CM Jagan- MLAs: వచ్చే ఎన్నికలే లక్ష్యంగా ఏపీ సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. పార్టీలో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 8 జిల్లాల పార్టీ అధ్యక్షులను మార్చారు. రీజనల్ కోఆర్డినేటర్లుగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి, కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్ లను మార్చేశారు. అయితే వీరిలో కొందరు స్వచ్ఛందంగా పదవులు వదులుకోగా..మరికొందర్ని అధిష్టానమే బలవంతంగా రాజీనామా చేయించినట్టు తెలుస్తోంది. ఇటీవల కర్నూలు జిల్లాలో చంద్రబాబు పర్యటించారు. ఆయన టూర్ సక్సెస్ అయ్యింది. రికార్డుస్థాయిలో జనాలు వచ్చారు.అటు చంద్రబాబు కూడా జగన్ పై వ్యక్తిగత కామెంట్స్ చేశారు. ఈ విమర్శలను తిప్పికొట్టడంలో వైఫల్యం చెందారంటూ కర్నూలు జిల్లా అధ్యక్షుడు బాలనాగిరెడ్డిపై హైకమాండ్ వేటు వేసింది. అటు చాలా జిల్లాల్లో అధ్యక్షుల మార్పు వెనుక అంతర్గత విభేదాలే కారణమని తెలుస్తోంది.

జిల్లా అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్ల మార్పు తరువాత ఇప్పుడు జగన్ పార్టీ అభ్యర్థుల మార్పుపై ఫోకస్ పెట్టినట్టు వార్తలు వస్తున్నాయి. గత మూడు రోజులుగా పార్టీ కీలక నాయకులు సజ్జల రామక్రిష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డిలతో జగన్ అభ్యర్థుల మార్పుపై వరుసగా చర్చించినట్టు తెలుస్తోంది. పనితీరు మార్చుకోకుంటే వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు ఇచ్చేది లేదని ఇప్పటికే జగన్ ఎమ్మెల్యేలకు తెగేసి చెప్పారు. సెప్టెంబరులో జరిగిన వర్క్ షాపులో ఏకంగా 27 మంది ఎమ్మెల్యేల పేర్లను ప్రస్తావిస్తూ పనితీరు మార్చుకోవాలని హెచ్చరికలు ఇచ్చినట్టు వార్తలు వచ్చాయి. ఇప్పుడు అధినేత వచ్చేఎన్నికల్లో అభ్యర్థులను ప్రకటించేందుకు సిద్ధపడుతుండడంతో పేర్లు బయటపడిన ఎమ్మెల్యేల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.
ప్రస్తుతం వైసీపీకి ఐ ప్యాక్ బృందం పనిచేస్తోంది. అటు ప్రైవేటు సర్వే సంస్థలు, ఏజెన్సీలు సైతం పనిచేస్తున్నాయి. వీటికి తోడు ప్రభుత్వ నిఘా వర్గాల నుంచి ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరిస్తున్నారు. సెప్టెంబరులో జరిగిన వర్కుషాపు తరువాత జగన్ ఎమ్మెల్యేలకు రెండు నెలల సమయమిచ్చారు. అటువంటి నియోజకవర్గాలను ఐ ప్యాక్ బృందం నిశితంగా గమనిస్తోంది. అటు ఇంటెలిజెన్స్ వర్గాలు సైతం ఆరాతీస్తున్నాయి. అయితే మరోవైపు రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలకు పర్యవేక్షకులను నియమించాలని భావించారు. కానీ ప్రస్తుతానికి పనితీరు మార్చుకోని.. పేలవ పనితీరు ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లోనే పర్యవేక్షకులను నియమించాలని నిర్ణయించినట్టు సమాచారం.

ఎన్ని హెచ్చరికలు పంపినా ఇంతకంటే పనిచేయలేమని.. అసలు సాధ్యమయ్యే పనికాదంటూ కొందరు ఎమ్మెల్యేలుతేల్చి చెబుతున్నారు. మా చేతిలో ఏముంది అని ప్రజలను కలుస్తాం. అంతా సీఎంకే క్రెడిట్ అంతా పోతోంది. కనీసం వలంటీర్లు, సచివాలయ ఉద్యోగులకు ఉన్న గౌరవం కూడా ప్రజలకు మాకు ఇవ్వడం లేదు. నిధులు లేవు.. విధులు లేవు. అటువంటిది ప్రజలెందుకు మమ్మల్ని పట్టించుకుంటారు. ఏదైదే అది జరుగుతుంది. ఇంతకంటే మేము ఏమీ చేయలేము. మాపై పర్యవేక్షకులను నియమిస్తే అది పార్టీకి అంతిమంగా నష్టం చేకూరుస్తుందని కొందరు ఎమ్మెల్యేలు బహిరంగంగానే కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికైతే కొన్ని నియోజకవర్గాలకు కొత్త ముఖాలు తెరపైకి వచ్చే అవకాశముందన్న మాట.