Pawan Kalyan- Pithapuram: జనసేనాని పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి బరిలో దిగుతారు? ఇప్పుడిదే హాట్ టాపిక్. ఇప్పుడు అన్ని పార్టీలు పవన్ ఎక్కడ నుంచి పోటీచేస్తారని ఆసక్తిగా చూస్తున్నాయి.గత ఎన్నికల్లో రెండు చోట్ల పోటీచేసిన పవన్ కు నిరాశే ఎదురైంది. భీమవరంతో పాటు గాజువాక నుంచి పోటీచేసిన పవన్ ను అక్కడి ప్రజలు ఆమోదించలేదు. తీరా ఇప్పుడు బాధపడుతున్నారు.పవన్ ను అసెంబ్లీకి పంపించే గొల్డెన్ చాన్స్ ను జారవిడుచుకోవడంతో తెగ బాధపడుతున్నారు. మరోసారి అక్కడ నుంచే బరిలో దిగితే గెలిపించుకుంటామని చెబుతున్నారు. అయితే ఈసారి పవన్ తిరుపతి, విశాఖ, కాకినాడ జిల్లాల నుంచి పోటీకి దిగుతారని ప్రచారం జరుగుతోంది. కానీ దేనీపై క్లారిటీ లేదు. దీనిపై జనసేన అధిష్టానం కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి పవన్ కు ఆహ్వానాలు అందుతున్నాయి. తమ నియోజకవర్గం నుంచి పోటీచేయాలని జనసైనికులు కోరుతున్నారు.
ముఖ్యంగా కాకినాడ జిల్లా పిఠాపురం నుంచి పవన్ పోటీచేయాలని ఆ నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు. నేరుగా గ్రామస్థాయి నాయకులు, సాధారణ పౌరులు పవన్ ను ఆత్మీయంగా స్వాగతం పలుకుతున్నారు. చంద్రబాబుకు కుప్పం, జగన్ కు పులివెందుల మాదిరిగా… పిఠాపురంను పవన్ కు కంచుకోటగా మలుస్తామని చెబుతున్నారు. ఇక్కడ కాపు సామాజికవర్గం అధికం. అదే స్థాయిలో బీసీలు, ఎస్సీలు కూడా ఉన్నారు. అయితే కాపులతో పాటు అన్ని సామాజికవర్గాల ప్రజలు ఇక్కడ పవన్ వైపు చూస్తుండడం విశేషం. గత ఎన్నికల్లో జనసేన అభ్యర్థి దాదాపు 30 వేల వరకూ ఓట్లు తెచ్చుకున్నారు. ట్రయంగిల్ ఫైట్ లో వైసీపీ అభ్యర్థి 16 వేల ఓట్లతో గెలుపొందారు. అయితే ఈసారి ఇక్కడ వార్ వన్ సైడ్ గా నిలవనుందని అటు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఒక వేళ టీడీపీ, జనసేన కలిస్తే మాత్రం వైసీపీ దరిదాపుల్లో ఉండదని అభిప్రాయపడుతున్నారు. పిఠాపురం వైసీపీ ఎమ్మెల్యే దొరబాబు పై నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఇక్కడ జనసేన – టీడీపీ కి 90 వేలకు పైగా ఓట్ బ్యాంక్ ఉంది. అందుకే పవన్ ఇక్కడ పోటిచేస్తే గెలుపు ఖాయమని.. అందుకే ఆహ్వానాలు వెల్లువెత్తుతున్నాయి.
పవన్ కు సైతం పిఠాపురం నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి ఉంది. ఇక్కడ నుంచి బరిలో దిగితే చాలా రకాల సమాధానాలు చెప్పొచ్చు. కాకినాడ అర్బన్, రూరల్ నియోజకవర్గాల ఎమ్మెల్యెలు ద్వారపురెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, కన్నబాబులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ద్వారపురెడ్డి అయితే చీటికి మాటికి పవన్ పై చిందులేస్తున్నారు. వ్యక్తిగత కామెంట్లకు సైతం దిగుతున్నారు. తిట్ల దండకాన్ని పూనుకుంటున్నారు. అందుకే పవన్ టార్గెట్ పెట్టుకున్న వైసీపీ నేతల జాబితాలో ద్వారపురెడ్డి ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో ఆయన్ను అసెంబ్లీలో అడుగు పెట్టనీయకూడదని నిర్ణయించుకున్నారు. ఆ దిశగా పావులు కదుపుతున్నారు.
. పిఠాపురం నుంచి పవన్ బరిలో దిగితే మాత్రం ఆ ప్రభావం కాకినాడ రెండు నియోజకవర్గాలపై పడుతుంది. పవన్ ప్రభంజనంలో ద్వారపురెడ్డి కొట్టుకుపోవడం ఖాయం. అందుకే పవన్ పిఠాపురం వైపు మొగ్గుచూపే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి, దీన్ని జన సైనికులు కూడా ఆహ్వానిస్తున్నారు.