
Jagan – Lokesh : బలహీనుడి వెనుక ఓ బలవంతుడు ఉంటాడని ఓ సినిమాలో డైలాగ్ ఉంది. అది అక్షరాల నిజం. బలహీనుల పట్ల జనం ఎప్పుడూ సానుభూతి చూపిస్తారు. బలహీనుల పై అణచివేతను ఎప్పుడూ హర్షించరు. బలహీనుడి వెంట నిలబడతారు. అవసరమైతే కలబడతారు. చరిత్ర మొత్తం తరచి చూసినా ఇలాంటి సంఘటనలే మనకు కనిపిస్తాయి.
జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. వాటిలో ప్రధానమైనది ఆయన పై ఉన్న సానుభూతి. కాంగ్రెస్ పార్టీని ఎదిరించి సొంత పార్టీ పెట్టినందుకు కేసుల పేరుతో వేధించారన్న సానుభూతి ప్రజల్లో వెల్లువెత్తింది. ఏ ఎన్నిక జరిగినా జనం జగన్ కు జేజేలు కొట్టారు. 2019లో అధికారం కట్టబెట్టారు. దీనంతటికీ కారణం జగన్ బలహీనుడనే భావన జనంలో ఉండటం. మిగిలిన పార్టీలన్నీ ఏకమై జగన్ తో ఒంటరి పోరాటం చేస్తున్నాయని జనం నమ్మడం. సుదీర్ఘ పాదయాత్రలతో జనంలో నిత్యం తిరగడం. ఇదే జగన్ కు తిరుగులేని మెజార్టీని సాధించేలా చేసింది.
జగన్ అధికారంలోకి వచ్చారు. మూడున్నరేళ్లుగా పాలన సాగిస్తున్నారు. జగన్ పాలన జనరంజకంగా లేదంటూ టీడీపీ నేత నారా లోకేష్ పాదయాత్ర చేపట్టారు. పాదయాత్రకు ఊహించిన స్థాయిలో ఆదరణ రావడంలేదని వైసీపీ చెబుతోంది. దీనిని జనంలోకి తీసుకెళ్లేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. లోకేష్ కు ఆదరణ లేకపోవడానికి పాదయాత్రల పై జనాల్లో ఆసక్తి తగ్గడం ఒక కారణమైతే.. టీడీపీ పాదయాత్రను సరిగా నిర్వహించలేకపోవడం మరో కారణంగా చెప్పవచ్చు. అదే సమయంలో లోకేష్ వాక్పటిమ జనాన్ని ఆకర్షిచకపోవడం. వీటినే ప్రధాన అస్త్రాలుగా చేసుకొని తాడేపల్లిలోని సజ్జల భార్గవరెడ్డి ఆధ్వర్యంలో విపరీతమైన సోషల్ మీడియా ప్రచారం చేస్తున్నారు.
వైసీపీ చెబుతున్నట్టుగా లోకేష్ పాదయాత్రకు ఆదరణ లేదని అనుకుందాం. జనం రావడంలేదని భావిద్దాం. మరి అలాంటప్పుడు పోలీసులతో నిత్యం పాదయాత్రను అడ్డుకునే ప్రయత్నం చేయడం ఎందుకు ?. ప్రజలను ఉద్దేశించి మాట్లాడకుండా మైకు లాక్కోవడం ఎందుకు ?. కనీసం వాహనం పై ఎక్కి మాట్లాడేందుకు అనుమతి ఇవ్వకపోవడం దేనికి సంకేతం ?. లోకేష్ మాట్లాడితే వైసీపీ అధికారం కోల్పోతుందాఉ ?. వీటికి సమాధానాలు చెప్పాల్సిన బాధ్యత వైసీపీకి ఉంది.
రాజకీయ చాణక్యుడిగా పేరు గడించిన చంద్రబాబు.. తన కొడుకును తీర్చిదిద్దలేకపోయాడన్న భావన జనంలో ఉంది. ఇప్పుడు ఆ బాధ్యత జగన్ భుజాలకు ఎత్తుకున్నట్టు కనిపిస్తోంది. నిరంతర అణచివేత ద్వార లోకేష్ ను గొప్ప నాయకుడిగా తయారుచేసే పని నిర్విఘ్నంగా చేస్తున్నారు. లోకేష్ పాదయాత్రకు అడ్డంకులు సృష్టించడం ద్వార లోకేష్ బలవంతుడు అవుతాడు. ఇప్పటికే లోకేష్ బలహీనుడనే భావన ప్రజల్లో ఉంది. అలాంటి బలహీనుడిని ఇంకా అణచివేస్తే.. ప్రజలు ఆ బలహీనుడి వెంట నిలబడే అవకాశం ఉంది. ఆ బలహీనుడి కోసం పోరాడం అవకాశం లేదు. చరిత్రలో ఇలాంటి సంఘటనలు అనేకం. అణచివేత తీవ్రమైతే ప్రతిఘటనే ప్రత్యామ్నాయం అవుతుంది.