Janasena: జనసైనికుల వాడి పెరిగింది. జనసేన నేతల బేస్ పెరిగింది. అధికార వైసీపీ కౌంటర్లకు ఎన్ కౌంటర్లతో విరుచుకుపడుతున్నారు. ఎక్కడా తగ్గేదేలే అన్నట్టుగా కౌంటర్లు ఇస్తున్నారు. ‘సీబీఐ దత్తపుత్రుడు’ అంటూ పవన్ మొదలుపెట్టిన విమర్శల వాడిని జనసేన నేతలు ముందుకు తీసుకెళుతున్నారు. ప్రజాసమస్యలు చర్చించకుండా పారిపోయిన జగన్ రెడ్డి అంటూ జనసేన నేతలు కొత్త పల్లవి అందుకున్నారు. టీడీపీతో ముడిపెట్టి విమర్శిస్తున్న వైసీపీకి గట్టి కౌంటర్లు ఇస్తున్నారు. టీడీపీని గతంలోనే విమర్శించిన పవన్ చరిత్రను చాటిచెబుతున్నారు.

‘తెలుగుదేశం పార్టీ చేసిన తప్పిదాలను ప్రశ్నించిన పార్టీ కేవలం జనసేన మాత్రమేనని జనసేన పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు అన్నారు. 2014లో ప్రతిపక్షంలో ఉన్న జగన్ రెడ్డి కనీసం అసెంబ్లీకు రాకుండా, బాధ్యతలను విస్మరించి అధికార దాహంతో ఉంటే తెలుగుదేశం ప్రభుత్వాన్ని అప్పట్లోనే నిలదీశామన్నారు. అసెంబ్లీ నుంచి పారిపోయిన జగన్ రెడ్డికి ఇవేవీ గుర్తుండకపోవడం శోచనీయమని గుంటూరు జనసేన పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సొంత డబ్బులు ఖర్చు చేయడం తెలియని ఈ ముఖ్యమంత్రికి తన స్వేదం చిందించి సంపాదించిన డబ్బును సాయం చేస్తున్న పవన్ కళ్యాణ్ గారి గురించి కనీసం మాట్లాడే అర్హత లేదన్నారు.
ఈ సమావేశంలో గాదె వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ‘‘ఇంట్లో కూర్చొని బటన్ నొక్కి అదే పాలన అనుకొని ‘మమ’ అనిపించిన ముఖ్యమంత్రిని జనంలోకి తీసుకొచ్చి బటన్ నొక్కించిన విజయం కచ్చితంగా జనసేనదే. పవన్ కళ్యాణ్ రోడ్డుపైకి వచ్చి రైతులను ఆదుకోవడం చూసి, ఈ ముఖ్యమంత్రికి భయం పట్టుకుంది. దీంతో తాను బయటకు రాకపోతే జనం ఛీత్కరించుకుంటారని అర్థం అయింది. ఇప్పుడు ఏకంగా తన స్థాయిని మరచి ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. 2014లో అప్పటి పరిస్థితులను బట్టి తెలుగుదేశం పార్టీకి ఎన్నికల్లో మద్దతు ఇచ్చినా, ప్రజలకు వ్యతిరేకంగా ఏ నిర్ణయం వచ్చినా ధైర్యంగా ప్రశ్నించాం. ప్రజా సమస్యలు మీద మాట్లాడాల్సిన జగన్ రెడ్డి కనీసం అసెంబ్లీకు కూడా వెళ్లలేదు. వారి సమస్యలపై ఒక్కసారి కూడా అప్పటి ప్రభుత్వాన్ని నిలదీయలేదు. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను పారదర్శకంగా ఆదుకోవాలని చూస్తున్న పవన్ కళ్యాణ్ గారిపై ఇష్టానుసారం మాట్లాడితే అది బూమరంగ్ అయి ముఖ్యమంత్రిగారిపైకే వెళ్తుంది. అది గుర్తుంచుకుంటే మేలు. ముఖ్యమంత్రి మాటను.. ముఖాన్ని చూడలేక ప్రజలు సభకు వచ్చిన 10 నిమిషాలకే వెళ్లిపోతున్నారు. అంటే ప్రజల నుంచి ఎంత వ్యతిరేకత వస్తుందో తెలుసుకోండి.
* పారదర్శకత లేనిది మీకే..
మీరు పదేపదే మాట తప్పను.. మడమ తిప్పను అంటారు. రాజకీయాల్లో పారదర్శకత మీద లెక్చర్లు ఇస్తారు. మరి మీకు ఉన్న విశ్వసనీయత ఎంత..? అధికారంలోకి వచ్చాక ఎన్నిసార్లు మడమ తిప్పారో గుర్తుందా..? సీపీఎస్ విధానాన్ని అధికారంలోకి వచ్చిన వారంలోనే రద్దు చేస్తామన్నారు.. ఏమైంది..? కౌలు రైతులకు సైతం రైతు భరోసా ఇస్తాం అని చెప్పారు? ఇప్పటివరకు దాని ఊసే లేదు. రైతు భరోసా కింద ఇస్తున్న డబ్బు కేంద్రానిదే. మద్య నిషేధం పూర్తిగా గాలికొదిలేశారు. ఇన్ని మాటలు తప్పిన మీరు నైతికంగా ఆలోచిస్తే వెంటనే రాజీనామా చేయాలి. మీకు, మీ ప్రభుత్వానికి ప్రజల్లో విశ్వసనీయత లేదు. రాష్ర్ట ప్రజల్లో మీ మీద అన్నీ విషయాల్లోనే వ్యతిరేకత ఉంది. ఇప్పటికైనా కళ్లు తెరిచి పాలన చక్కదిద్దుకోకపోతే వచ్చే ఎన్నికల్లో తగిన శాస్తి తప్పదు. ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజలు కూడా ఆలోచించడం మొదలుపెట్టారు. తమ బతుకులకు భరోసా ఇస్తుంది ఎవరు..? ప్రజా సమస్యలపై పోరాడుతుంది ఎవరో గుర్తిస్తున్నారు. కచ్చితంగా మీకు పరాభవం తప్పదు’’ అని గాదె వెంకటేశ్వరరావు నిప్పులు చెరిగారు.