
Jagan- AP Education System: ఏపీ సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్, ఎయిడెడ్ విద్యాసంస్థల్లో విద్యాహక్కు చట్టం అమలుకు నిర్ణయించింది. అడ్మిషన్లలో పేదలకు 25 శాతం సీట్లు కేటాయించాలా స్పష్టమైన ఆదేశాలిచ్చింది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి కచ్చితంగా అమలుచేయాల్సిందేనని స్పష్టం చేసింది. చాలా రాష్ట్రాల్లో ఈ నిర్ణయం అమలవుతోంది. ప్రభుత్వమే నేరుగా పేద విద్యార్థుల చదువుకు అవసరమైన ఫీజులు ప్రైవేటు సంస్థలకు చెల్లిస్తున్నాయి. ఇప్పుడు ఏపీలో కూడా జగన్ సర్కారు అటువంటి నిర్ణయమే తీసుకుంది. కానీ దానికి ఒక మెలిక పెట్టింది. అమ్మ ఒడి ద్వారా అందిస్తున్న సాయాన్ని విద్యాహక్కు చట్టానికి వినియోగించుకోవాలని సూచించింది.ఒక వేళ తల్లిదండ్రులు ఫీజులు చెల్లించకుంటే.. అమ్మఒడిలో మినహాయించి చెల్లించనున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది.
2023-,24 విద్యా సంవత్సరానికి గాను ఒకటో తరగతిలో విద్యాహక్కు చట్టం పథకం కింద 25 శాతం అడ్మిషన్లపై పాఠశాల విద్యా శాఖ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 18 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. మార్చి 4న నోటిఫికేషన్ జారీ అవుతుందని, 6 నుంచి 16 వరకు ప్రైవేటు పాఠశాలలు రిజిస్ట్రేషన్ చేసుకుంటాయని వివరించింది. మార్చి 18 నుంచి ఏప్రిల్ 7 వరకు పాఠశాల విద్యా శాఖ వెబ్‌సైట్‌లో విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. ఏప్రిల్ 13న మొదటి లాటరీ ఫలితాలు, 25న రెండో లాటరీ ఫలితాలు విడుదల చేస్తారని తెలిపింది.అమ్మఒడి నగదు ఖాతాల్లో జమ అయిన 60 రోజుల్లోగా పాఠశాలకు ఫీజుల కట్టాలని, లేనిపక్షంలో తదుపరి సంవత్సరం అమ్మఒడి నగదును ప్రభుత్వమే మినహాయించుకుని ఫీజు చెల్లిస్తుందని వివరించింది.
విద్యాహక్కు చట్టం కింద వచ్చే సీట్లు ఉచితమని అంతా భావిస్తారు. దేశంలో వివిధ రాష్ట్రాల్లో ఇదే అమలుచేస్తున్నారు. పాఠశాలల్లో చేరిన నాటి నుంచి విద్యార్థి ఫీజులు, వసతి, ఇలా అన్నిరకాలుగా ప్రభుత్వమే చెల్లింపులు చేస్తోంది. కానీ ఏపీలో మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది. వాస్తవానికి విద్యాహక్కు చట్టం కింద వచ్చే అడ్మిషన్లకు సంబంధించి దరఖాస్తు చేసుకునే సమయంలో ఇంజనీరింగ్ సీట్ల తరహాలో సమీపంలోని పాఠశాలలను ఎంపిక చేసుకోవాలి. లాటరీ నిర్వహించి విద్యార్థులకు సీట్లు కేటాయిస్తారు. ఈ మొత్తం ప్రక్రియలో సీటు దక్కడం అనేది అదృష్టంపై ఆధారపడి ఉంటుంది. ఇంతచేసి సీటు సాధించినా చివరికి అమ్మఒడి నగదే కట్టుకోవాలి. అలాంటప్పుడు విద్యా హక్కు చట్టం కింద సీటు పొందడం వల్ల కలిగే ప్రయోజనం ఏంటనేది అంతుపట్టడం లేదు. అమ్మఒడి నగదు చెల్లించాల్సినపుడు ఆర్టీఈ కింద కాకుండా తల్లిదండ్రులు తమకు కావాలనుకున్న పాఠశాల ను నేరుగా ఎంపిక చేసుకోవచ్చు. అడ్మిషన్ తీసుకుని అమ్మఒడి నగదు పడిన తర్వాత ఫీజుగా చెల్లించుకోవచ్చు.

అయితే అటువంటప్పుడు ప్రైవేటు విద్యాసంస్థల్లో విద్యాహక్కు చట్టం పథకంలో ప్రత్యేకత ఏమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఏపీలో ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం అమ్మఒడి అందిస్తోంది. ఎక్కువ మంది ప్రైవేటు విద్యాసంస్థల విద్యార్థులే అమ్మఒడి దక్కించుకున్నారు. అటువంటప్పుడు విద్యాహక్కు చట్టం అమలుచేస్తే ఏమిటి? అమలు చేయకుంటే ఏమిటి? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. 25 శాతం పేదలకు ప్రైవేటు సంస్థల్లో చదువుకునేందుకు అవకాశం కల్పించినప్పుడు వారి పూర్తిస్థాయి బాధ్యతలు ప్రభుత్వమే తీసుకుంటే మంచిది. అటు ప్రభుత్వమేనేరుగా చెల్లింపులు చేస్తే అటు పేద విద్యార్థులకు, ఇటు ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలకు ప్రోత్సహిచ్చినట్టవుతుంది. అయితే వైసీపీ సర్కారు ఇప్పడిస్తున్న అమ్మఒడి సాయాన్నే విద్యాహక్కు పథకంగా చూపించే ప్రయత్నం చేసినట్టు అర్ధమవుతోంది.