయాణం సౌకర్యంగా లేకపోవడం ఒకెత్తయితే.. ప్రమాదాలు జరగడం మరొక ఎత్తు. ఇప్పుడు.. ఈ సమస్యనే ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకు నడుం బిగించారు జనసైనికులు.
ఇందుకోసం మూడు రోజుల ఆన్ లైన్ ఉద్యమాన్ని చేపట్టారు. దీంతో.. ‘‘జేఎస్పీ ఫర్ ఏపీ రోడ్స్’’ పేరుతో సోషల్ మీడియాలో దెబ్బతిన్న రోడ్ల చిత్రాలను పోస్టు చేస్తున్నారు జనసేన కార్యకర్తలు. రెండు రోజులు ముగిసే సమయానికి.. దాదాపు 2 లక్షల ట్వీట్లను చేశారు జనసైనికులు. ఇవన్నీ చూస్తున్న వారు.. రాష్ట్రంలో రహదారుల దుస్థితి మరీ ఇంత అధ్వానంగా ఉందా? అని కామెంట్లు చేస్తున్నారు. ఎవరి సమీపంలో రోడ్లు దెబ్బతిన్నా.. ఈ నెంబర్ కు వాట్సాప్ చేయాలంటూ 76619 27117 అనే నంబర్ ను ఏర్పాటు చేశారు జనసైనికులు.
వీరి ఆన్ లైన్ ఉద్యమం ఆషామాషీగా ఏమీ సాగలేదు. రెండు లక్షల ట్వీట్లతో.. ట్విటర్ ట్రెండింగ్ లో టాప్-5లో నిలిచింది. ప్రభుత్వం స్పందించి, తగిన చర్యలు తీసుకోకపోతే.. ఈ ఉద్యమం రోడ్లమీదకు వస్తుందని హెచ్చరిస్తున్నారు. కాగా.. జనసేన కార్యకర్తలు తమ వంతుగా శ్రమదానం చేసి రోడ్లను బాగు చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం పవన్ కల్యాణ్ కూడా రెండు రోజులపాటు శ్రమదానం చేస్తానని ప్రకటించారు. ప్రభుత్వం స్పందించకపోతే.. గాంధీ జయంతి తర్వాత ఉద్యమం ఉధృతం చేస్తామని జనసేన నాయకులు చెబుతున్నారు.