Jaganannaku Chebudam Program: ఇక నుంచి చెప్పుకున్నదే వింటారా జగనన్నా?

వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో ఎన్నో లోటుపాట్లు ఉన్నాయి. అర్హులను కూడా రకరకాల నిబంధనలతో తీసిపక్కన పెట్టారు.

Written By: SHAIK SADIQ, Updated On : May 9, 2023 3:25 pm

Jaganannaku Chebudam Program

Follow us on

Jaganannaku Chebudam Program: వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత చేస్తున్న పనులన్నీ అడ్డ తిక్కలోడులానే ఉంటున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అభివృద్ధి కూడా చేసి చూపుతామని ఢంకాలు బజాయించుకునేందుకు ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు. సంక్షేమమే తమ ప్రభుత్వ అంతిమ ధ్యేయమని నిన్నా మొన్నటి వరకు చెప్పుకున్నారు. నవరత్నాలు గట్టెక్కిస్తాయని భావించినా, అమలు తీరులో లోపాలు, నిబంధనల కారణంగా చాలా మంది వ్యతిరేకులుగా మారిపోయారు. దాంతో మళ్లీ గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపుతామని అంటున్నారు. ఏ సమస్య అయినా వినేందుకు సిద్ధంగా ఉన్నట్లు ముఖ్యమంత్రి జగన్ అంటున్నారు.

వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో ఎన్నో లోటుపాట్లు ఉన్నాయి. అర్హులను కూడా రకరకాల నిబంధనలతో తీసిపక్కన పెట్టారు. వీరంతా గత ప్రభుత్వం నుంచి సంక్షేమ ఫలాలు తీసుకుంటున్న వారే. తమ సమస్యను చెప్పుకునేందుకు సచివాలయాలు, కాల్ సెంటర్లు ఉన్నా, అవి పనిచేస్తున్న తీరుపైనా విమర్శలు వస్తున్నాయి. ఎన్నో ఫిర్యాదులు వస్తుంటే, పరిష్కారం చూపుతున్నది చాలా తక్కువ. వాటినే పెద్దవిగా చూపుతూ ప్రచారం చేసుకోవడం వైసీపీ ప్రభుత్వానికి చెల్లిందంటూ ప్రతపక్షాలు ఎత్తి పొడుస్తున్నాయి.

గత టీడీపీ ప్రభుత్వంలో ప్రజలు నేరుగా సమస్యలను చెప్పుకునే పీపుల్స్ ఫస్ట్ విధానాన్ని ప్రారంభించారు. డైరెక్టుగా ముఖ్యమంత్రి చంద్రబాబు కాల్స్ రిసీవ్ చేసుకుంటూ లైవ్ లో మాట్లాడేవారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతితో పాటు, స్థల సమస్యలు, వేధింపులు తదితర ఎన్నో సమస్యలకు పరిష్కారాలు వెనువెంటనే చూపించారు. విద్యుత్ మీటరుకు లంచం డిమాండు చేశారంటూ ఓ రైతు ఫిర్యాదు చేయడం అప్పట్లో సంచలనంగా మారింది. క్షణాల్లో రైతుకు ఆ డబ్బును తిరిగి ఇచ్చేశాడు.

వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత ఆ కాల్ సెంటర్ ను తీసేసి స్పందన అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. అందులో వస్తున్న ఫిర్యాదులను ఎప్పటికప్పుడు ఆన్ లైన్ చేసి పరిష్కారం చూపేందుకు వ్యవధిని నిర్ణయించారు. అయితే, ఆ సమస్యలు అలానే పెండింగ్ లో ఉండిపోతున్నాయి. పైగా వైసీపీ నాయకులు ప్రతిపక్షాలను వేధింపులకు గురిచేసేందుకు స్పందనను బాగా వాడుకున్నట్లు విమర్శలు వచ్చాయి.

ప్రస్తుతం మరో కొత్త కార్యక్రమానికి జగన్ శ్రీకారం చుట్టారు. అదే ‘‘జగనన్నకు చెబుదాం’’. ఇన్నాళ్లు జరిగిన అవినీతి, అక్రమాలకు పరిష్కారం చూపకుండా ఎన్నికలు కొద్ది రోజుల ముందు ఇటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కాల్ సెంటర్ కూడా ఐ ప్యాక్ టీం ఆధ్వర్యంలోనే నడుస్తుంది. కొన్ని ఫిర్యాదులు బయటకు రాకపోవచ్చు. ఎందుకంటే ఈ నాలుగేళ్లలో జరిగిన సమస్యలపైనే ఎక్కువగా కాల్స్ వచ్చే అవకాశం ఉంది. అంతకంటే ముందు జగన్ వాయిస్ మెసేజ్ ను ఫిర్యాదు దారులు వినాల్సి ఉంటుంది.