Jagan- Chandrababu: ప్రజలను భయపెట్టి.. బలవంతంగా ఓట్లు వేయించుకుంటామంటే కుదరని పని. అలా చేయాలనుకున్న చాలా ప్రభుత్వాలు, పార్టీలు కాలగర్భంలో కలిసిపోయాయి. పోల్ మేనేజ్ మెంట్ లో భాగంగా అధికారంలో ఉన్న పార్టీలు ప్రభుత్వ పథకాలు, లబ్ధిని సాకుగా చూపి ఓట్లు వేయించడం తెలుగునాట రివాజుగా మారింది. అయితే అందులో కొన్ని ప్రభుత్వాలు, పార్టీలే సక్సెస్ అయ్యాయి. ప్రస్తుతం ఏపీ సీఎం జగన్ ఇటువంటి ఆలోచనే చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, పౌరసేవల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 2.5 లక్షల మంది వలంటీర్లను నియమించుకున్నారు. ఇందులో ఎక్కువ మంది వైసీపీ సానుభూతిపరులే. అయితే వీరు వచ్చే ఎన్నికల్లో గెలిపిస్తారన్న నమ్మకం జగన్ లో సన్నగిల్లినట్టుంది. అందుకే వీరిపై పర్యవేక్షణకు ముగ్గురు చొప్పున నియమించారు. వారికి ముచ్చటగా గృహ సారథులని పేరు పెట్టారు. వీరు తమకు కేటాయించిన ప్రతీ 50 కుటుంబాల్లో ఓటర్లకు టచ్ లోకి వెళతారు. వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వానికి ఎందుకు ఓటు వేయాలో చెబుతారు. లోటుపాట్లు ఉంటే సరిదిద్దుతారు.

జగన్ తన నాలుగేళ్ల పాలన పూర్తిచేసుకున్నారు. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండడంతో కొత్త ఆలోచనను తెరపైకి తెచ్చారు. అయితే ఈ నిర్ణయం ప్రభావం వచ్చే ఎన్నికల్లో ఎలా ఉండబోతున్నది అనే దానిపై చర్చ అయితే ప్రారంభమైంది. ఈ క్రమంలో చంద్రబాబు జన్మభూమి కమిటీలు గుర్తుకు వస్తున్నాయి. సంక్షేమ పథకాల అమలు, ప్రభుత్వ కార్యక్రమాల పర్యవేక్షణకు జన్మభూమి కమిటీలను ప్రకటించారు. గ్రామంలో టీడీపీలో యాక్టివ్ గా ఉండే నాయకులను కమిటీల్లో చోటు కల్పించారు. ప్రజలను టీడీపీ వైపు టర్న్ చేస్తారని భావించారు. కానీ వారు టీడీపీకి ఓటు వేసిన వారికి మాత్రమే సంక్షేమ పథకాలు అందించారు. వారి సమస్యలకు మాత్రమే పరిష్కారం చూపించారు. మిగతా వారి విషయంలో అడ్డంకులు సృష్టించారు. దీంతో మిగతా వర్గాలు విసిగిపోయారు. అటు పర్యవేక్షణ లేకపోవడంతో ప్రతీ పనికి ఒక రేటు ఫిక్స్ చేసి వసూలు చేశారు. ఆ ప్రభావమే చంద్రబాబు సర్కారుపై విపరీతమైన ప్రభావం చూపించింది. అధికారానికి దూరం చేసింది. కట్టుబట్టలతో మిగిలిన విభజిత ఏపీని అభివృద్ధి చేశానన్న చంద్రబాబు అభ్యర్థనను ఆటంకం కలిగించింది ముమ్మాటికీ జన్మభూమి కమిటీలేనని ఇప్పటికీ విశ్లేషకులు అభిప్రాయపడుతుంటారు.
