జగ్గారెడ్డి తెలంగాణలో పరిచయం అక్కర్లేని పేరు. కాంగ్రెస్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే సంగారెడ్డి జగ్గారెడ్డి ఏ విషయానైనా కుండబద్ధలయ్యేలా చెప్పేస్తుంటారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్, హరీష్ రావు పేరు చెబితే ఒంటికాలిపై లేస్తుంటారు. అలాంటి నేత తన వైఖరి మార్చుకోవడం పలు అనుమానాలకు ఊతమిస్తోంది. తెలంగాణాలో జనతా కర్ఫ్యూ విజయవంతం అవడంతో ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రధాని మోడీలను పొగడ్తలతో జగ్గారెడ్డి ముంచేత్తడం ఆసక్తికరంగా మారింది.
తెలంగాణలో జనతా కర్ఫ్యూ నేపథ్యంలో జగ్గారెడ్డి కుటుంబసభ్యులతో గడిపారు. సాధారణంగా ప్రభుత్వ చర్యలపై జగ్గారెడ్డి ఒంటికాలిపై లేస్తారనుకుంటారు. కానీ తనశైలికి భిన్నంగా జగ్గారెడ్డి టీఆర్ఎస్, బీజేపీలపై పాజిటివ్ గా మాట్లాడటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ముఖ్యంగా కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలను మెచ్చుకున్నారు. అంతేకాకుండా ప్రభుత్వానికి పలు సూచనలు చేశారు. తెలంగాణలో జనతా కర్ఫ్యూ 15 రోజుల వరకు పెట్టాలని సూచించారు.
ఈ నేపథ్యంలోనే సీఎం అత్యున్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి మార్చి 31వరకు కర్ఫ్యూ విధించింది. సీఎం కేసీఆర్ కరోనా నివారణపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. విపత్తు నిర్వహణ చట్టం-2005, అంటువ్యాధుల(నియంత్రణ) చట్టం-1897 కింద లాక్‌డౌన్ విధిస్తున్నట్లు ఉత్తర్వులో పేర్కొంది. ఎప్పటికప్పుడు సీఎం కేసీఆర్ కరోనా నివారణపై తగు చర్యలు తీసుకోవాలని అధికార యంత్రాగాన్ని పరుగుపెట్టిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ వ్యతిరేకి అయిన జగ్గారెడ్డి ఆయన చర్యలను కొనియాడటం చర్చనీయాంశంగా మారింది.
గత కొంతకాలంగా జగ్గారెడ్డి టీఆర్ఎస్ ప్రభుత్వ చర్యలను పెద్దగా ఖండించిన దాఖలు కనిపించడం లేదు. ఆయన కేవలం సొంత పార్టీ నేతలనే మీడియాలో టార్గెట్ చేస్తూ కన్పిస్తున్నారు. దీంతో ఆయన టీఆర్ఎస్ వైపు చూస్తున్నారనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అలాగే కాంగ్రెస్ లో ఉంటూ ప్రధాని మోదీ నిర్ణయాలను మెచ్చుకోవడం ఒక్కింత ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఆయన టీఆర్ఎస్ లేదా బీజేపీ నుంచి పోటీ చేస్తారని అందుకే ఆయన వైఖరి మారిందని జగ్గారెడ్డి వ్యతిరేకులు ప్రచారం చేస్తున్నారు. ఇందులో వాస్తవం ఎంత ఉందోగానీ జగ్గారెడ్డిలో మాత్రం మార్పు కన్పిస్తుందని స్పష్టంగా కన్పిస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.