Homeఆంధ్రప్రదేశ్‌Pawan Kalyan : ఇప్పటం గ్రామ ప్రజల కోసం రక్తం చిందిస్తా.. బరెస్ట్ అయిన...

Pawan Kalyan : ఇప్పటం గ్రామ ప్రజల కోసం రక్తం చిందిస్తా.. బరెస్ట్ అయిన పవన్ కళ్యాణ్

Pawan Kalyan : ‘‘జనసేన ఆవిర్భావ సభకు స్థలం ఇచ్చారనే ఇప్పటం గ్రామంపై రాష్ట్ర ప్రభుత్వం కక్షగట్టి కూల్చివేతలు మొదలుపెట్టింది… ఈ గ్రామ ప్రజల కోసం నేను రక్తం చిందించడానికైనా సిద్ధంగా ఉన్నాను’’ అని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. శనివారం ఉదయం ఇప్పటం గ్రామంలోని కూల్చివేసిన ఇళ్లను పరిశీలించి బాధిత ప్రజలతో మాట్లాడాలని మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయం నుంచి బయలుదేరిన పవన్ కళ్యాణ్ ని కార్యాలయం గేటు దగ్గరే ఆయన వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఇప్పటం వెళ్లడానికి అనుమతించబోమని పోలీసులు హుకుం జారీ చేశారు. కాలినడకన వెళ్తానని  పవన్ కళ్యాణ్  వాహనం దిగి నడక ప్రారంభించారు. ఆయనను పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో అనుసరించారు. పోలీసు సోదరులు అడ్డుకొన్నా మౌనంగా చేతులు కట్టుకొని నిరసన వ్యక్తం చేస్తూ నడవాలని శ్రేణులకు సూచించారు. పోలీసుల కష్టాలు తనకు తెలుసు అన్నారు. కొంత దూరం తరవాత నడిచిన తరవాత పోలీసులు ఇప్పటం వెళ్ళేందుకు అనుమతించారు. పోరాట స్ఫూర్తికీ… ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధమనే భావన కలిగించే మిలిటరీ జర్కిన్ తో  పవన్ కళ్యాణ్ ఇప్పటం బయలుదేరటం విశేషం.

ఇప్పటం చేరుకున్న  పవన్ కళ్యాణ్  అక్కడ కాలి నడకన పర్యటించి కూల్చివేసిన ఇళ్లను పరిశీలించి బాధిత ప్రజలతో మాట్లాడారు. వారు కన్నీటి పర్యంతమవుతూ తమ ఆవేదన వెలిబుచ్చారు. శ్రీమతి ఇండ్ల లక్ష్మి అనే మహిళ ఆవేదన విని  పవన్ కళ్యాణ్  చలించిపోయారు. ‘మా ఇంట్లో నిండు గర్భిణీ ఉంది. కూల్చవద్దని అధికారుల కాళ్ళు పట్టుకున్నా. అయినా కనికరించలేదు. నీటి ట్యాంక్ కూడా కూల్చివేశారు. ఆ శబ్దాలకు భయపడిపోయాం. గర్భిణీ పరిస్థితి ఏమిటి? ఎవరికి మా బాధలు చెప్పుకోవాలి’ అని ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు. రైతులు, మహిళలు తమను పాలక పక్షం ఏ విధం వేధిస్తుందో తెలిపారు.

ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్కరికీ ధైర్యం చెప్పి… ఈ గ్రామ ప్రజలకు జనసేన పార్టీ అండగా ఉంటుంది అన్నారు. ఎంత మాత్రం వెనకడుగు వేసేది లేదు.. ఎన్‌కౌంటర్ అన్నా భయపడం… ఇక అరెస్టులంటే తగ్గుతామా? అన్నారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “జనసేన సభకు స్థలం ఇచ్చారనే ఇప్పటం గ్రామంపై కక్షగట్టి కూల్చివేతలు మొదలుపెట్టారు. కూల్చివేతలతో పాలన మొదలుపెట్టిన ప్రభుత్వం కచ్చితంగా కూలుతుంది. మార్చిలో మా సభకు భూమి ఇస్తే, ఏప్రిల్ లో ఇళ్లను కూల్చేస్తామని నోటీసులు ఇచ్చారు .జనసేన ఆవిర్భావ సభకు స్థలం ఇచ్చారనే కక్షతోనే ఇళ్లను కూల్చారు. స్థానిక ఎమ్మెల్యే ఆర్కే ఇల్లు ఉన్న పెదకాకానిలో రహదారి విస్తరణ లేదా? కాకినాడ లేదా రాజమహేంద్రవరమా రోడ్లు వెడల్పు చేయడానికి. వైసీపీ నాయకులకు చెబుతున్నాం… ఇలాగే చేస్తే పులివెందులలో, ఇడుపులపాయలో మీ ఇళ్ల మీద నుంచి హైవే వేస్తాం. రోడ్లపై గుంతలు పూడ్చలేరు.. కానీ రోడ్ల విస్తరణ కోసం వైసీపీతోలేని ప్రజల ఇళ్లను కూల్చుతారు. గాంధీజీ, నెహ్రూ గారు, కలాం గారి విగ్రహాలు కూల్చేస్తారు. వైఎస్సార్ విగ్రహాన్ని మాత్రం అలాగే ఉంచుతారు.

ప్రభుత్వ ముఖ్య సలహాదారు  సజ్జల రామకృష్ణారెడ్డి డీ ఫ్యాక్టో ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారు. జనసేన వారికి ఏం జరిగినా ఆయనదే బాధ్యత. కనీసం మాట్లాడనీయకుండా ఆపడానికి మీరెవరు? ప్రజలను ఇబ్బందులకు గురి చేసేలా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో రౌడీ రాజ్యం నడుస్తోంది. పోలీసు అధికారులు రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలి. ఈ ప్రభుత్వానికి బుద్ధి ఉందా… మేమేమన్నా గూండాలమా? అత్యాచారాలు చేసిన వారిని పోలీసులు వదిలేస్తున్నారు. కూల్చివేస్తున్న వారికి పోలీసులు కొమ్ముకాస్తున్నారు. దోపిడీలు చేసేవారికి అండగా ఉంటున్నారు.

ప్రజాస్వామ్య పరిరక్షణకు చేసే పోరాటంలో వెనక్కి తగ్గేది లేదు. అరెస్టులకు భయపడేది లేదు.. దేనికైనా సిద్ధమే. వైసీపీ వాళ్లకు చెబుతున్నా… మా మట్టిని కూల్చారు… మీ కూల్చివేత తథ్యం” అన్నారు.

వైసీపీ ప్రభుత్వం కూల్చడం తథ్యం || Pawan Kalyan Meets Ippatam Peoples || Janasena || Ok Telugu

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
Exit mobile version