Pawan Kalyan: ఏపీలో ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయా.. మరో ఆరు నెలల్లో వైసీపీ ప్రభుత్వం రద్దవుతుందా.. తెలంగాణతోపాటు ఐదు రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలతోపాటే ఏపీకి ఎన్నికలు జరుగుతాయా అంటే.. అవుననే అంటున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఆరు నెలల్లో ఏపీలో ఎన్నికలు జరుగుతాయని, క్యాడర్ సిద్ధంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇదే సమయంలో వచ్చే ఎన్నికల్లో ఎవరితో పొత్తు ఉంటుందని అనే విషయంపైనా క్లారిటీ ఇచ్చారు. వైసీపీని గద్దె దించడమే లక్ష్యంగా కార్యకర్తలను కార్యోణ్ముఖులను చేస్తున్నారు.
త్వరలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు..
దేశంలో ఈ ఏడాది చివరన ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరుగనున్నాయి. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరం అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల సంఘం ఇప్పటికే కసరత్తు మొదలు పెట్టింది. అదే సమయంలో ఏపీలోనూ అసెంబ్లీ ఎన్నికలు జరుగతాయని ఊహాగానాలు వచ్చాయి. రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి ముందస్తు ఎన్నికల అంశం మరోసారి తెరమీదికి వచ్చింది. అయితే ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి మాత్రం ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనే లేదంటున్నారు. ఈమేరకు ఇటీవల కేబినెట్ భేటీలోనూ స్పష్టత ఇచ్చారు. అయినా ముందస్తు ఊహాగానాలకు తెరపడడం లేదు.
ముందస్తుకు సిద్ధమవుతున్న జన సేనాని..
ముందస్తు ఊహాగానాల నేపథ్యంలో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. త్వరలోనే ఏపీలో ముందస్తు ఎన్నికలు వస్తాయని అంచనా వేశారు. ఆరు నెలల్లో ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతాయని స్పష్టంగా చెబుతున్నారు. డిసెంబర్‌లో తెలంగాణతోపాటు ఏపీ అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.
సిద్ధంగా ఉండండి..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు.. ఏపీలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో జనసేనాని క్యాడర్‌కు దిశానిర్దేశం చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే మంగళగిరిలో పార్టీ కేంద్ర కార్యాలయానికి భూమిపూజ చేసిన అనంతరం పవన్ కల్యాణ్.. పార్టీ తెలంగాణ శాఖ నాయకులతో సమావేశం అయ్యారు. డిసెంబర్‌లో తెలంగాణ అసెంబ్లీతోపాటు ఏపీలోనూ ఎన్నికలు జరుగుతాయని, తెలుగు రాష్ట్రాలు రెండూ ఉమ్మడిగా కలిసి ఎన్నికలకు వెళ్తాయని సూచించారు. ఎన్నిలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని తెలిపారు.
పొత్తలుపైనా స్పష్టత..
ఇక వచ్చే ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల్లో ఎవరెవరితో జనసేనకు పొత్తు ఉంటుందనే విషయంలోనూ జనసేనాని స్పష్టత ఇచ్చినట్లు తెలుస్తోంది. కుదిరితే పొత్తులు ఉంటాయని, లేదంటే ఒంటరిగా బరిలో దిగుదామని క్యాడర్‌కు క్లారిటీ ఇచ్చారు. ఒంటరిగా పోటీ చేయాల్సి వస్తే అందుకు సంబంధించిన వ్యూహాలు కూడా ఉన్నాయని తెలిపారు. త్వరలోనే పొత్తులపై క్లారిటీ ఇస్తానని పేర్కొన్నారు. ఎలాంటి పరిస్థితిని ఐయినా ఎదుర్కొనేందుకు, వచ్చే ఎన్నికల్లో పట్టు విడుపు లేకుండా పోరాడేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు.