Andhra University: వైసిపికి పటిష్టమైన సైన్యం ఉంది. బలమైన వ్యవస్థ ఒక రక్షణ కవచంలా ఉంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వ్యవస్థల్లో తమ వారిని నింపేశారు. ముఖ్యంగా సీఎం సొంత సామాజిక వర్గానికి చెందిన అధికారులు రాష్ట్రంలో ప్రాంతాలవారీగా నియమితులయ్యారు. డీఎస్పీలుగా, సీఐలుగా రాష్ట్రంలో చిట్టచివరి ప్రాంతంలో సైతం ఆ సామాజిక వర్గానికి చెందిన వారిని నియమించారు. ఇక విద్యావ్యవస్థలో సైతం అస్మదీయులకు పెద్దపీట వేశారు. కీలక విభాగాల్లో నియమించారు. చివరకు యూనివర్సిటీలను సైతం విడిచిపెట్టలేదు. సీఎం సామాజిక వర్గానికి చెందిన వారినే వీసీలుగా నియమించుకున్నారు.
ఆంధ్రా యూనివర్సిటీ కి సుదీర్ఘ చరిత్ర ఉంది. ఇక్కడ వీసీలుగా సేవలందించిన వారు జాతీయస్థాయిలో సైతం రాణించారు. అటువంటి ఆంధ్రా యూనివర్సిటీ వీసీగా ప్రసాద్ రెడ్డి నియమితులయ్యారు. అప్పటినుంచి ఏయును ఒక రాజకీయ వేదికగా మార్చేశారన్న ఆరోపణ ఉంది. సీఎం జగన్ తో పాటు కుటుంబ సభ్యుల పుట్టినరోజు వేడుకలను సైతం యూనివర్సిటీలో నిర్వహించడం వెలుగు చూసింది. నిత్యం ఏయూకు వైసీపీ నేతల తాకిడి ఉంటుందని ఒక ప్రచారం ఉంది. విశాఖ వైసిపి సేవలో బీసీ ప్రసాద్ రెడ్డి నిత్యం తరిస్తుంటారని టాక్ నడుస్తోంది. అందుకు తగ్గట్టుగానే గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల క్యాంపెయిన్ వంటి నిర్వహణలో ప్రసాదరెడ్డి కీలక పాత్ర పోషించారని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఒకసారి ఓ రాజకీయ వేదిక పై ప్రసాద్ రెడ్డి కనిపించడంతో వామపక్షాల నాయకులు బయటపెట్టారు. అయినా సరే వీసీ ప్రసాద్ రెడ్డి పెడచెవిన పెడుతూ వచ్చారు.
అటు యూనివర్సిటీలో సైతం అంత రాజకీయ నియామకాలేనని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొద్దిరోజుల కిందట ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలో ప్రిన్సిపాల్ గా పనిచేస్తున్న జేమ్స్ స్టీఫెన్ అనే వ్యక్తికి నిబంధనలకు విరుద్ధంగా ప్రొఫెసర్ గా నియమించుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు అదే వ్యక్తికి రిజిస్ట్రార్ గా అదనపు బాధ్యతలు అప్పగించడం విశేషం. దీని వెనుక వైసీపీ సర్కార్ ఓటు రాజకీయం ఉందన్న ఆరోపణలు వస్తున్నాయి.
ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలో ప్రిన్సిపాల్ గా జేమ్స్ స్టీఫెన్ పనిచేస్తుండేవారు. ఏయూ వైస్ ఛాన్సలర్ గా ప్రసాద్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత స్టీఫెన్ పాలకమండలి సభ్యుడిగా నియమితులయ్యారు. అటు తరువాత అంబేద్కర్ చైర్ ప్రొఫెసర్ గా స్టీఫెన్ను నియమించారు. అక్కడ కూడా ఎటువంటి నిబంధనలు పాటించలేదని తెలుస్తోంది. దీనంతటికీ కారణం ఆయన చేతిలో వందకు పైగా చర్చిలు ఉండడమే. ఉత్తరాంధ్రలో వందకు పైగా చర్చిల్లో పాస్టర్లుగా పనిచేస్తున్న వారు స్టీఫెన్ శిష్యులే. ఆయా చర్చిల పరిధిలో గల వాటర్లను వైసీపీకి అనుకూలంగా మలుస్తారనే ఉద్దేశంతోనే స్టీఫెన్ కు నిబంధనలకు విరుద్ధంగా పదవులు కట్టబెట్టారన్న ప్రచారం జరుగుతోంది.
ప్రస్తుతం యూనివర్సిటీలో సుమారు 100 మందికి పైగా సీనియర్ ప్రొఫెసర్లు ఉన్నారు. వారిని కాదని బయట వ్యక్తికి యూనివర్సిటీ కస్టోడియన్ గా వ్యవహరించే రిజిస్ట్రార్ బాధ్యతలను అప్పగించడం ఏమిటన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇది సీనియర్ ప్రొఫెసర్లను అవమానించడమేనని వాదన వినిపిస్తోంది. ఈ తరుణంలో కొంతమంది సీనియర్ ప్రొఫెసర్లు కోర్టును ఆశ్రయించడానికి సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. అటు రిజిస్ట్రార్ గా స్టీఫెన్ అదనపు బాధ్యతలు తీసుకున్న కార్యక్రమానికి సైతం పలువురు ప్రొఫెసర్లు దూరంగా ఉండడం విశేషం. మొత్తానికైతే ఆంధ్రా యూనివర్సిటీ చరిత్రను విసి ప్రసాద్ రెడ్డి నీరుగార్చుతున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.