Janasena : అసలు సిసలు యుద్ధానికి జన సైనికులు సిద్ధపడుతున్నారా? వచ్చే ఎన్నికలకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారా? బలమున్న నియోజకవర్గాల్లో పని మొదలుపెట్టారా? అటు హైకమాండ్ సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. పొత్తులు, పార్టీ సంస్థాగత నిర్మాణం, సోషల్ మీడియా వింగ్ బలోపేతం వంటి వాటిపై జనసేన నాయకత్వం ఫోకస్ పెంచింది. ముగ్గురు అగ్రనేతలు ఒకేసారి బయటకు రావడంతో జనసేన వ్యూహం బహిర్గతమైంది. ఓ వైపు చంద్రబాబుతో పవన్ చర్చలు జరిపారు. మరోవైపు నాగబాబు వర్చువల్ విధానంలో అన్ని జిల్లాల నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. నాదేండ్ల మనోహర్ రీజనల్ స్థాయిలో క్షేత్రస్థాయిలో పర్యటనలు చేస్తున్నారు. దీంతో జన సైనికుల్లో జోష్ నెలకొంది.
గందరగోళానికి చెక్..
అయితే జనసేనలో ఓ రకమైన గందరగోళం నెలకొంది. పొత్తులు ఉంటాయా? లేదా? అన్న సంశయం ఉంది. అందుకే పార్టీ అధినేత సమావేశాల్లో సైతం శ్రేణులు పదేపదే ఇదే అంశాన్ని లేవనెత్తుతూ వస్తున్నాయి. కానీ పొత్తుల అంశం తనకు విడిచిపెట్టాలని.. వైసీపీ సర్కారు విధానాలపై పోరాటం చేయాలని పవన్ చెబుతూ వస్తున్నారు. అయితే పదేపదే పొత్తులపై శ్రేణుల నుంచి ఒత్తిడి వస్తుండడంతో పవన్ పునరాలోచనలో పడ్డారు. అందుకే చంద్రబాబు మనసులో ఉన్న మాటను తెలుసుకునేందుకు నేరుగా రంగంలోకి దిగారు. ఏకాంతంగా చర్చలు జరిపారు. ఇద్దరు నేతలు మనసులో ఉన్న భావాలను వ్యక్తపరుచుకున్నారు. అయితే వారిద్దరి కలయిక పొత్తుల గురించేనని విశ్లేషణలు వెలువడుతున్నాయి. అయితే ఇందులో వాస్తవం లేకపోలేదు. అయితే ప్రాథమిక స్థాయిలో మాత్రం ఒక నిర్ణయానికి వచ్చినట్టు ప్రచారం సాగుతోంది.
నాగబాబు బిజీబిజీ..
అదే సమయంలో గతంలో మాదిరిగా జనసేన ఓటు బ్యాంకు చేజారిపోకుండా ఉండేందుకు అవసరమైన చర్యలన్నింటీని నాగబాబు తన భుజస్కందాలపై వేసుకున్నట్టు తెలుస్తోంది. పార్టీ శ్రేణులతో పాటు అభిమాన సంఘాలను ఏకతాటిపైకి తీసుకురావడానికి కసరత్తు ప్రారంభించారు. అందులో భాగంగా సోషల్ మీడియా విభాగాలకు సైతం స్పష్టమైన గైడ్ లైన్స్ ఇస్తున్నారు. ఇది పార్టీ లైన్ అంటూ..అందుకు అవసరమైన సలహాలు, సూచనలు ఇచ్చే పనిలో ఉన్నారు. మెగా కాంపౌండ్ వాల్ నుంచి వచ్చిన అందరి హీరోల అభిమానులను ఒకచోటకు చేర్చి దిశానిర్దేశం చేస్తున్నారు. గత వారంరోజులుగా ఆన్ లైన్ మీటింగులతో నాగబాబు బిజీబిజీగా గడుపుతున్నారు.
క్షేత్రస్థాయిలో నివేదికలు..
మరోవైపు పార్టీ కీలక నేత నాదేండ్ల మనోహర్ సైతం రాష్ట్ర వ్యాప్త పర్యటనలు ప్రారంభించారు. ప్రస్తుతం ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్నారు. పార్టీ శ్రేణులతో సమావేశమవుతున్నారు. నియోజకవర్గాల వారీగా రివ్యూలు చేస్తున్నారు. అక్కడున్న బలాబలాలపై ఒక నివేదిక తయారుచేస్తున్నారు. అయితే ఏకకాలంలో ముగ్గురు నేతలు రంగంలోకి దిగడంతో మేటర్ సీరియస్సేనని జన సైనికులు భావిస్తున్నారు. 175 నియోజకవర్గాల్లో జనసేన ఎక్కడెక్కడ నుంచి బరిలో దిగనుంది? పొత్తుల్లో భాగంగా ఎన్ని సీట్లు ఖరారయ్యాయి అనేది కొద్దిరోజుల్లో హైకమాండ్ నుంచి క్లారిటీ రానుంది. జన సైనికులు కూడా ఇదే సమాచారం కోసం ఎదురుచూస్తున్నారు. పొత్తులు ఉంటే ఒకలా.. లేకుంటే మరోలా పనిచేయాలని వ్యూహాలు రూపొందించుకుంటున్నారు.