Priti Adani: వైసీపీలో పదవుల పంపకాల సందడి నెలకొంది. మొన్న మంత్రివర్గ విస్తరణ, నిన్న పార్టీ కార్యవర్గాల నియామకాలు పూర్తికాగా.. ఇప్పుడు రాజ్యసభ వంతు వచ్చింది. అయితే ఈ సారి జగన్ రాజ్యసభ సభ్యుల ఎంపిక విషయంలో పక్కా జాగ్రత్తలు పాటిస్తున్నారు. 2024 ఎన్నికలే లక్ష్యంగా ఎంపిక చేయనున్నారు. రాష్ట్రం నుంచి ఈ ఏడాది జూన్ లో నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఆ నాలుగూ వైసీపీకే దక్కనున్నాయి. అయితే ఈసారి కూడా కార్పొరేట్ దిగ్గజాలకు ఒక రాజ్యసభ సీటు కట్టబెట్టనున్నట్టు టాక్ నడుస్తోంది. గతంలో రిలయన్స్ దిగ్గజం ముఖేష్ అంబానీకి అత్యంత సన్నిహితుడు, రిలయన్ష్ సంస్థల వైస్ ప్రెసిడెంట్ పరిమళ్ నత్వానీకి వైసీపీ తరుపున రాజ్యసభ సీటు కట్టబెట్టిన సంగతి తెలిసిందే. ఈసారి అదే పంథాను కొనసాగించనున్నట్టు సమాచారం.
ఈసారి తనకు అత్యంత సన్నిహితుడైన పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీ భార్య ప్రీతి అదానికి రాజ్యసభ సీటు ఇవ్వనున్నట్టు వైసీపీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. హస్తినా రాజకీయాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. వచ్చే ఎన్నికలను ద్రుష్టిలో పెట్టుకొని, బీజేపీని సంత్రుప్తి పరిచేందుకు మోదీకి సన్నిహితులైన పారిశ్రామికవేత్తల మద్దతును కూడగట్టేందుకు ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. రాష్ట్రానికి పరిశ్రమల తెప్పించిన మాట అటుంచి భవిష్యత్ లో పార్టీకి, తనకు ఉపయోగపడతారని భావించి పారిశ్రామికవేత్తలకు రాజ్యసభ సీట్లు కట్టబెట్టడం హాట్ టాపిక్ గా మారింది. అటు పార్టీలో కూడా ఒక రకమైన చర్చ నడుస్తోంది. పార్టీ ఆవిర్భావం నుంచి తన వెంట నడుస్తున్న సీనియర్లు ఎంతో మంది రాజ్యసభ పదవి కోసం ఎదురుచూస్తున్నారు. రాష్ట్ర మంత్రులుగా, సుదీర్ఘ కాలం ఎమ్మెల్యేగా పనిచేసిన చాలా మంది హస్తిన రాజకీయాల వైపు ఆసక్తి చూపుతున్నారు. అటువంటి వారంతా తమకు రాజ్యసభ పదవి కావాలని అధినేత ముందు మనసు విప్పారు. కానీ వారందర్నీ కాదని పారిశ్రామికవేత్తలను ఎంపిక చేయడంపై వారు కీనుక వహిస్తున్నారు. అధినేత నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు.
Also Read: YCP: జగన్ తర్వాత వైసీపీలో నంబర్ 2 ఎవరు?
వ్యక్తిగత లాభానికి పెద్దపీట
మనకు పార్టీయే సుప్రీం అంటూ తరచూ చెప్పే జగన్ పదవుల విషయంలోకి వచ్చేసరికి మాత్రం తన వ్యక్తిగత ప్రయోజనాలకు పెద్దపీట వేస్తున్నారని సీనియర్లు అంతర్గత సమావేశాల్లో చర్చించుకుంటున్నారు. నాలుగు రాజ్యసభ స్థానాల్లో ప్రీతి అదానికి పోనూ ఇంకా మూడు మిగులుతాయి. అందులో ఒకటి తన వ్యక్తిగత న్యాయవాది నిరంజన్‌రెడ్డికి కట్టబెట్టనున్నట్టు తెలుస్తోంది. ఇక కీలక నేత, జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి రాజ్యసభ పదవీ కాలం జూన్ మొదటివారంలో ముగుస్తోంది.
