
AP Sticker Politics: రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జగనన్నే మా భవిష్యత్తు.. మా నమ్మకం నువ్వే జగన్ పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా జగన్.. రాజకీయంగా సరికొత్త ఎత్తుగడకు సిద్ధమయ్యారు. స్టిక్కర్ల పేరుతో చేస్తున్న రాజకీయంలో ప్రతిపక్షాలను భాగస్వాములను చేయడం ద్వారా జగన్ డామినేట్ చేశారన్న భావన సర్వత్ర వ్యక్తం అవుతోంది.
ఎన్నికలకు మరో ఏడాది సమయం ఉందనగా.. రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్షాలు ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే అధికార పార్టీ గడపగడపకు మన ప్రభుత్వం పేరుతో ఇంటింటికి వెళుతుండగా… ఇదేం కర్మ రాష్ట్రానికి అంటూ తెలుగుదేశం పార్టీ ప్రతి ఇంటి గుమ్మాన్ని తొక్కుతోంది. తాజాగా అధికార వైసిపి మరో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రతి ఇంటికి వెళ్లి జగన్మోహన్ రెడ్డి ఫోటోతో కూడిన స్టిక్కర్లను అంటించే కార్యక్రమాన్ని చేపట్టింది. జగనన్నే మా భవిష్యత్తు.. మా నమ్మకం నువ్వే జగన్ అంటూ ఈ స్టిక్కర్లను వైసీపీ శ్రేణులు అంటిస్తున్నారు. దీనికి పోటీగా జనసేన, టిడిపి కూడా స్టిక్కర్ల ఉద్యమంలో భాగమయ్యాయి. మా నమ్మకం నువ్వే పవన్.. పవన్ రావాలి పాలన మారాలి అంటూ.. జనసేన శ్రేణులు కూడా ఇంటింటికి వెళ్లి స్టిక్కర్లను అంటిస్తున్నారు. ఇదే బాటలో తెలుగుదేశం పార్టీ కూడా పయనిస్తోంది. చంద్రబాబుతోనే రాష్ట్ర అభివృద్ధి.. మా నమ్మకం చంద్రబాబు అంటూ తెలుగుదేశం పార్టీ కూడా స్టిక్కర్లు అంటించే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపడుతుంది. దీంతో రాష్ట్రంలో ప్రస్తుతం స్టిక్కర్ల ఉద్యమం నడుస్తున్నట్లు కనిపిస్తోంది.
జగన్మోహన్ రెడ్డి ప్లాన్ లో ప్రతిపక్షాలు భాగం..
సీఎం జగన్ మోహన్ రెడ్డి స్టిక్కర్ల కార్యక్రమానికి శ్రీకారం చుట్టడానికి ముందే.. ప్రతిపక్షాలు కూడా ఈ బాటలోకి వస్తాయని భావించినట్లు చెబుతున్నారు. వైసీపీ ఇంటింటికి వెళ్లి స్టిక్కర్లు అంటిస్తే.. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు ఆయా ఇళ్ల వద్ద అభ్యంతరాలు వ్యక్తం చేస్తారు. దీనివల్ల పబ్లిక్ లో ఒక రకమైన చర్చ జరుగుతుంది. చర్చ జరగాలన్నదే సీఎం జగన్ మోహన్ రెడ్డి వ్యూహంగా కనిపిస్తోంది. దీనివల్ల గత ప్రభుత్వాలు ఏం చేశాయి, తమ ప్రభుత్వం ఏం చేసింది అన్న చర్చ నడిచినప్పుడు.. పార్టీలకు అతీతంగా తమ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి చర్చించాల్సి వస్తుందని సీఎం జగన్మోహన్ రెడ్డి భావించారు. టిడిపి, జనసేన పార్టీలు కూడా ఈ స్టిక్కర్లు అంటించే కార్యక్రమాన్ని చేపట్టడం వల్ల అనేకచోట్ల వివాదాస్పదం అవుతోంది. మామూలుగా అయితే అధికార పార్టీ స్టిక్కర్లు అంటించి వెళ్లిపోయిన తర్వాత.. ఇళ్లల్లోని ప్రజలు ఇది ఎందుకు వచ్చింది రా బాబు ఈ స్టిక్కర్ల గోల అని.. అనుకునే ఆస్కారం ఉండేది. దీనివల్ల వైసిపికి లాభం కంటే నష్టమే కలిగేది. అయితే, ప్రతిపక్షాలు కూడా ఇదే విధంగా స్టిక్కర్లు అంటించడం వల్ల ఆయా ఇళ్లల్లోని ప్రజల్లో ఒక రకమైన ఆలోచన మొదలైనట్లు చెబుతున్నారు. ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందించింది కాబట్టి స్టిక్కర్లు అంటిస్తున్నారని.. వీళ్ళు ఏం చేశారని ఈ స్టిక్కర్లు అంటిస్తున్నారు అర్థం కావడంలేదన్న భావన అనేక ప్రాంతాల్లోని ప్రజల్లో వ్యక్తం అవుతున్నట్లు చెబుతున్నారు. ఇది ఒక రకంగా వైసిపికి మేలు కలిగించేలా ప్రతిపక్షాలు చేస్తున్నట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు.
