
ఏపీలో ముగిసిన పంచాయతీ పోరులో 174 నియోజకవర్గాల తీర్పు ఒకలా, మిగిలిన ఒక నియోజకవర్గం తీర్పు మాత్రం ఇంకోలా ఉంది. కనీసం టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో కూడా ఆ పార్టీకి నామమాత్రపు సీట్లైనా దక్కలేదు. వైసీపీకి 80 శాతానికి పైగా స్థానాలు రాగా.. రాజోలు నియోజవర్గంలో 60 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగితే అక్కడ కేవలం 37 చోట్ల మాత్రమే వైసీపీ బలపరచిన అభ్యర్థులు గెలిచారు. మిగతా 23 చోట్ల టీడీపీ, జనసేన విజయం సాధించాయి.
Also Read: ఆ ఆరుగురే ఎమ్మెల్సీ అభ్యర్థులు.. జగన్ డిసైడ్?
జనసేన పార్టీ తరఫున బరిలో నిలిచి.. మొదటి సారి ఎమ్మెల్యేగా గెలిచారు రాపాక వరప్రసాద్. ఆ పార్టీ నుంచి ఏపీ అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహించిన ఏకైక ఎమ్మెల్యే కూడా ఆయనే. స్వయానా పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ రెండుచోట్ల పోటీ చేసి ఓడిపోయినా.. రాపాక మాత్రం వైసీపీ, టీడీపీని తట్టుకుని నిలబడి గెలిచారు. ఆయన సొంత బలం ఎంతున్నా, జనసైనికుల కృషి కూడా ఆయన విజయంలో సింహభాగం ఉంది.
అయితే.. అలాంటి రాపాక ప్లేటు ఫిరాయించడానికి ఎంతోకాలం తీసుకోలేదు. జనసైనికులు వారిస్తున్నా, వైసీపీ స్థానిక నేతలు మాకొద్దు బాబోయ్ అంటున్నా వినకుండా జగన్ పంచన చేరారు. కొడుక్కి వైసీపీ కండువా కప్పించి తాను సానుభూతిపరుడిగా మారారు. పార్టీ మారడమే కాదు, పవన్ పై విమర్శలు కూడా సంధించేవారు. స్థానికంగా జనసేన బలంతో తానేమీ గెలవలేదని, అదంతా తన సొంత బలగమేనని చెప్పుకునేవారు. అందుకే ఇక్కడే జనసైనికులకు మండింది. అదనుకోసం చూసి మరీ పంచాయతీ ఎన్నికల్లో రాపాకను ముప్పుతిప్పలు పెట్టారు. అత్యధిక సర్పంచ్ స్థానాలు గెలుచుకుని జగన్‌కు కానుకగా ఇద్దామని, వైసీపీలో పరపతి పెంచుకుందామని ఆశపడ్డ రాపాకకు జనసైనికులు షాకిచ్చారు.
Also Read: మున్సి‘పోల్’కు ముందే పరిషత్ పోరు..: జగన్ ఆలోచన అదేనా..?
బీజేపీతో పెట్టుకుంటే లాభం లేదనుకుని, ఏకంగా టీడీపీతో లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకున్నారు. 60 పంచాయతీల్లో 11 చోట్ల తాము గెలిచి, మరో 12 సీట్లు టీడీపీకి దక్కేలా చేశారు. ఉమ్మడిగా జనసేన-టీడీపీ కలిసి ఇక్కడ వైసీపీని 37 సీట్లకు పరిమితం చేశాయి. అది కేవలం వైసీపీపై కోపంతో మాత్రం కాదనేది స్పష్టం. రాపాకకు బుద్ధి చెప్పాలనే జనసేన సైనికులు ఈ నిర్ణయం తీసుకున్నారు. వైసీపీలో రాపాకది 152వ స్థానం. కానీ.. జనసేనలో మాత్రం టాప్. అయితే.. తాను అభివృద్ధిని కాంక్షించి మాత్రమే పార్టీ మారానని చెబుతున్నారు రాపాక.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్