
ఒక్కసారి ప్రజల ఆదరాభిమానాలు పొందాలంటే ఎంత కష్టమో అది ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డికి బాగా తెలుసు. ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ ఎన్ని కష్టాలు పడ్డారో.. ఎన్ని రోజులు ప్రజల్లో తిరిగారో అందరికీ తెలిసిందే. ఎట్టకేలకు ఆ అవకాశం వచ్చింది. బంపర్ మెజార్టీ ఇచ్చి జగన్‌ను సీఎం సీటు ఎక్కించారు. మరి ఇప్పుడు ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం జగన్ మీద ఎంతగానో ఉంది. అందుకే.. ఏ సంక్షేమ పథకాలతో ప్రజలకు లాభం చేకూరుతుంది..? రైతన్నలను ఎలా ఆదుకోవాలి..? యువతకు ఎలాంటి ఉపాధి చూపాలి..? వారి భవిష్యత్ ఎలా ఉండాలి..? ఇలా ప్రతీ వర్గం గురించి ఆలోచిస్తూ పాలనలో ముందుకు సాగుతున్నారు.
ఇందులో భాగంగానే రాష్ట్రంలో 30 నైపుణ్యాభివృద్ధి కాలేజీల ఏర్పాటుకు నడుం బిగించారు. కాలేజీల నిర్మాణం కోసం స్థలాల గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేయాలని, భవనాల నిర్మాణం అత్యంత నాణ్యతగా ఉండాలని, ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి చెప్పారు. ఆర్థిక శాఖ అధికారులతో కూర్చొని కాలేజీల నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేయాలని.. పనులు త్వరగా మొదలు పెట్టాలని.. వ్యవసాయంలో ఉపయోగించే యంత్రాల వినియోగం, వాటి మరమ్మతులపై యువతకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. హై ఎండ్ స్కిల్స్‌తోపాటు ప్రతీ కాలేజీలో ఏసీలు, ప్లంబింగ్, భవన నిర్మాణం తదితర పనులపై శిక్షణ ఇవ్వాలని.. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక కాలేజీ ఉండేలా చూసుకోవాలన్నారు. నైపుణ్యాల అభివృద్ధి, ఉత్తమ మానవ వనరులను పరిశ్రమలకు అందించడంలో, పారిశ్రామికాభివృద్ధిలో ఈ కాలేజీలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు.
కాలేజీల కోసం ఇప్పటి వరకు దాదాపు 20 చోట్ల స్థలాలను గుర్తించారు. మిగిలిన చోట్ల కూడా ఆ ప్రక్రియ చురుగ్గా సాగుతోందని అధికారులు వెల్లడించారు. స్కిల్ డెవలప్ మెంట్ కాలేజీల్లో వివిధ కోర్సులకు పాఠ్యప్రణాళిక సిద్ధం చేశారు. ఫినిషింగ్ స్కిల్ కోర్సులు, ప్రత్యామ్నాయ ఉపాధి కోర్సుల్లో శిక్షణ ఉంటుంది. మొత్తం 162కిపైగా కోర్సులు ఉంటాయి. ఇందులో 127 కోర్సులు ఫినిషింగ్ స్కిల్స్, 35 ప్రత్యామ్నాయ ఉపాధి కోర్సులు ఉన్నాయి. పరిశ్రమల అవసరాలపై సర్వే ప్రకారం కోర్సులు నిర్ణయించారు. పాఠ్య ప్రణాళిక తయారీలో సింగపూర్ పాలిటెక్నిక్, జీఐజెడ్, వాన్ హాల్ లారెన్‌స్టెన్ (యూనివర్సిటీ ఆఫ్ అప్‌లైడ్ సైన్సెస్), డిపార్ట్‌మెంట్ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ భాగస్వామ్యాన్ని తీసుకుంటున్నారు.
మరో 23 ప్రఖ్యాత సంస్థలతో భాగస్వామ్యం కోసం ఎంఓయూలకు సిద్ధమయ్యారు. ఇంకో 35 సంస్థలతో చర్చలు నడుస్తున్నాయి. ల్యాబ్ ఏర్పాట్లు, పాఠ్య ప్రణాళికలో వీరి సహకారం తీసుకోనున్నారు. ఎంఓయూలకు సిద్ధమైన వాటిలో డెల్, హెచ్‌పీ, టీసీఎస్, ఐబీఎం, బయోకాన్, టాటా తదితర కంపెనీలు ఉన్నట్లు ఆఫీసర్లు చెప్పారు.