మైండ్ గేమ్ లో భాగంగానే స్టిక్కర్ల కార్యక్రమం..
ఇంటింటికి వెళ్లి స్టిక్కర్లు అంటించడం ద్వారా.. ఆయా ఇళ్లల్లోని ఓటర్లపై వైసీపీపై సానుకూల దృక్పథాన్ని తీసుకువచ్చే ప్రయత్నం జగన్ మోహన్ రెడ్డి చేస్తున్నారు. సంక్షేమ పథకాలు పొందిన ప్రతి ఇంటి వద్ద ఈ స్టిక్కర్లు ఉండడం వల్ల.. ప్రతిపక్షాలు వారితో ఒక రకమైన ఘర్షణ పూరితమైన వాతావరణాన్ని అవలంబించే అవకాశం ఉంది. మామూలుగా అయితే, స్టిక్కర్లు అంటించుకున్నంత మాత్రాన వాళ్ళు ఎవరు వైసీపీకి ఓట్లు వేసే పరిస్థితి ఉండదు. కానీ ఈ స్టిక్కర్లు అంటించడం వల్ల జరిగే గొడవలతో.. ఆయా ఇళ్లకు సంబంధించిన యజమానులు, ఓటర్లు వైసీపీకి బలమైన మద్దతుదారులుగా మారిపోయే అవకాశం కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇటువంటి వ్యవహారాలు జరుగుతాయని ముందుగానే జగన్మోహన్ రెడ్డి ఊహించే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతిపక్షాలు దీనికి ప్రతిగా కార్యక్రమాలు చేపట్టడం కంటే.. మరో కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి వెళ్లి మద్దతు పొందడం మంచిది అన్న భావన అన్ని వర్గాల్లోని వ్యక్తం అవుతుంది. ఘర్షణ పూరిత వాతావరణం వల్ల వైసీపీకి లబ్ధి కలుగుతుంది తప్ప నష్టం కలవదు అన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

కాపీ కొట్టే కార్యక్రమాలు వద్దు.. ప్రజల్లోకి వెళ్ళాలి..
గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంతో వైసిపి ప్రతి ఇంటికి వెళితే.. ఇదేం కర్మ అంటూ తెలుగుదేశం పార్టీ మరో కార్యక్రమాన్ని చేపట్టింది. ఇది కూడా ఇంచుమించుగా వైసీపీ ప్రభుత్వం గడపకు గడపకు కార్యక్రమం లాంటిదే. ఒక రకంగా చెప్పాలంటే వైసిపి పెట్టిన కార్యక్రమాన్ని కాపీ కొట్టి.. దీన్ని రూపొందించినట్లు అనిపిస్తుంది. ఇక తాజాగా స్టిక్కర్ల కార్యక్రమాన్ని కూడా తెలుగుదేశం, జనసేన కాపీ కొట్టాయని చెబుతున్నారు. ఈ రకమైన భావన ప్రజల్లోకి రావడం వల్ల ప్రతిపక్షాలకు నష్టం కలుగుతుందన్న విశ్లేషణలు వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా ప్రత్యేక కార్యక్రమాల రూపొందించడం వలన లాభం ఉంటుందని చెబుతున్నారు. ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెరిగిన ధరలు, చార్జీలు వంటి వాటిపై రోడ్లపైకి వెళ్లి పోరాటాలు చేస్తే మెరుగైన ఫలితం ఉంటుందని, తద్వారా ప్రజల్లో సానుభూతి పెరుగుతుంది అన్న విశ్లేషణలు ఉన్నాయి. ఆ దిశగా ప్రతిపక్షాలు కృషి చేస్తే మంచి ఫలితం ఉంటుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.