Pawan Kalyan: రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా? అధికారం చేతిలో ఉంటే ఏ పని చేయాలన్నా ఆలోచించరు. వారు పేదవారా? ధనికులా? అనే భేదాలుండవు. మనకు నచ్చలేదంటే అంతే. తీసేయ్ అంటూ ఆదేశాలు జారీ చేయడమే. అధికారంలోకి రాకముందు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేదల పక్షాన నిలబడతానని హామీ ఇచ్చారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక అదే పేదల ఇళ్లు కూలుస్తున్నారు ఇదెక్కడి విడ్డూరం. ప్రజల ఇళ్లను పడగొట్టడమేమిటనే ప్రశ్నలు వస్తున్నా ఇది నిజమే. తాడేపల్లి, మంగళగిరి నగర పాలక సంస్థల్లో రోడ్ల వెడల్పు కారణంతో పేదవారి ఇళ్లను పడగొడుతున్నారు. దీంతో ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి.

పేదల ఇళ్లను కూలుస్తున్న ప్రభుత్వం కూడా త్వరలో కూలుతుందని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మండిపడుతున్నారు. పేదలకు ఇళ్లు నిర్మించాల్సింది పోయి వారి ఇళ్లను టార్గెట్ చేసుకోవడం విడ్డూరమే. ఇప్పటికే 70 ఫీట్ల వెడల్పు ఉన్న రోడ్డును ఇంకా వెడల్పు చేయాలని సర్కారు ఉద్దేశం ఏమిటో తెలియడం లేదు. దీంతో ప్రజలందరు కోర్టు మెట్లెక్కారు. కోర్టు స్టే ఆర్డర్ ఇవ్వడంతో పనులు ఆపేసినా జగన్ కనుసన్నల్లో పనిచేసే అధికార యంత్రాంగం అర్థరాత్రి వచ్చి కూలగొడితే ఎలా అనే అనుమానాలు అందరిలో వస్తున్నాయి. వారు మనకు ఓటు వేయని వారైతే అంతే వారి ఇళ్లు నేలమట్టం కావాల్సిందే. మనకు పడని వారైతే తొక్కి పట్టి నార తీయడం జగన్ కు అలవాటుగా మారింది.
ఇప్పటికే టీడీపీ నేత అయ్యన్నపాత్రుడుపై తప్పుడు కేసులు పెట్టి రాత్రి పూట అరెస్టు చేసి చేతులు కాల్చుకున్న ప్రభుత్వం తీరుపై జనసేన, టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. అధికార దాహానికి పరాకాష్టగా అభివర్ణిస్తున్నారు. పేదల ఇళ్లను కూల్చడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. అధికార పార్టీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోంది. దీనికి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని చెబుతున్నారు. ప్రజల ఇళ్లను కూలుస్తున్న వైసీపీ నేతల నిర్వాకం హాస్యాస్పదంగా ఉందని దుయ్యబడుతున్నారు. అధికారం ఉంటే ఇలాంటి పనులు చేయడమేమిటో అర్థం కావడం లేదు.

తాడేపల్లి, మంగళగిరి కార్పొరేషన్లలో అధికారులు చేపడుతున్న చర్యల పట్ల ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది. తమ ఇళ్లు కూల్చడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగన్ తన గోతిని తానే తవ్వుకుంటున్నారని శాపనార్థాలు పెడుతున్నారు. సర్కారు తీరుకు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని జోస్యం చెబుతున్నారు. కూల్చివేతలను అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆందోళన చేపట్టిన వారిని అరెస్టు చేశారు. దీనిపై విమర్శలు ఎక్కువవుతున్నాయి.