‘‘ నాకో తిక్కుంది.. దానికో లెక్కుంది” అంటాడు తెలుగు గబ్బర్ సింగ్.. అందరి లెక్కలు తేలుస్తా అంటూ విలన్లకు వార్నింగ్ లు ఇస్తాడు.. అది సినిమా బ్రో.. అక్కడ ఒక్కడే ఒంటి చేత్తో వంద మందిని చిత్తు చేయొచ్చు.. బయట పాలిటిక్స్ లో ఒంటరి పోరు కష్టమే కదా. ఇప్పుడు అలానే ఉంది జన సేనాని పరిస్థితి. పొత్తుల ఎత్తులతో దారెటో తెలియక ఉన్న దశలో.. బీజేపీతో కలిసి నడుస్తే సేఫ్ జోన్ లో ఉండవచ్చని ఆ దిశగా అడుగులు వేశాడు. ఇదంతా జరిగింది సంక్రాంత్రి తర్వాతనే.. ఇంకా పొత్తు పొడుపుకు యేడాదైనా కాకముందే జనసేనా, బీజేపీ ల దోస్తీపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయా.. అనే సందేహాలు బయలుదేరాయి. ఏపీలో ఇప్పుడు వైసీపీ కొత్త ఎత్తులకు విపక్షాలు బెదురుతున్నాయి. చంద్రబాబు టీడీపీ కంగారు పడిపోతోంది. పవన్ జనసేన లో అలజడి రేగుతోంది. కొత్త పొత్తులు ఎవరికి చెక్ పెడుతాయి.. ఎవరి పుట్టి ముంచుతాయి అనే జనాలు చర్చించుకుంటున్నారు.
Also Read: సీనియర్లు వర్సెస్ జూనియర్లు.. వైసీపీ, టీడీపీ గోల ఇదీ!
* కలిసి నడువనే లేదు.. అదే నిజమైతే..
జనసేన, బీజేపీ పొత్తు కుదిరిన తర్వాత ఇప్పటి వరకూ కలిసి ఏ కార్యక్రమం చేపట్టలేదు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలుపలేదు. కరోనా వచ్చి పుణ్యకాలమంతా కరిగించేసింది. ఇంతలోనే రాష్ట్ర రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. జగన్ బీజేపీతో దోస్తీకి రెడీ అయ్యాడని.. కేంద్ర కేబినేట్లో వైసీపీ చేరుతోందని ఊహగానాలు ఢిల్లీ స్థాయిలో వినిపిస్తున్నాయి. అదే నిజమైతే ఫస్ట్ ఎటాక్ పవన్ పైనే పడుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. పవన్ బీజేపీ అండ చూసుకునే కాస్త నిబ్బరంగా ఉన్నారు. సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చి రాజకీయాలను కమలనాధులకు అప్పగించేశారు. అలాంటిది.. తాను బద్ధ విరోధిగా భావిస్తున్న జగన్ ఎన్డీయే కూటమిలోకి వస్తే.. అక్కడ పవన్ కు చోటుంటుందా?
* జగన్ పొత్తుల ఎత్తు.. పవన్ కు దోస్తీ చిక్కు
బీజేపీ, వైసీపీ పొత్తు కుదిరితే పవన్ కు మాత్రం ఇబ్బందిగానే పరిణమించవచ్చు. ఇప్పటికే టీడీపీ, వామపక్షాలతో పొత్తు రాజకీయం చేసిన పవన్.. ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటాడోనని ఆసక్తి రేపుతోంది. పవన్ తో పొత్తుకు చంద్రబాబు సిద్ధంగానే ఉన్నా.. ఆయనతో కలిస్తే పవన్ రాజకీయ భవిష్యత్ ఎలా ఉంటుందో చెప్పలేం. పవన్ తీరుపై ఎర్రన్నలు గుర్రుగా ఉన్నారు. వారితో కలువలేడు. వైసీపీ ఉన్నా బీజేపీ తో స్నేహం చేయడం కష్టం కావొచ్చు..ఇప్పుడు ఎవరితో దోస్తీ చేయాలో అర్థం కాని పరిస్థితిలో జనసేనాని ఉన్నాడు.
Also Read: తిరుమలేషుడి పింక్ డైమాండ్ కథ కంచికేనా..?
* విషమ పరీక్ష.. వింత పరిస్థితి
బీజేపీ తో పొత్తుతో కడుపులో చల్ల కదులకుండా హాయిగా పాలిటిక్స్ చేయవచ్చని తలచినా పవన్కు వైసీపీ రూపంలో పరీక్ష ఎదురవుతోంది. బీజేపీకి రాజకీయాలే ప్రథమ ప్రాధాన్యం. వారు మరోసారి పీఠం ఎక్కాలంటే వాళ్ల లెక్కలు వాళ్లకు ఉంటాయి. పవన్ తో దోస్తీ కన్నా జగన్ తో చేస్తేనే లాభమెక్కువని కమలనాధులు భావించినట్టు ఉన్నారు. అంతే కాదు 2024 విజయ ఢంకా మోగించాలంటే బలమైన కొత్త మిత్రులు కావాలి. ఇవన్నీ ఆలోచించుకునే జగన్ ని అమిత్ షా, మోడీ దువ్వుతున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. రెండు చోట్ల ఓడిన పవన్ కల్యాణ్ కంటే జగన్ అవసరమే వారికి ఎక్కువుంటుంది. జగన్ తో ఇమిడి బీజేపీ కూటమిలో ఉంటాడా? బయటకు వచ్చి సొంతంగా పార్టీని డెవలప్ చేసుకుంటాడా అనేది డిసైడ్ అవ్వాల్సింది పవనే. ఒంటరి పోరాటమా? పొత్తుల పోరాటమా తేల్చుకోవాల్సింది జనసేనానే. మొత్తానికి జగన్ ఢిల్లీ టూర్ తో ఏపీ పాలిటిక్స్ భలే ఇంట్రెస్ట్ గా మారాయి.