Pawan Kalyan: విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జనసేనాని పవన్ కళ్యాణ్ చేపట్టిన ఒకరోజు దీక్ష విజయవంతమైంది. ప్రైవేటీకరిస్తున్న బీజేపీని వదిలేసి వైసీపీ ప్రభుత్వంపై పవన్ నిప్పులు చెరిగారు. విశాఖ ప్లాంట్ కోసం పోరాడాల్సింది వైసీపీనేనని నెపాన్ని ఆ పార్టీపై నెట్టేశారు. ఎన్నికల కోసం స్టీల్ ప్లాంట్ నినాదం చేసిన వైసీపీ ఢిల్లీలో ఎందుకు నోరెత్తడం లేదని పవన్ ప్రశ్నించారు. చేతగాని వాళ్లు మనకెందుకు అని ఎద్దేవా చేశారు.
22 మంది ఎంపీలు, 151 మంది ఎమ్మెల్యేలున్న వైసీపీనే స్టీల్ ప్లాంట్ కోసం పోరాడాలని పవన్ స్పష్టం చేశారు. వారికే ఆ అర్హత ఉందని స్పష్టం చేశారు. వైసీపీ ముందుంటే వారితో పాటు తాను పోరాడుతానని స్పష్టం చేశారు. వైసీపీకి తాను అల్టిమేటం ఇవ్వలేదని.. ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థి అయిన తాను ఎలా అల్టిమేటం ఇవ్వగలనని తనను గెలిపించని ప్రజలను సుతిమెత్తగా పవన్ దెప్పిపొడిచారు.
ప్రజలంతా ఓటు వేసి గెలిపించారు కనుక స్టీల్ ప్లాంట్ అంశంపై వైసీపీ వారినే నిలదీయాలని పవన్ తన కాడి వదిలేశాడు. ఇంకో రెండున్నరేళ్లు వైసీపీ రౌడీయిజాన్ని భరించాలని అన్నారు.
స్టీల్ ప్లాంట్ కోసం ఏపీలో ప్రసంగాలు , ప్రకటనలు చేస్తున్న వైసీపీ నేతలు ఎందుకు పార్లమెంట్ లో నిలదీయడం లేదని పవన్ ప్రశ్నించారు. అధికార పార్టీగా ప్రజల సమస్యలను ఢిల్లీలో లేవనెత్తాల్సిన బాధ్యత వైసీపీపేనే ఉందన్నారు.
వైసీపీ పెనం మీద ఓటేస్తే ఆవిరైపోయిందని.. వచ్చే ఎన్నికల్లో అయినా జనసేన అనే ఆలుచిప్పలో ఓట్లు వేస్తే మీ సమస్యలపై పోరాడుతామని ప్రజలకు హితవు పలికారు. అప్పుడే జనసేన ముత్యంలా మారుతుందన్నారు.
ఎన్నికష్టాలు వచ్చినా స్టీల్ ప్లాంట్ నిర్వాసితులకు న్యాయం జరిగే వరకూ జనసేన పార్టీ అండగా ఉంటుందని పవన్ హామీ ఇచ్చారు. మొత్తంగా విశాఖస్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరిస్తున్న కేంద్రప్రభుత్వానికి తప్పు కాదని.. ఈ విషయంలో పోరాడని వైసీపీదే తప్పు అని బీజేపీ మిత్రపక్షంగా వ్యవహరిస్తున్న పవన్ కళ్యాణ్ ఈ దీక్ష ద్వారా ఏపీ ప్రజలకు సందేశమిచ్చారు. గెలిపించని తాను పోరాడలేనని.. గెలిపించిన వారినే నిలదీయాలని ప్రజలకు హితబోధ చేశారు. దున్నపోతుకు గడ్డి వేసి బర్రెకు పాలు పిండితే రావన్న సందేశఆన్ని ఇచ్చారు.