CM Jagan: ఏపీ సీఎం జగన్ కొత్త పల్లవి అందుకున్నారు. చంద్రబాబు కంటే ఆ నాలుగు మీడియా సంస్థలతోనే పోరాటం చేస్తున్నట్టు ప్రకటిస్తున్నారు. తరచూ ఇదే మాట చెబుతున్నారు. రాజకీయంగా అడుగులు వేయడంలో ఇప్పటివరకూ నేర్పరిగా ఉన్న జగన్ ఆరోపణలు వెనుక చాలా కథ ఉంది. అటు చంద్రబాబు బలహీనుడని చెప్పడంతో పాటు తాను ఏం పనిచేసినా ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 మీడియా చానళ్లు, పత్రికలు వ్యతిరేక వార్తలు వండి వారుస్తున్నాయని ప్రజలకు సీఎం జగన్ హితబోధ చేస్తున్నట్టుంది. ఆయన రాజకీయ లెక్కల ప్రకారం ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్న చందంగా చంద్రబాబును పలుచన చేయడంతో పాటు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న చానళ్లు, పత్రికలు మాటలను నమ్మోద్దని ప్రజలకు సూచిస్తున్నట్టుంది.
ఈటీవీ, ఏబీన్, టీవీ5 చానళ్లతో పాటు ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికలను ఆడిపోసుకోవాలని వైసీపీ శ్రేణులకు పిలుపునిచ్చారంటే ఆయన ఎంత సీరియస్ గా తీసుకుంటున్నారో అర్ధం చేసుకోవచ్చు. పనిలో పనిగా సొంత మీడియా సాక్షితో పాటు అనుకూలంగా వ్యవహరిస్తున్న మీడియాను పొడగాలని సైతం సందేశమిస్తుండడం ఆశ్చర్యం వేస్తోంది. అసలు తెలుగునాట మీడియా చెప్పిన మాటలను ప్రజలు అసలు తలకెక్కించుకోవడం లేదన్నది వాస్తవం. కానీ ఒక రాజకీయ పక్షం వాదనను, భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంతో మాత్రం మీడియా ముందుంటుంది. గడిచిన ఎన్నికల్లో వైసీపీ విజయం వెనుక సాక్షి పాత్ర ఉంది. చంద్రబాబు ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కథనాలు వండి వారించడంతో పాటు జగన్ నవరత్నాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కీ రోల్ పాత్ర వహించింది. అదే సమయంలో ఆంధ్రజ్యోతి, ఈనాడు, టీవీ5 చంద్రబాబుకు అనుకూలంగా ప్రచురించిన కథనాలను ప్రజలు పట్టించుకోవడం లేదు. తెలుగునాట చానళ్లు, మీడియా వైజుగా పాఠకులు, వీక్షకులు విడిపోయారు. ఒకే ఇంట్లో వేర్వేరు చానళ్లు చూస్తున్న వారూ ఉన్నారు. . కానీ డిజిటల్ మీడియా తెరపైకి వచ్చిన తరువాత మాత్రమే పాఠకులు, వీక్షకులు అన్నిరకాల కథనాలు, వార్తలను చదువుతున్నారు.. చూస్తున్నారు.
Also Read: CM Jagan: బీసీ తారక మంత్రం.. వెనుకబడిన తరగతులను దగా చేస్తున్న జగన్ ప్రభుత్వం
మైండ్ గేమ్
సీఎం జగన్ మాటల్ని చూస్తే.. ఆయనవన్నీ కూడా మైండ్ గేమ్ మాటల మాదిరే కనిపిస్తాయి. ఎదుటి వారిని మాటలతో నిరుత్సాహానికి గురి చేయటం.. వారు అలాంటి కండీషన్ లో ఉన్నప్పుడు వైసీపీ నేతలను బలమైన టాస్కు ఇచ్చి ఉసిగొలపడం చేస్తుంటారు. ఇప్పుడు కూడా ఆ నాలుగు మీడియా సంస్థలను తిట్టండి అంటూ శ్రేణులకు పిలపునిచ్చారంటే ఆయన ఆలోచనను అర్థం చేసుకోవచ్చు. దీనికి కారణం లేకపోలేదు. చంద్రబాబు పేరు ప్రస్తావించకపోవటం ద్వారా.. ఆయన తన ప్రత్యర్థి కానేకాదని స్పష్టం చేయటం. అదే సమయంలో చంద్రబాబుకు దన్నుగా నిలిచే నాలుగు మీడియా సంస్థలే తమ ప్రత్యర్థులు అనటం ద్వారా.. ఆ నాలుగు మీడియా సంస్థల కంటే చంద్రబాబు బలహీనుడన్న అర్థాన్ని వచ్చేలా చేయటమని చెప్పొచ్చు. అంతేకాదు.. బలహీనుడైన చంద్రబాబు తో కాకుండా బలమైన మీడియాతో యుద్ధం చేస్తున్నట్లు చెప్పటం ద్వారా సరికొత్త రాజకీయ ఎత్తుగడను జగన్ వేస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
బలహీనపరచి..
అసలు రాష్ట్రంలో చంద్రబాబు నేత్రుత్వంలోని టీడీపీకి బలం లేదన్నట్టు జగన్ భావిస్తున్నారు. బలహీనమైన చంద్రబాబును ఆ నాలుగు మీడియా సంస్థలు లేపే ప్రయత్నం చేస్తున్నాయని చెప్పడం ద్వారా ప్రజల్లో చంద్రబాబుపై అనుమానాలు పెంచాలని కూడా చూస్తున్నారు. అందుకే వైసీపీ కీలక నాయకులను నాలుగు మీడియా సంస్థలను బలహీనపరిచే టాస్క్ ను అప్పగించారు. ఇప్పటికే తాజామాజీ కొడాలి నాని ఆంధ్రజ్యోతి రాధాక్రిష్ణ గాడు, రామోజీ గాడు అంటూ ఏక సంబోధం చేస్తుంటారు. ఇక అదే రూట్లోకి మిగతా వైసీపీ నాయకులు వచ్చి చేరుతారనడంలో ఎటువంటి సందేహం లేదు. జగన్ ఇప్పుడు తన గురి మొత్తం నాలుగు మీడియా సంస్థల మీద పెట్టటం ద్వారా.. వారిని బద్నాం చేయటం ద్వారా.. వారు ఆత్మరక్షణలో పడతారు. తమ సచ్ఛీలతను ప్రదర్శించుకునేందుకు తహతహలాడుతారు. అసలు విషయాన్ని పక్కన పెడతారు. నిజానికి జగన్ కు కావాల్సింది కూడా అదే. అందుకే.. ఆయన నోటినుంచి నాలుగు మీడియా సంస్థల్ని దుష్ట చతుష్టయంగా వ్యవహరించేదన్న మాట వినిపిస్తోంది.
Also Read:Acharya: ఆచార్య లో ఆ సన్నివేశం కి ఏడుపు ఆపుకోలేమా..?