Chandrababu
Chandrababu: చంద్రబాబు ఏది చేసినా పక్కాగా చేస్తారు.. అది తప్పు అయినా.. ఒప్పు అయినా. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ సర్కార్ శూల శోధన చేసినా చంద్రబాబు అక్రమాలు వెలుగులోకి తేలేకపోయింది. టిడిపి సర్కార్ హయాంలో జరిగిన అవకతవకలు వెలుగులోకి తెచ్చేందుకు ప్రత్యేక అధికారుల బృందాన్ని రంగంలోకి దించినా ఫలితం లేకపోయింది. చివరకు ఓటుకు నోటు కేసులో సైతం అటు తెలంగాణ సర్కారు, ఇటు ఏపీ సర్కారు ఏమీ చేయలేకపోయాయి. ఏమీ చేయలేక చేతులెత్తేశాయి. ఈ తరుణంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీల నుంచి 118 కోట్ల రూపాయలు ముడుపులు తీసుకున్నారని చంద్రబాబుపై అభియోగం మోపుతూ ఐటీ శాఖ నోటీసులు ఇచ్చింది. అయితే ఇది కూడా మరో ఓటుకు నోటు కేసు అవుతుందా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
ఓటుకు నోటు కేసులో చంద్రబాబు అడ్డంగా బుక్కయ్యారన్నది నిర్వివాద అంశం. కానీ చంద్రబాబుఈ కేసు నుంచి అప్పుడే బయటపడ్డారు. వాయిస్ టెస్ట్ లో చంద్రబాబు దొరికిపోయినా.. సవా లక్ష మార్గాల్లో ఆయన తప్పించుకోవడానికి అవకాశాలు కనిపించాయి. అంతకుమించి ఫోన్ టాపింగ్ దెబ్బకి తెలంగాణ సీఎం కేసీఆర్ సైతం సైలెంట్ కావాల్సి వచ్చింది. చంద్రబాబుతో సర్దుబాటు చేసుకోవాల్సి న పరిస్థితి ఏర్పడింది. లేకుంటే ఓటుకు నోటు, ఫోన్ టాపింగ్ కేసులు కవలలు లాంటివి. ఒక కేసును టచ్ చేసినా.. మరో కేసు మెడకు చుట్టుకోవడం ఖాయం.అందుకే చంద్రబాబును కేసీఆర్ క్షమించారు. కెసిఆర్ పై చంద్రబాబు కృతజ్ఞతా భావం చూపుకున్నారు. అయితే అంతిమంగా నష్టపోయింది మాత్రం ఏపీ ప్రజలే. ఇంకా ఉమ్మడి రాజధానిపై గడువు ఉన్నా చంద్రబాబు తెలంగాణ ఖాళీ చేయాల్సి వచ్చింది.
పోనీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబుపై బలమైన కేసులు పెట్టగలిగారా అంటే అదీ లేదు. కేవలం ఇప్పటి మాదిరిగానే నోటీసులతోనే సరిపెట్టుకుంటూ వస్తున్నారు. అదిగో చంద్రబాబు అరెస్ట్.. ఇదిగో చంద్రబాబు అరెస్ట్ అంటూ హడావుడి చేశారే తప్ప.. అరెస్టు చేసిన దాఖలాలు లేవు. దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో సైతం చాలా రకాల కేసులను చంద్రబాబుపై పెట్టారు. కొన్నింటిపై చంద్రబాబు కోర్టులకు వెళ్లి స్టేలు తెచ్చుకోగా.. మరికొన్ని కేసుల విషయంలో రాజశేఖర్ రెడ్డి కనికరం చూపారని అప్పట్లో ప్రచారం జరిగింది.
ఇప్పుడు ఈ 118 కోట్ల రూపాయల ముడుపుల విషయంలో కూడా అదే పునరావృత్తమవుతుందని.. కేసుల నుంచి బయటపడే మార్గం చంద్రబాబుకు ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పైగా బీజేపీతో స్నేహం కుదిరే పరిస్థితి కనిపిస్తుండడంతో ఎట్టి పరిస్థితుల్లో ఈ కేసు బలపడే ఛాన్స్ ఉండదని.. ఇదంతా మీడియా హడావిడి అని గత అనుభవాలు తెలిసిన వారు కొట్టి పారేస్తున్నారు.