Amaravathi: అమరావతి రాజధాని ఉద్యమానికి ప్రభుత్వం అడ్డంకులు సృష్టించాలని ప్రయత్నిస్తున్నా సాధ్యం కావడం లేదు. ఇప్పటికే రాజధాని విషయంలో న్యాయస్థానాల నుంచి ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు చుక్కెదురవుతూ వస్తోంది. తాజాగా మహా పాదయాత్ర 2.0 కు కూడా అడ్డుకోవాలని ప్రభుత్వం ప్రయత్నించింది. అమరావతి టూ అరసవల్లి మహా పాదయాత్రకు శాంతిభద్రతలను సాకుగా చూపి అడ్డుకోవాలని చూసింది. పోలీస్ శాఖ ద్వారా అనుమతులు నిరాకరించింది. యాత్ర నిర్వాహకులకు నోటీసులిచ్చింది. కానీ ఇవేవీ న్యాయస్థానం ముందు నిలబడలేదు. ప్రజాప్రతినిధులు, నాయకుల పాదయాత్రలకు, సభలు, సమావేశాలకు లేని భద్రతా అనుమానాలు, రైతుల విషయంలో రావడం ఏమిటని న్యాయస్థానం ప్రశ్నించింది. మహా పాదయాత్ర 2.0ను విజయవంతంగా పూర్తిచేయడానికి సహకారమందించాలని.. ఆ బాధ్యత పోలీస్ శాఖదేనంటూ తిరిగి కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. దీంతో పోలీస్ శాఖతో పాటు ప్రభుత్వం నోటిలో పచ్చి వెలక్కాయ పడినట్టయ్యింది.

డీజీపీ కార్యాలయానికి వివరాలు..
అటు మహా పాదయాత్ర 2.0కు అమరావతి రైతులు, జాయింట్ యాక్షన్ కమిటీ ప్రతినిధులు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. రూట్ మ్యాప్ ను సిద్ధం చేసుకున్నారు. సుమారు 600 మంది పాల్లొంటున్నట్టు పోలీస్ శాఖకు సమాచారమందించారు. అటు వారి ఫొటోలు, ఆధార్ నంబర్లు, పేర్లతో కూడిన వివరాలను అందించేందుకు అమరావతి జాయింట్ యాక్షన్ కమిటీ ప్రతినిధులు డీజీపీకి అందించేందుకు ప్రయత్నించారు. కానీ ఆయన అందుబాటులో లేకపోవడంతో డీజీపీ కార్యాలయ అధికారి అమ్మిరెడ్డికి అందించారు. గత అనుభవాల దృష్టా ఈ సారి పాదయాత్రలో ఎటువంటి లోపాలు తలెత్తకుండా జేఏసీ ప్రతినిధులు, పరిరక్షణ కమిటీ నేతలు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ముహూర్తం ఖరారు..
ఈ నెల 12న తుళ్లూరు మండలం వెంకటపాలెంలో యాత్ర ప్రారంభం కానుంది,. దీనికి సంబంధించి ముహూర్తం కూడా వేద పండితులు ఖరారు చేశారు. వెంకటపాలెంలోని వేంకటేశ్వరాలయంలో ఉదయం 5 గంటలకు పూజలు చేయనున్నారు. పాదయాత్రకు వినియోగించే శ్రీవారి రథానికి కూడా పూజలు చేస్తారు. ఉదయం 9 గంటలకు లాంఛనంగా జెండా ఊపి పాదయాత్రను ప్రారంభిస్తారు. కార్యక్రమానికి వైసీపీ మినహా రాష్ట్రంలోని అన్ని రాజకీయ పక్షాలు హాజరుకానున్నాయి. టీడీపీ, బీజేపీ, జనసేన, సీపీఐ, కాంగ్రెస్ పార్టీ నాయకులు హాజరయ్యేందుకు సమ్మతించారు.
ప్రత్యేక ఏర్పాట్లు..
అమరావతి టూ తిరుపతికి చేపట్టిన 1.0 మహా పాదయాత్రలో ఇబ్బందుల నేపథ్యంలో అటు అమరావతి పరిరక్షణ కమిటీ, జాయింట్ యాక్షన్ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఎక్కడా లోపాలకు తావివ్వకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకుగాను ప్రత్యేక కమిటీలను ఏర్పాటుచేశారు.ఆహారం, లాజిస్టిక్ష్ 1,2, తాగునీరు, ఫైనాన్స్, ఆహ్వానం, రథం కమిటీలను ఏర్పాటుచేశారు. సభ్యులకు ఒక్కొక్కరికీ ఒక్కో బాధ్యతను అప్పగించారు. రాత్రి బసకు సంబంధించి స్థలాలను ఎంపిక చేయగా.. ప్రత్యామ్నాయంగా మరికొన్ని ప్రదేశాలను సైతం సిద్ధంగా ఉంచుతున్నారు. తొలి పాదయాత్రలో ప్రభుత్వ, ప్రైవేటు భవనాల వద్ద బస ఏర్పాట్లను ప్రభుత్వంతో పాటు వైసీపీ నేతలు అడ్డుకునే ప్రయత్నం చేసిన నేపథ్యంలో ముందస్తుగా ప్రైవేటు భవనాలను బస కోసం ఎంపిక చేశారు.
అడ్డుకున్న ప్రతీసారి కోర్టుకు….
అయితే అమరావతి రాజధాని విషయంలో రైతులు మొండిపట్టు వీడడం లేదు. అదే సమయంలో జగన్ సర్కారు కూడా తన కర్కశాన్ని ప్రదర్శిస్తోంది. అమరావతి రైతుల ప్రజాస్వామ్యయూత నిరసనను సైతం అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది. అమరావతి రైతులు పాదయాత్ర చేస్తున్న ప్రతిపాదిత ప్రాంత ప్రజల్లో మూడు రాజధానులకు మద్దతుగా భావోద్వేగాలు ఉంటాయని.. మధ్యలో కోనసీమ జిల్లాలో విధ్వంసాలు నెలకొని ఉన్నాయని స్వయంగా డీజీపీ చేత చెప్పించినా కోర్టు మాత్రం అవేవీ పరిగణలోకి తీసుకోలేదు. రైతులకు మద్దతుగానే తీర్పునిచ్చింది. మొత్తానికైతే తన అధికారంతో అమరావతి రైతులను జగన్ సర్కారు అడ్డకున్న ప్రతిసారి కోర్టును ఆశ్రయించి రాజధాని రైతులు ఉపశమనం పొందుతున్నారు.