Janasena: జనసేన తెలంగాణలో విస్తరిస్తోంది. ఆంధ్రా మూలాలున్న ఖమ్మం జిల్లాలోనూ పార్టీకి పునాదులు పడుతున్నాయి. అక్కడ యాక్టివ్ నేతలు, కార్యకర్తలు జనసేన కోసం పాటుపడుతున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన ఓ జనసేన కార్యకర్త మరణిస్తే ఆయన కోసం ఏకంగా పార్టీలో పవన్ కళ్యాణ్ తర్వాత కీలక నేత నాగబాబు కదిలివచ్చారు. ఆ జనసేన కుటుంబానికి లక్ష రూపాయలను పార్టీ తరుఫున అందించి ఉదారత చాటుకున్నారు. ఖమ్మం జిల్లాలో జనసేన క్షేత్రస్థాయిలో బలంగా ఉన్న తీరు చూసి నాగబాబు హర్షం వ్యక్తం చేశారు.

తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లోని ప్రతీ పల్లెలో జనసేన పార్టీ బలంగా విస్తరిస్తోందని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు కొణిదెల నాగబాబు స్పష్టం చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా సోమవారం సీతారామపురంలో జెండా దిమ్మెను ఆవిష్కరించిన అనంతరం నాగబాబు మాట్లాడారు. పార్టీ శ్రేణులు రాజ్యాధికారం లక్ష్యంగా పని చెయ్యాలని సూచించారు. జన సైనికుల ఉత్సాహం ఎన్నికల సమయంలో జనసేనకు ఓట్లు వేయించే స్థాయిలో ఉపయోగ పడాలని అన్నారు. గ్రామాల్లో జనసేన విస్తరిస్తోన్న తీరు చూస్తుంటే జనసేన కోసం పని చేయాలనే ఆకాంక్ష అందరిలో పెరుగుతోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇంఛార్జి రామ్ తాళ్లూరి పాల్గొన్నారు.

* క్రియాశీలక కార్యకర్తకు ప్రమాద బీమా చెక్ అందజేసిన నాగబాబు
ఉమ్మడి ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో రోడ్డు ప్రమాదానికి గురైన జనసేన క్రియాశీలక కార్యకర్త ఆళ్ళ నవీన్ కి నాగబాబు చేతుల మీదుగా నలభై వేల రూపాయల ప్రమాద బీమా చెక్, తాళ్లూరి రామ్ తరఫున రూ.60 వేల చెక్ అందజేశారు. జనసేన తెలంగాణ రాష్ట్ర విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శి మిరియాల రామకృష్ణ అధ్యక్షతన సత్తుపల్లిలో జరిగిన ఈ కార్యక్రమంలో జనసేన పొలిట్ బ్యూరో సభ్యులు అర్హమ్ ఖాన్ గారు, తెలంగాణ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు వంగ లక్ష్మణ్ గౌడ్, విద్యార్థి విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గోకుల రవీందర్ తదితరులు పాల్గొన్నారు.