
రైతుల పంటలను గ్రామాల్లో వారి పొలాల వద్దనే కొనుగోలు చేస్తామని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి భరోసా ఇస్తున్నా, ఆ విధంగా తమ ఉత్పత్తులను అమ్ముకొనే రైతులపై ఆయన ప్రభుత్వం యూజర్ చార్జీల భారం మోపుతున్నది. రవాణా, గోనెసంచులు, కాటా, ప్యాకింగ్, లోడింగ్, అన్‌లోడింగ్ తదితర ఖర్చులను రైతులే భరించాలని అధికారుల ద్వారా అనధికార ఆదేశాలు జారీచేస్తున్నారు.
అన్ని ఖర్చులూ కలుపుకొని క్వింటాలుకు రూ.66 వంతున రైతులు పెట్టుకోవాలను అంటున్నారు. జొన్న, మొక్కజొన్న కొనుగోళ్లకు సంబంధించి కొన్ని జిల్లాల్లో జాయింట్ కలెక్టర్లు మౌఖిక సూచనలు చేయగా, కొన్ని చోట్ల అధికారికంగా సర్క్యులర్లు జారీ చేశారు. గ్రామాల్లోనే, అదీ పొలాల వద్దనే పంటలు కొనుగోలు చేసేటప్పుడు రవాణా ఛార్జీలకు సైతం వసూళ్లకు పాల్పడుతున్నారు.
సాధారణ రోజుల్లోనే రైతులు పండించిన ప్రతి గింజను కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి)పై సేకరిస్తామని సర్కారు హామీ ఇచ్చింది. కరోనా లాక్‌డౌన్ వేళ వివిధ ఛార్జీల రూపంలో రైతుల నుంచి అదనంగా వసూలు చేస్తామనడంతో రైతులు విస్తు పోతున్నారు. ఈ విధంగా కింటాలుకు రైతులు పెట్టుకోవాల్సిన ఛార్జీల మొత్తం రూ.66గా పేర్కొంటున్నా, వాస్తవానికి రూ.125 వరకు అవుతున్నది.
క్వింటాలుకు ట్రాన్స్‌పోర్టుకు రూ.30, గోనె సంచి రూ.20, కాటా, లోడింగ్, అన్‌లోడింగ్, ప్యాకింగ్‌లకు రూ.75 చొప్పున చాలా జిల్లాల్లో అనధికారికంగా రైతుల నుంచి వసూలు చేస్తున్నారు. వ్యాపారులు, దళారులకు అమ్ముకుంటే ఎంఎస్‌పి రాదన్న భయంతో రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను ఆశ్రయిస్తారు.
ఇక్కడ సైతం క్వింటాలుకు రూ.125 వరకు భరించాలనడంతో ఆందోళన చెందుతున్నారు. ఎకరంలో సగటున 30 క్వింటాళ్లు పండాయనుకుంటే రైతులు రూ.3 వేలు వినియోగ ఛార్జీల రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వం నిర్ణయించిన ఛార్జీలను (రూ.66) లెక్కేసినా ఎకరానికి దాదాపు రూ.2 వేలు రైతులు తమ జేబుల్లో నుంచి పెట్టుకోవాల్సి వస్తున్నది.
జొన్న, మొక్కజన్న కొనుగోళ్లకు ప్రభుత్వం నిర్ణయించిన లక్ష్యాల ప్రకారం రైతులు రూ.35 కోట్లకు పైన ఛార్జీలు కట్టాలి. రబీలో పండిన మొత్తం పంటతో నిమిత్తం లేకుండా మొక్కజన్న 3.64 లక్షల టన్నులు, జొన్న లక్షన్నర టన్నులు సేకరించాలనుకున్నారు. ఈ మొత్తానికీ ప్రభుత్వం పేర్కొన్న విధంగా క్వింటాలుకు రూ.66 చెల్లించాలంటే రైతులపై రూ.34 కోట్లు, అనధికారికంగా క్వింటాలుకు వసూలు చేస్తున్న రూ.125 ప్రకారం అయితే సుమారు రూ.65 కోట్లు భారం పడుతుంది.