అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహాస్వామి ఆలయ రథం దగ్ధం రాష్ట్రవ్యాప్తంగా ‘మంటలు’ రేపుతోంది. ఇప్పటికే ప్రతిపక్షాలు.. ప్రజాసంఘాలు ఘటనపై ధ్వజమెత్తుతున్నాయి. ఘటన స్థలాన్ని పరిశీలించేందుకు వస్తున్న ప్రభుత్వ పెద్దలను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. శివసేన తదితర పార్టీలు, హిందూ అభిమానులు మంత్రులను నిలదీసిన సంఘటనలూ చూస్తున్నాం.
Also Read: మూడు రాజధానులపై తేల్చేసిన కేంద్రం
తాజాగా జనసేన–బీజేపీ సంయుక్తంగా బుధవారం ఉదయం 10 గంటల నుంచి ధర్మ పరిరక్షణ దీక్షకు దిగాయి. ఈ నేపథ్యంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ హైదరాబాద్‌లోని తన నివాసంలో ధర్మ పరిరక్షణ దీక్ష చేపట్టారు. పరిరక్షణ దీక్షకు ముందు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జనసేన నాయకులు, శ్రేణులతో పవన్ కళ్యాణ్ చర్చించారు.. అన్ని జిల్లాల్లోనూ ఈ దీక్షలకు ఏర్పాట్లు చేయాలని నాయకులకు పవన్ కల్యాణ్ సూచించారు.
ఏపీలో అంతర్వేది రథం దగ్ధం ఒక్కటే అయితే తాను రియాక్ట్ అయ్యేవాడిని కాదని.. వరుస క్రమంలో ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయని.. అందుకే మౌనంగా ఉండలేకపోతున్నానని పవన్ కల్యాణ్ అన్నట్టు తెలిసింది. ‘లక్ష్మీనరసింహాస్వామి ఆలయంలో 40 అడుగుల పవిత్ర రథం దగ్ధమవడానికి చాలా కారణాలు చెప్తున్నారని.. నిజాలు దాస్తున్న వైసీపీ ప్రభుత్వం మీద బలంగా స్పందించాలని’ అని పవన్ కల్యాణ్ శ్రేణులకు పిలుపునిచ్చాడు.
Also Read: ఇల్లు అలకగానే పండుగ కాదు.. జగన్?
మరోవైపు విశాఖలోని బీజేపీ కార్యాలయంలో దీక్షకు దిగిన శాసన మండలి సభ్యుడు పీవీఎన్ మాధవ్ సైతం వైసీపీ సర్కార్ వైఖరిపై మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం హిందువుల మనోభావాలను కించపరిచేలా వ్యవహరిస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు ఎన్నో ఆలయాల మీద దాడులు జరిగాయని చెప్పారు. హిందూ దేవాలయాలకు వచ్చే ఆదాయాన్ని ప్రభుత్వం ఆదాయంగా భావిస్తోందని.. రాష్ట్రంలో ఏ మసీదు, చర్చిలకు వచ్చిన ఆదాయాన్ని ఆ మతస్తులకు తప్ప ప్రభుత్వానికి వర్తించడం లేదని విమర్శించారు. మరి అలాంటి హిందూ దేవాలయాలను కాపాడాల్సిన పూర్తి బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. అంతర్వేది ఘటనకు సంబంధించి ఇంతవరకు ఎవరినీ అరెస్టు చేయలేదన్నారు. రథం దగ్ధం పిచ్చివాడి చర్యగా చెబుతున్నారని.. దానినే కలెక్టర్, సీపీ కూడా నివేదికలో చేర్చడం విడ్డూరమని మాధవ్ ఆరోపించారు.