Chandrababu: చంద్రబాబు అరెస్టుతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి అమరావతి వరకు భారీ ర్యాలీ నిర్వహించాలని.. చంద్రబాబుకు ఘనంగా స్వాగతం పలకాలని తెలుగుదేశం పార్టీ శ్రేణులు సిద్ధమవుతున్నాయి. ఇటువంటి తరుణంలో జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. చంద్రబాబు విడుదల సందర్భంగా ఎటువంటి రాజకీయ ర్యాలీలు, రాజకీయ ప్రసంగాలు చేయకూడదని.. మీడియాతో కూడా మాట్లాడకుండా ఉండేలా ఆదేశాలు ఇవ్వాలని జగన్ సర్కారు ఏకంగా హైకోర్టును ఆశ్రయించింది. లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది.
స్కిల్ స్కాం లో అరెస్టు అయిన చంద్రబాబు దాదాపు 53 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.ఎటువంటి ఆధారాలు లేకుండా కేసులు పెట్టారని టిడిపి వర్గాలు భావిస్తున్నాయి. చంద్రబాబుకి ముమ్మాటికి అక్రమ అరెస్టేనని అభిప్రాయపడుతున్నాయి. అధినేత జైలు పాలు కావడంతో గత 50 రోజులుగా విభిన్న రీతిలో టిడిపి శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తూ వచ్చాయి. కోర్టులో వరుసగా చుక్కెదురు కావడంతో నిరాశ నిస్పృహలు అలుముకున్నాయి. ఇటువంటి తరుణంలో చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ లభించడం ఉపశమనం కలిగించే విషయం. అయితే టిడిపి శ్రేణులు భారీ ర్యాలీలు, రాజకీయ ప్రసంగాలు చేస్తే శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందని ప్రభుత్వం భయపడుతోంది. అందుకే అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది.
వాస్తవానికి గత కొద్దిరోజులుగా చంద్రబాబు ఆరోగ్యం విషయంలో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తూ వచ్చారు. పార్టీ శ్రేణులు సైతం చంద్రబాబు అనారోగ్యానికి, జైలులో అంతమొందించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని అనుమానం వ్యక్తం చేస్తూ వచ్చాయి. ఈ తరుణంలోనే ఆయన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా మద్యంతర బెయిల్ మంజూరు చేయాలని ఆయన తరుపు న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు తప్పకుండా బెయిల్ ఇస్తుందని భావించిన సిఐడి.. తాజాగా మద్యం కుంభకోణాన్ని తెరపైకి తెచ్చింది. చంద్రబాబును a3 గా చూపుతూ కోర్టుకు నివేదించింది. అయితే కోర్టు చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా బెయిల్ వైపే మొగ్గు చూపింది.
అయితే ఇప్పుడు చంద్రబాబు కానీ రాజకీయ ప్రసంగాలు మొదలుపెట్టినా.. రాజకీయ సంఘర్షణలు చేసినా, ర్యాలీలు తలపెట్టినా, మీడియాతో మాట్లాడిన ప్రభుత్వంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని.. అందుకే అలా చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టులో ఆకస్మికంగా లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి. అయితే భయంతోనే జగన్ సర్కార్ కోర్టును ఆశ్రయించినట్లు ప్రచారం జరుగుతోంది.