మద్య నిషేధం అమలు చేయడంలో ఏపీలోని వైసీపీ ప్రభుత్వం యూటర్న్ తీసుకుందా..? విడతల వారీగా మద్య నిషేధం అమలు చేస్తామని జగన్ చెప్పిన మాటలు ఇప్పుడు అమలు అసాధ్యమని అనిపిస్తున్నాయా..? కరోనా లాక్‌డౌన్ కాస్త జగన్ వైఖరిలో మార్పు తీసుకొచ్చిందా..? ప్రస్తుతం ఆ రాష్ట్రంలో నడుస్తున్న విధానాన్ని బట్టి చూస్తే అవుననే అర్థమవుతోంది.
Also Read: బీజేపీతో వైసీపీ దోస్తీ కడితే.. పవన్ దారెటు?
లాక్‌డౌన్ అమలులో భాగంగా దేశవ్యాప్తంగా మద్యం షాపులు మూతపడ్డాయి. ఆ తర్వాత కొన్ని నెలల తర్వాత కేంద్రం పర్మిషన్ ఇవ్వగా తెరుచుకున్నాయి. తెరుచుకున్నాక వెంటనే ఏపీ సీఎం జగన్ భారీగా మద్యం ధరలు పెంచారు. జగన్ అధికారంలోకి రాకముందే ఎన్నికల ప్రచారంలో భాగంగా తమ పార్టీ అధికారంలోకి వస్తే సంపూర్ణ మద్య నిషేధం అమలు చేస్తామని ప్రకటించారు. అందులో భాగంగా మద్యం ధరలు పెంచడంతో ఒక్కసారిగా రాష్ట్రంలో మద్యం అమ్మకాలు పడిపోయాయి. ఇదంతా మద్య నిషేధం అమలులో భాగమనే అందరూ అనుకున్నారు.
కానీ.. 4 నెలలు కూడా తిరగకుండానే వైసీపీ ప్రభుత్వం వెనకడుగు వేసింది. మద్యం దొరక్క ప్రజలు శానిటైజర్లు తాగుతున్నారని, ప్రభుత్వ ఆదాయం కూడా తగ్గిందనే కారణాలు చూపించి సెప్టెంబరు 3న ధరలను తగ్గించింది. దీంతో అమ్మకాలు 50 శాతం పెరిగాయి. మే నుంచి ఆగస్టు వరకు నెలకు 12 లక్షల కేసులకు అటూఇటూగా లిక్కర్ అమ్మిన ఎక్సైజ్ శాఖ సెప్టెంబరులో ఒకేసారి 18.39 లక్షల కేసులు అమ్మేసింది. బీర్ విషయానికి వస్తే.. ఆగస్టు వరకు నెలకు సగటున 2.5 లక్షల కేసులు అమ్మిన ఎక్సైజ్‌శాఖ సెప్టెంబరులో 5.82 లక్షల కేసులు అమ్మింది. అనేక బ్రాండ్లు ఒక్కో సీసాపై ఒకేసారి రూ.3,0-70 వరకు తగ్గడంతో మందుబాబులు ఎడాపెడా తాగేస్తున్నారు.
Also Read: సీనియర్లు వర్సెస్ జూనియర్లు.. వైసీపీ, టీడీపీ గోల ఇదీ!
రాష్ట్రంలో ధరలు పెరిగినప్పుడు.. ఇతర రాష్ట్రాల నుంచి మద్యం దిగుమతి భారీగా జరిగింది. పక్క రాష్ట్రమైన తెలంగాణ నుంచి బాటిల్స్ తెచ్చుకునేందుకు మందు బాబులు ఆసక్తి చూపారు. ఇప్పుడు స్వరాష్ట్రంలోనే సేమ్ రేట్‌కు దొరుకుతుండడంతో ఇక్కడే కొనేస్తున్నారు. దీంతో ఒక్కసారిగా రాష్ట్రంలో అమ్మకాలు పెరిగాయి. ఈనెల మొదటి 15 రోజుల్లోనే దాదాపు పది లక్షల కేసుల లిక్కర్ అమ్మినట్లు సమాచారం. ఈ లెక్కన నెలాఖరు నాటికి 20 లక్షల కేసులు అమ్మే అవకాశముంది. ఇది సెప్టెంబరు కంటే మరో లక్షన్నర కేసులు అదనం. దీనికితోడు దసరా పండుగ కూడా వస్తోంది. ఈ పండుగకు మద్యం ఏరులై పారుతుంటుంది. ఇక అక్కడి ప్రభుత్వం ఖజానా పండినట్లే. అయితే.. విడతల వారీగా మద్య నిషేధం అమలు చేస్తామన్న ప్రభుత్వం.. ఇప్పుడు ఇలా వ్యవహరిస్తుండడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.