ఆయనకు రెండోసారి కూడా అవకాశమిచ్చేందుకు జగన్ సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. నాలుగో స్థానాన్ని మైనారిటీ లేదా దళిత వర్గానికి ఇవ్వాలని ఆయన యోచిస్తున్నట్లు చెబుతున్నారు. ద్వైవార్షిక ఎన్నికల ప్రకటన వెలువడిన వెంటనే అభ్యర్థుల పేర్లను ఆయన ప్రకటిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గత ఎన్నికల్లో పరిమళ్ నత్వానీకి వైసీపీ తరఫున రాజ్యసభ టికెట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ప్రీతి అదానీకి కూడా పార్టీ కండువా కప్పి.. బీ-ఫారం ఇచ్చి వైసీపీ తరఫున రాజ్యసభకు పంపుతారా అనేది ఆసక్తి కలిగిస్తోంది. అదే జరిగితే గౌతమ్ అదానీ ఇక వైపీసీ నాయకుడుగా మారిపోతారని అంటున్నారు. ఇంకోవైపు.. వైసీపీలో రాజ్యసభ సీట్లకు పోటీపడే వారి సంఖ్యా భారీగానే ఉంది. జగన్‌కు సన్నిహితుడైన ప్రభుత్వ సలహాదారు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి తదితరులు రేసులో ఉన్నారని అంటున్నారు.
ఆశావహులు అధికం
జగన్ చాలామందికి రాజ్యసభ పదవిని ఆశచూపారు. అందులో మర్రి రాజశేఖర్ ముందు వరుసలో ఉన్నారు. గత ఎన్నికల్లో అసెంబ్లీ అభ్యర్థిత్వాన్ని ఆశించిన రాజశేఖర్ కు టిక్కెట్ కేటాయించలేదు. పార్టీ అధికారంలోకి వస్తే సముచిత స్థానం కల్పిస్తానని హామీ ఇచ్చారు. కానీ మూడేళ్లవుతున్నా పదవి కేటాయించలేదు. ఇటీవల పార్టీ సమన్వయ బాధ్యతలు అప్పగించారు. అయిష్టతతోనే ఆయన బాధ్యతలు స్వీకరించారు. రాజ్యసభ అభ్యర్థిత్వాల్లో తన పేరును పరిగణలోకి తీసుకుంటారని ఆశించారు. కానీ పరిణామాలు మాత్రం అంత ఆశాజనకంగా లేవు. ఇక సినిమా రంగం నుంచి చాలాపేర్లు తెరపైకి వచ్చాయి. స్టార్ కమేడియన్ అలీ, నటుడు మోహన్ బాబు, పోసాని క్రిష్ణమురళీ సైతం ఆశలు పెట్టకున్నారు. అలీకి ఒక అడుగు ముందుకేసి జగన్ మాట ఇచ్చారన్న ప్రచారమూ సాగింది. కానీ ఇప్పుడు పరిణామాలు చూస్తుంటే మారిపోయాయి. కుమారుడు అకాల మరణంతో విషాదంలో ఉన్న మేకపాటి రాజమోహన్ రెడ్డికి రాజ్యసభ తప్పకుండా కట్టబెడతారన్న టాక్ నడిచింది. కానీ ఆయనకు పోటీగా సజ్జల, వైవీ సుబ్బారెడ్డి ఉన్నారు. విపరీతమైన పోటీ ఉన్న నేపథ్యంలో జగన్ కు రాజ్యసభ ఎంపికలు కత్తిమీద సామే.
Also Read:Shah Rukh Khan: తీవ్ర నిరాశలో నెంబర్ వన్ ‘స్టార్ హీరో’.. కారణం అదే !