అయితే చంద్రబాబుకు తగిలిన దెబ్బ నుంచి గుణపాఠాలు నేర్చుకోవాల్సిన జగన్ ఇప్పుడు అదే పంథాను అనుసరిస్తున్నారు. బీజేపీ వరుస విజయాలకు కారణమైన పన్నా ప్రముఖ్ వ్యవస్థను ఆదర్శంగా తీసుకొని వలంటీర్లపైనే మరో ముగ్గరు వలంటీర్లను నియమించే పనిలో పడ్డారు. గృహసారథులను నియమిస్తున్నారు. ఇప్పుడున్న 2.50 లక్షల వలంటీర్లకు అదనంగా ఐదున్నర లక్షల మంది సారథులను ప్రజలపైకి వదులుతున్నారు. అయితే ఇంతకు ముందున్న వలంటీర్లు ప్రభుత్వ సేవకులు.. సారథులు మాత్రం పార్టీ సేవకులు. సంక్షేమ పథకాలు, పౌరసేవలు అందించే వారు వలంటీర్లు. పార్టీకి ఓటు వేయించే వారు సారథులు. తమకున్న 50 కుటుంబాలవారికి నేర్పుగా, ఓర్పుగా ఓటు వేయాలని చెబుతారు. వారి సమస్యలకు పరిష్కార మార్గం చూపుతారు. వినని వారిని భయపెడతారు. పథకాలు నిలిపివేస్తారు. చివరకు జన్మభూమి కమిటీల సీన్ వస్తుందన్న టాక్ వినిపిస్తోంది. పోల్ మేనేజ్ మెంట్ లో భాగంగా పార్టీకి మరోసారి అధికారంలోకి తెస్తారని జగన్ భావిస్తుండగా.. ఇది ఎంతవరకు వర్కవుట్ అవుతుందా అని అధికార పార్టీ నేతలు అనుమానిస్తున్నారు.

వలంటీరు వ్యవస్థ పుణ్యమా అని స్థానిక సంస్థలు అచేతనంగా మారాయి. సచివాలయాలతో వారికి పని లేకుండా పోయింది. చివరకు ఎమ్మెల్యేలు సైతం వలంటీర్లపై పడి ఏడుస్తున్నారు. ఏ అవసరమొచ్చినా ప్రజలు వలంటీర్ల వైపే చూస్తున్నారని.. తమ గుమ్మం తొక్కడం మానేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గడపగడపకూ వెళుతున్న వైసీపీ ప్రజాప్రతినిధులు పథకాలు ఎవరిస్తున్నారని ఆరాతీస్తే వలంటీర్లు అని లబ్ధిదారులు సమాధానం చెప్పేసరికి షాక్ గురయ్యారు. అటు గ్రామస్థాయిలో సర్పంచ్ లు, ఎంపీటీసీలు ఉత్సవ విగ్రహాలుగా మారిపోయారు. ఒక విధంగా చెప్పాలంటే అధికార పార్టీలో వలంటీరు వ్యవస్థపై అసూయ, ఈర్ష్య భావం ఏర్పడింది. ఈ క్రమంలో రెట్టింపు చేసి వస్తున్న గృహసారథులతో పార్టీలో ఆధిపత్య పోరు పెరిగే అవకాశం ప్రస్పుటంగా కనిపిస్తోంది. అయితే జగన్ మాత్రం తనను రెండోసారి అధికారంలోకి తెచ్చేది వలంటీర్లు, గృహసారథులని నమ్మకంగా ఉన్నారు. అటు రాష్ట్రస్థాయిలో ఎమ్మెల్యేలు, మంత్రులను పక్కనపెట్టి వ్యూహకర్త రుషిరాజ్ సింగ్ టీమ్ కు ప్రాధాన్యమిస్తుండగా.. గ్రౌండ్ లెవల్ లో వలంటీర్లు, గృహసారథుల పాత్ర పెంచడంతో అధికార పార్టీలో ఒక రకమైన గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.