Jamili Elections : పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలను చట్ట సభలు అంటాం. పార్లమెంటులో దేశానికి సంబంధించిన చట్టాలు చేస్తే.. అసెంబ్లీల్లో ఆయా రాష్ట్ర ప్రజల కోసం చట్టాలు చేస్తాయి. చట్ట సభల్లో చట్టాలు చేసే అధికారం అధికార పార్టీకి ఉంటుంది. అంటే ఎన్నికల్లో మెజారీటీ సీట్లు గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేసిన పార్టీ అన్నమాట. ప్రస్తుతం మన దేశంలో పది వరకు జాతీయ పార్టీలు.. వందకుపైగా ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. జాతీయ పార్టీలు ఇటు పార్లమెంటు, అటు వివిధ రాష్ట్రాల అసెంబ్లీల్లో ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. ప్రాంతీయ పార్టీలు మాత్రం రాష్ట్రాలకే పరిమితం. స్థానిక సమస్యలు, ప్రజల ఆకాంక్ష మేరకు ప్రాంతీయ పార్టీలు ఆవిర్భవించాయి. దేశంలోని చాలా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు అధికారం చేపట్టాయి. అయితే.. తాజాగా కేంద్రం త్వరలో అమలు చేయబోతున్న జమిలి ఎన్నికలు ప్రాంతీయ పార్టీలకు పెను ముప్పుగా మారబోతున్నాయా అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు.
జమిలి ఎన్నికలతో చిన్న పార్టీలకు ముప్పు..
వన్ నేషన్.. వన్ ఎలక్షన్ నినాదాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చాలాకాలంగా ప్రజల్లో చర్చ జరిగేలా చేసింది. తర్వాత దీనిని ఆచరణలో పెట్టేందుకు మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటి దాదాపు ఏడాదిపాటు దేశంలోని జాతీయ, ప్రాంతీయ పార్టీల నేతలతో సమావేశం నిర్వహించింది. జమిలి ఎన్నికలపై అన్ని పార్టీల అభిప్రాయం తీసుకుంది. ఇక జమిలి ఎన్నికలతో కలిగే ప్రయోజనాలు, నష్టాలను కూడా పరిశీలించింది. ఎన్నికలతో నష్టం కన్నా లాభమే ఎక్కువగా ఉండడంతో ఈమేరకు నివేదిక తయారు చేసి కేంద్రానికి నివేదించింది.
కేబినెట్ ఆమోదం..
రామ్‌నాథ్ కోవింద్ కమిటీ ఇచ్చిన నివేదికకు కేంద్ర కేబినెట్‌ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన బుధవారం(సెప్టెంబర్ 18న) సమావేశమైన కేంద్ర క్యాబినెట్ వన్ నేషన్.. వన్ ఎలక్షన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వచ్చే శీతాకాల సమావేశాల్లో పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
పార్లమెంటు ఆమోదం లభించేనా..
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం కేంద్రంలో బీజేపీకి సంపూర్ణ మెజారిటీ లేదు. సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఈ నేపథ్యంలో వన్ నేషన్, వన్ ఎలక్షన్ బిల్లుకు ఆమోదం లభిస్తుందా అన్న చర్చ జరుగుతోంది. ఎన్డీఏ కూటమిలో ప్రస్తుతం ప్రాంతీయ పార్టీలు అయిన టీడీపీ, జేడీఎస్ కీలకంగా ఉన్నాయి. వీటితోపాటు జేడీయూ, అనేక ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందాలంటే 270 ఎంపీల మద్దతు అవసరం బీజేపీకి ప్రస్తుతం 235 మంది ఎంపీలు మాత్రమే ఉన్నారు. ఇక రాజ్యసభలో కూడా ఇదే పరిస్థితి. ఎన్డీ పక్షాలు మద్దతు తెలిపితే బిల్లు ఆమోదం పెద్ద కష్టం కాదు.
2029లో జమిలి ఎన్నికలు..
పార్లమెంటులో వన్ నేషన్, వన్ ఎలక్షన్ బిల్లు ఆమోదం పొంది రాజ్యాంగ సవరణ ప్రక్రియ పూర్తయితే 2029లోనే జమిలి ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. అదే జరిగితే ఈ ఎన్నికలతో ప్రాంతీయ పార్టీలు తీవ్రంగా నష్టపోతాయి. జాతీయ పార్టీల ప్రభావమే ఎక్కువగా ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించడం వలన ప్రాంతీయ పార్టీలకన్నా.. జాతీయ పార్టీలవైపే ప్రజలు మొగ్గు చూపే అవకాశం ఉంది. దీంతో క్రమంగా చట్ట సభల్లో ప్రాంతీయ పార్టీల ప్రభావం తగ్గుతుంది. అయితే సార్వత్రిక ఎన్నికల తర్వాత నిర్వహించే మున్సిపల్, పంచాయతీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం ప్రాంతీయ పార్టీలే ప్రభావం చూపుతాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. అయితే చట్టాల రూపకల్పనలో మాత్రం ప్రాంతీయ పార్టీల భాగస్వామ్యం తగ్గుతుంది.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Jamili election in the country is a gain for the national parties a loss for the regional parties
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com