Pawan Kalyan Tweets: జనసేన అధినేత వరుస ట్విట్లు…ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ప్రత్యర్థుల ఎత్తులు చిత్తులు చేసేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. ‘ఇప్పటి వరకు మనల్ని తిట్టిన నాయకులు సడెన్ గా మనల్ని పొగడ్డం ప్రారంభిస్తారు. ఆ పొగడ్తలను చూసి ఆ నాయకుడు మారిపోయాడు, పరివర్తన చెందాడని మనం భావించి చప్పట్లు, ఆనందకరమైన ఎమోజీలు పెడితే ప్రత్యర్థుల లక్ష్యం నెరవేరినట్లే’…‘అప్పటి వరకు తిట్టిన నాయకులు ఇప్పుడు ఎందుకు పొగుడుతున్నారని ఆలోచించాలి. పొగుడుతున్నాడు కదా అని ఆ నాయకుడిని హర్షాతిరేకాలతో ఆకాశానికి ఎత్తకండి. అది మైండ్ గేమ్ లో ఒక భాగమే అని గుర్తెరగండి’..జనసైనికులనుద్దేశించి పవన్ వరుసగా చేసిన ట్విట్లవి. ఒక్కసారిగా అధినేత రియాక్టు కావడం ఏమిటని రాష్ట్ర వ్యాప్తంగా జన సైనికులు ఆరా తీయడం ప్రారంభించారు.
ఇంతకీ ఆ పొడిగిన నాయకుడెవరబ్బా అని తెలుసుకునే ప్రయత్నం చేశారు. చివరకు కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అని తెలియడంతో ఓకింత షాక్ కు గురయ్యారు. పవన్ కల్యాణ్‌పై అవకాశం వచ్చినప్పుడల్లా విమర్శల దాడికి దిగే చంద్రశేఖరరెడ్డి తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్‌తో మాట్లాడుతూ పవన్‌కు అనుకూల వ్యాఖ్యలు చేశారు. జనసేన, తెలుగుదేశం కలిసి పోటీ చేసి పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి అభ్యర్థి అయితే కాపులు పవన్‌కే ఓట్లేస్తారని, కాపులతో ఎంత సన్నిహిత సంబంధాలున్నా నాకు కూడా ఓటేయరని ద్వారంపూడి వ్యాఖ్యానించడం కొసమెరుపు. ఈ వ్యాఖ్యలు కొందరు జన సైనికుల్లో జోష్ నింపాయి. పవన్ సత్తా ఏంటో వైసీపీ ఎమ్మెల్యేకు కూడా తెలిసిందని ట్విట్టర్‌లో ద్వారంపూడి వీడియోను వైరల్ చేశారు. ఆ వీడియో జనసేన అధిష్టానం దృష్టికి వెళ్లడంతో పవన్ ఈ ‘జర భద్రం’ అంటూ ట్వీట్లు చేసినట్లుగా సమాచారం.
Also Read: Pawan Kalyan Tweet: తిట్టినోళ్లు పొగుడుతున్నారు.. పవన్ ట్వీట్ వెనుక అసలు కథ ఇదే!
ఆది నుంచి పవన్ అంటే గిట్టదు..
జనసేన ఆవర్భావం నుంచి ఆ పార్టీపై చంద్రశేఖర్ రెడ్డి ఒంటి కాలిపై లేచేవారు. పవన్ కల్యాణ్ పేరెత్తితే చాలు తిట్ల దండకంతో పూనకం వచ్చినట్లు అయిపోతారు. ఎడాపెడా విమర్శలతో దాడి చేసేవారు. గడిచిన రెండున్నరేళ్లుగా పవన్‌కళ్యాణ్‌ను ద్వారంపూడి నిందించినంతగా వైసీపీలో మరో నేత ఎవరూ విమర్శలు చేయలేదంటే అతిశయోక్తి కాదు. ఒక రకంగా జగన్ మెప్పు కోసం పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితంపై ఎన్నో మాటలు తూలనాడారు. ఎమ్మెల్యే ద్వారంపూడి తిట్ల దండకం నేరుగా పవన్‌ను తాకింది. దీంతో పవన్ కూడా పలుసార్లు- “తేల్చుకుందాం.. సిద్ధంగా ఉండండి..” అన్న రేంజ్‌లో పలు బహిరంగ సభల్లో హెచ్చరిక సంకేతాలు ఇచ్చి హీట్ పెంచారు. ఇందులో భాగంగానే వచ్చే ఎన్నికల్లో కాకినాడ సిటీ నియోజకవర్గంలో స్వయంగా పవన్ కల్యాణే బరిలో నిలవబోతున్నట్లుగా జోరుగా ప్రచారం జరిగింది. ఎమ్మెల్యే ద్వారంపూడిని రాజకీయంగా అడ్రస్ లేకుండా చేసేలా పవన్ ఈ నియోజకవర్గంలో పోటీచేసి, వారికి చెక్ పెట్టేందుకు పావులు కదుపుతున్నారని జనసేన వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. గత ఎన్నికల్లో పవన్ విశాఖ, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
అనుకూల వ్యాఖ్యాలు వెనుక…
కాపు సామాజికవర్గం అధికంగా ఉన్న తూర్పుగోదావరి నుంచి పోటీ చేయకపోవడం తప్పిదమే అన్న భావన పార్టీలో ఉంది. అయితే ఆ ఓటమి తర్వాత ఇప్పుడు వ్యూహం మార్చిన పవన్… ఈసారి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాకినాడ నుంచే కచ్చితంగా బరిలోకి దిగుతారని అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో కాపు సామాజికవర్గం ఓట్లు అత్యధికంగా ఉన్న కాకినాడ సిటీ అయితే బాగుంటుందని పార్టీ కూడా ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఈ నియోజకవర్గంలో అయితే గెలుపు తథ్యమనే ధీమా కూడా పార్టీలో ఉంది. ఇక్కడి నుంచి పోటీ చేయడం ద్వారా పవన్‌ను అదేపనిగా రెచ్చగొడుతున్న వైసీపీ నేత ద్వారంపూడికి చెక్ పెట్టవచ్చనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. ఇదొక్కటే కాదు.. కొడాలి నాని కూడా తాజాగా పవన్‌ను పొగుడుతూ వ్యాఖ్యలు చేయడం కొసమెరుపు. ‘సినిమాల్లో అయితే మంచి హీరోనే. మంచి మంచి కలెక్షన్లు వస్తాయి.
ఆయనను హీరో కాదని అయితే ఎవరూ చెప్పలేరు. చిరంజీవి గారి స్థాయిలోకి.. ఆయన కంటే ఎక్కువ స్థాయిలోకి పవన్ చేరుకున్నాడు’ అని కొడాలి నాని తాజాగా వ్యాఖ్యానించడం గమనార్హం. ఒకప్పుడు ఇదే కొడాలి నాని జనసేన అధినేతపై వ్యక్తిగత విమర్శలకు దిగిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. పవన్ కల్యాణ్ వైవాహిక జీవితం గురించి కూడా కొడాలి కామెంట్స్ చేసిన సందర్భాలు ఎన్నో. అలాంటి కొడాలి నాని పవన్ గురించి పాజిటివ్‌గా మాట్లాడటం, ద్వారంపూడి వంటి వైసీపీ నేతలు పవన్‌ను పొగుడుతుండటంతో.. ఇదంతా వైసీపీ మైండ్ గేమ్ అని జనసేన భావిస్తోంది.
Also Read:Pawan Kalyan vs Jagan : జగన్ ను ‘చదువుల’తో కొడుతున్న పవన్ కళ్యాణ్