Chandrababu: తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో ఉంది. అధినేత చుట్టూ కేసులు చుట్టుముట్టాయి. ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ సీనియర్లు పార్టీని ముందుండి నడిపించాలి. కానీ ఏపీలో ఆ పరిస్థితి ఉందా? చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు సీనియర్లు వచ్చి పార్టీని తమ భుజస్కందాలపై వేసుకున్నారా? అంటే లేదనే సమాధానం వినిపిస్తోంది. ఒకరిద్దరు నాయకులు తప్ప.. మిగతా వారంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఇప్పుడు చంద్రబాబు ఈ విషయంలోనే ఎక్కువగా బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఇంతటి కష్టకాలంలో తనకు పవన్ మాత్రమే అండగా నిలిచిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. అందుకే బెయిల్ లభించిన వెంటనే పవన్ కళ్యాణ్ కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
స్కిల్ స్కాం లో చంద్రబాబు అరెస్ట్ అయిన తర్వాత తొలిసారిగా పవన్ స్పందించారు. చంద్రబాబుది అక్రమ అరెస్టు అని.. రాజకీయ కక్షపూరితంగా నమోదు చేసిందని ఆరోపించారు. నేరుగా హైదరాబాదు నుంచి చంద్రబాబును కలిసేందుకు బయలుదేరారు. కానీ ఎయిర్పోర్టులో పోలీసులు అడ్డుకోవడంతో.. రాత్రి సమయంలో రోడ్డు మార్గంలో బయలుదేరారు. రాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో ఏపీ పోలీసులు పవన్ అడ్డుకొని తిరిగి పంపారు. అయితే చంద్రబాబుకు రిమాండ్ విధించడంతో రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లి పవన్ పరామర్శించారు. అనంతరం బయటకు వచ్చి తెలుగుదేశం పార్టీతో పొత్తు ప్రకటించారు. ఎవరూ చేయలేని సాహసమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. తక్షణం రెండు పార్టీల మధ్య ఐక్య కార్యాచరణ ప్రారంభమవుతుందని వెల్లడించారు. అందుకు తగ్గట్టే పొత్తుల సమన్వయానికి జనసేన తరఫున ఒక కమిటీని ఏర్పాటు చేశారు. అటు తరువాతే రెండు పార్టీల మధ్య ఐక్య కార్యాచరణ ప్రారంభమైన విషయం విధితమే.
జనసేన పొత్తు ధర్మాన్ని వీడలేదు. రెండు పార్టీల కార్యక్రమాలకు జనసైనికులు తమ బాధ్యతగా హాజరవుతున్నారు. కానీ తెలుగుదేశం పార్టీ విషయంలో మాత్రం అది కనిపించడం లేదు. అయితే నిన్నటికి నిన్న చంద్రబాబు బెయిల్ అనంతరం.. ఆయన స్వాగతం పలకడంలో తెలుగుదేశం పార్టీ కంటే జనసేన శ్రేణులే అధికంగా హాజరయ్యారు. ముఖ్యంగా చాలామంది తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఇళ్ల నుంచి కదల్లేదు. కనీసం తమ అధినేత కష్టాల్లో ఉన్నారని కూడా భావించలేదు. గతంలో అధికారాన్ని అనుభవించిన వారు ఉన్నారు.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న వారు సైతం ఎందుకు అధినేతనం ఆహ్వానించడానికి ముందుకు రాలేదు. టిడిపి నేతల్లో బాధ్యతారాహిత్యాన్ని ఇది తెలియజేస్తోంది. చంద్రబాబు అరెస్టు తరువాత రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేసిన మాట వాస్తవం. అయితే అవి అంతగా సక్సెస్ కావడానికి మాత్రం జనసైనికులే ముఖ్య కారణం. కానీ దీనిని ఒప్పుకునేటంత స్థితిలో టిడిపి నేతలు లేరు. మున్ముందు రెండు పార్టీల మధ్య పొత్తు విషయంలో ఇలానే కొనసాగితే మాత్రం అసలు లక్ష్యం దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి.
తెలుగుదేశం పార్టీ తీరును చూస్తుంటే ఓట్ల బదలాయింపు, సీట్ల సర్దుబాటు విషయంలో వివాదాలు జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఒక ఉన్నత భావంతో జనసేన అధినేత పవన్ తెలుగుదేశం పార్టీతో పొత్తు ప్రకటించారు. ఆ పార్టీతో పాటు అధినేత చంద్రబాబు కష్టంలో ఉన్న సమయంలో సైతం నేనున్నాను అంటూ భరోసా ఇచ్చారు. మాకు ఎక్కువ ఓట్లు ఉన్నాయి.. క్షేత్రస్థాయిలో బలం ఉంది.. అన్న బీరాలు పలికితే మాత్రం మొదటికే మోసం వస్తుందన్న విషయం తెలుగుదేశం పార్టీ నేతలు తెలుసుకోవాలి. పొత్తు ధర్మాన్ని పాటించాలి. ఉమ్మడి కార్యాచరణను ముందుకు తీసుకెళ్లాలి. అప్పుడే పొత్తు వర్క్ అవుట్ అవుతుంది. కానీ ఒకరి బలంతో మరొకరు ముందుకెళ్లాలని చూస్తే మాత్రం మొదటికే మోసం వస్తుంది. ఉమ్మడి బలంతోనే బలమైన వైసీపీని ఎదుర్కొనే పరిస్థితి ఉంది. లేకుంటే మాత్రం నష్టపోయేది అంతిమంగా తెలుగుదేశం పార్టీయే.