AP Assembly Sessions: ప్రజాస్వామ్యంలో చట్టసభలను ఆలయాలుగా భావిస్తారు. ప్రజలకు అవసరమైన అన్ని రకాల చర్చలు, చట్టాల రూపకల్పన చట్టసభల్లోనే జరుగుతాయి. కానీ దురదృష్టవశాత్తు ఏపీలో ఆ పరిస్థితి లేదు. వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత సీజన్ల వారీగా అసలు శాసనసభ సమావేశాలే జరగడం లేదు. దీంతో ప్రజాస్వామ్యం అన్న మాటే లేకుండా పోతోంది. చట్టసభలో మాట్లాడే అరుదైన అవకాశం ప్రజాప్రతినిధులకు దక్కకుండా పోతుంది.
నవరత్నాలను అమలు చేస్తున్నాం.. ఇక శాసనసభ తో పని ఏమి అన్నట్టుంది జగన్ సర్కార్ దుస్థితి. అసెంబ్లీని ఆరు నెలల్లోపు సమావేశపరచడం రాజ్యాంగ విధి. అయితే కచ్చితంగా సమావేశపరచాల్సిన టైం కు సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. కానీ ఒకటి రెండు రోజులతో ముగిస్తున్నారు. రైతుకు అదును దాటిన తర్వాత మాదిరిగా.. వర్షాకాల సమావేశాలు ఏర్పాటు చేయడానికి సర్కార్ కు తీరిక లేకుండా పోయింది. వచ్చేనెలాఖరు తో అసెంబ్లీని సమావేశపరిచి ఆరు నెలలు దాటిపోతుంది. అయితే ప్రభుత్వము వర్షాకాల సమావేశాలను ఏర్పాటు చేయాలని భావిస్తుంది కానీ.. ఒకటి రెండు రోజుల్లోనే ముగించాలని డిసైడ్ అయింది.
అసలు అసెంబ్లీ సమావేశాలు అవసరం లేదన్నట్టుగా జగన్ సర్కార్ వ్యవహరిస్తోంది. అసలు సభలో ప్రతిపక్ష పాత్ర అంటూ ఏదీ కనిపించడం లేదు. ఒకవేళ ప్రతిపక్షం నిర్మాణాత్మక సలహాలు ఇస్తున్నా పాటించడం లేదు. రకరకాలుగా వారి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. కేవలం ముఖ్యమంత్రి జగన్ భజన కే సభ్యులు పరిమితం అవుతున్నారు. తిరుగులేని మెజారిటీ ఉన్నా.. పరిమిత సభ్యులతో విపక్షం వీక్ గా ఉన్నా వారిపై బూతులు, తిట్లు, దాడులకే పాలక పక్షం పరిమితమవుతోంది. లేకుంటే సస్పెండ్ చేసి.. ఒకరిద్దరూ కుహనా మేధావులతో మాట్లాడించి సభను క్లోజ్ చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఆలయాలుగా భావించే చట్టసభలను అపహాస్యం చేస్తున్నారు.