Jammu and Kashmir Elections 2024 : జమ్ము కాశ్మీర్ రాష్ట్రంలో 90 శాసనసభ నియోజకవర్గాలున్నాయి. ఇక్కడి పరిస్థితుల దృష్ట్యా కేంద్ర ఎన్నికల సంఘం మూడు దశల్లో ఎన్నికలను నిర్వహించేందుకు నిర్ణయించింది. మొదటి దశ ఎన్నికలను సెప్టెంబర్ 18న నిర్వహిస్తుంది. రెండవ దశ ఎన్నికలను సెప్టెంబర్ 25న జరపనుంది.. మూడవ దశ ఎన్నికలను అక్టోబర్ 1న నిర్వహించనుంది. ఎన్నికల ఫలితాలు అక్టోబర్ 8న విడుదల కానున్నాయి. ఎగ్జిట్ పోల్స్ అక్టోబర్ 7న వెల్లడవుతాయి. సెప్టెంబర్ 18న జరిగే తొలి దశలో 24 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తారు. తొలి దశ ఎన్నికల్లో 23.27 లక్షల మంది ఓటర్లు ఓటు వేయనున్నారు. తొలి దశలో ఎన్నికలు జరిగే 24 స్థానాల్లో 16 కాశ్మీర్ వ్యాలీలో, 8 స్థానాలు జమ్మూ డివిజన్ పరిధిలో ఉన్నాయి. అనంత్ నాగ్ జిల్లాలోని ఏడు స్థానాలకు తొలి దశలో ఎన్నికలు జరుగుతున్నాయి. నాలుగు స్థానాలు పుల్వామా జిల్లాలో ఉన్నాయి. మూడు స్థానాలు కుల్గామ్ జిల్లాలో ఉన్నాయి. కిష్త్వారా, రాంబన్, షాపియాన్, దోడా జిల్లాల్లో రెండేసి నియోజకవర్గాలలో ఎన్నికలు నిర్వహించనున్నారు. తొలి దశలో జరిగే స్థానాలకు సంబంధించి 219 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. వీరిలో 36 మంది పై క్రిమినల్ కేసులు నమోదయి ఉండడం విశేషం.
భద్రత కత్తి మీద సాము
24 అసెంబ్లీ స్థానాలకు తొలి దశలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో.. ఆ ప్రాంతాలలో భద్రత నిర్వహించడం పోలీసులకు కత్తి మీద సాములాగా మారింది. ఎన్నికల నిర్వహించే నియోజకవర్గాలు భద్రత పరంగా సున్నితమైన ప్రాంతాలు. ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత.. జమ్మూ కాశ్మీర్ లో పరిస్థితులు మారిపోయిన నేపథ్యంలో కేంద్రం భారీగా భద్రతా దళాలను మోహరింపజేసింది. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసింది. అయినప్పటికీ ఎన్నికలు నిర్వహించడం కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా సవాల్ గానే ఉంది. సెప్టెంబర్ 18న జరిగే మొదటి విడతలో 24 స్థానాలకు, సెప్టెంబర్ 25న జరిగే రెండవ విడతలో 26 అసెంబ్లీ స్థానాలకు, అక్టోబర్ 1న జరిగే మూడవ విడతలో 40 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. ఓట్ల లెక్కింపు అక్టోబర్ 8న జరుగుతుంది. అదేరోజు ఫలితాలు వెల్లడవుతాయి. మూడు విడతల్లో జరిగే ఎన్నికలకు భద్రతను ఏర్పాటు చేయడం సవాల్ గా మారింది.
దాడులు జరిగాయి
గతంలో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినప్పుడు దాడులు ఎక్కువగా చోటుచేసుకునేవి. దీంతో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల ముఖం కూడా చూసేవారు కాదు. ఈసారి ఆర్టికల్ 370 రద్దు చేసిన అనంతరం.. జమ్ము కాశ్మీర్ రాష్ట్రంలో పరిస్థితిలో మారిన నేపథ్యంలో ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు భద్రతా దళాలు ఎంత మేరకు రప్పిస్తాయనేది ప్రశ్నార్థకంగా మారింది.. కాశ్మీర్లో ప్రజలు భద్రంగా ఉన్నారని.. ఆర్టికల్ 370 రద్దు ప్రజల్లో మెరుగైన మార్పు తీసుకొచ్చిందని కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి చెబుతోంది. అయితే కాంగ్రెస్ మాత్రం అమర్ నాథ్ యాత్రికులకు కూడా భద్రత కల్పించాల్సిన దుస్థితి ఏర్పడిందని కౌంటర్ ఇస్తోంది. ఈ ప్రకారం తొలి విడత ఎన్నికలు హోరాహోరిగా సాగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.