Homeఆంధ్రప్రదేశ్‌PM Modi- Jagan: ఎన్నాళ్లకెన్నాళ్లకు.. జగన్ నోట ప్రత్యేక హోదా మాట

PM Modi- Jagan: ఎన్నాళ్లకెన్నాళ్లకు.. జగన్ నోట ప్రత్యేక హోదా మాట

PM Modi- Jagan: ప్రత్యేక హోదా.. ఈ మాట వినడానికి వినసొంపుగా ఉండేది. ఎందుకో కాలక్రమేణా కనుమరుగైంది. అడపాదడపా జనసేనాని పవన్ మాత్రం ప్రత్యేక హోదాను గుర్తుచేస్తుంటారు. ప్రత్యేక హోదా తీసుకొచ్చి ప్రజలు ఇచ్చిన అధికారానికి రుణం తీర్చుకోండి అంటూ ఆయన చెబుతుంటారు. తరచూ అధికార పార్టీని గుర్తు చేస్తుంటారు. కానీ అధికారంలోకి వచ్చి మూడేళ్లవుతున్నా వైసీపీ ప్రజాప్రతినిధులు మాత్రం ప్రత్యేక హోదా అన్న మాటే మరిచిపోయారు. అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో ఏపీ సీఎం జగన్ ప్రధాని మోదీని కలిశారు. రెండోసారి అధికారంలోకి వచ్చినందుకు శుభాకాంక్షలు తెలిపారు. ఆ క్రమంలో నేషనల్ మీడియాలో తనకు వచ్చిన ఇంగ్లీష్ లో మాట్లాడారు. ఏం చేస్తాం. ఎన్డీఏ పూర్తి మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. వారికి ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేయలేం. ఇస్తే తీసుకుంటామని చందంగా వ్యాఖ్యానించారు. ఇదే అదునుగా కేంద్ర ప్రభుత్వం గౌరవ పార్లమెంట్ సాక్షిగా పలుమార్లు ఏపీకి ప్రత్యేక హోదా సాధ్యమయ్యే పనికాదని తెల్చేసింది. అదో ముగిసిన అధ్యయనంగా చెప్పుకొచ్చింది.

PM Modi- Jagan
PM Modi- Jagan

మూడేళ్లుగా మరుగున..
వాస్తవంగా చెప్పాలంటే వైసీపీ ప్రజాప్రతినిధులు సైతం ప్రత్యేక హోదా విషయమే మరిచిపోయారు. లోక్ సభలో సంఖ్యాబలం ఉన్నా, అడగానికి ఎన్నోరకాల అవకాశాలు ఉన్నా జారవిడుచుకున్నారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడ్డారు. దీనిపై నేషనల్ మీడియాలో సైతం కథనాలు వచ్చినా పట్టించుకోలేదు. అధికారంలోకి వచ్చిన తరువాత చాలాసార్లు ఏపీ సీఎం జగన్ ప్రధాని మోదీని కలిశారు. ఆ సమయంలో వైసీపీ నేతలు మాత్రం మా నాయకుడు హోదా అడిగేందుకే వెళ్లారని చెప్పుకొస్తారు. తాను ఎందుకు ప్రధానిని కలిసింది? ఏం కోరింది? ప్రధాని ఏం చెప్పారో కూడా బయటకు చెప్పేందుకు జగన్ ఇష్టపడరు. అలాగని మోదీకి కూడా మీడియా సమావేశాలు ఇష్టముండదు. అందుకే ప్రత్యేక హోదా రాకున్నా ఎవరికి అవసరం వచ్చినప్పుడు వారు తెరపైకి తెచ్చుకునేలా సజీవంగా ఉంచగలిగారు.

Also Read: R. Narayana Murthy: ఆర్.నారాయణ మూర్తి ఇంట్లో తీవ్ర విషాదం.. అసలేమైందంటే?

తాజాగా తెరపైకి..
ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్నాయనో? లేక విమర్శలు వ్యక్తమవుతున్నాయనో? కానీ ఏపీ సీఎం జగన్ నోట ప్రత్యేక హోదా మాట వచ్చింది. అల్లూరి విగ్రహావిష్కరణకు ఏపీకి వచ్చిన ప్రధాని మోదీని జగన్ ప్రత్యేక హోదా అడిగారట. కానీ ప్రధాని ఏమన్నరో మాత్రం బయటకు రావడం లేదు. అయినా ఇన్నాళ్ల విన్నపాలకే అతీగతీ లేదు. అంతగా రిక్వెస్ట్ చేస్తే మోదీ కరిగిపోతారా అన్నది ప్రశ్న. దేశంలో ఎన్నోరకాల డిమాండ్లు వచ్చాయి. ఎన్నో నిరసనలు జరిగాయి. ఎంతో మంది ప్రాణాలు పోయాయి. అటువంటి వాటి విషయంలో చలించని ప్రధాని ఇలా సావదానంగా జగన్ కోరితే కరుణిస్తారా? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. మొత్తానికి అయితే చాన్నాళ్లకు జగన్ నోట ప్రత్యేక హోదా మాట వినిపించడం శుభ పరిణామం. అయితే ప్రత్యేక హోదా లైన్ తీసుకొని మళ్లీ జగన్ కొత్త రాజకీయానికి తెరతీస్తారా? అన్నది ఇప్పుడు తెలియాల్సి ఉంది. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే తాము ఆహ్వానిస్తామని తెలంగాణ ప్రభుత్వం సైతం సమ్మతించింది. పైగా ఏపీ సీఎం జగన్ కు తెలంగాణ సీఎం కేసీఆర్ తో సన్నిహిత సంబంధాలున్నాయి. అలాగే కేంద్ర పెద్దలకు కూడా దేశంలో ఇప్పుడు నమ్మదగిన మిత్రుడిగా జగనే ఉన్నారు. అటు పొరుగు రాష్ట్రం తెలంగాణ సమ్మతి..అటు కేంద్రం సపోర్టు ఉండడంతో ప్రత్యేక హోదా సాధన అనేది అంత కష్టమైన పని కాదు. కానీ మూడేళ్ల వ్యవధి తరువాత ఇప్పుడు ప్రత్యేక పల్లవి అందుకోవడమే కాస్తా అనుమానం కలిగిస్తోంది.

PM Modi- Jagan
PM Modi- Jagan

నాడు తెగ హడావుడి..
విపక్షంలో ఉన్నప్పుడు జగన్ ప్రత్యేక హోదా మాటను గట్టిగానే వినిపించారు. అందుకు తగ్గట్టుగా రాజకీయ లబ్ధి పొందారు. ఒక విధంగా చెప్పాలంటే జగన్ ప్రత్యేక హోదా విషయంలో వేసిన ట్రాప్ లోనే చంద్రబాబు చిక్కుకున్నారు. బీజేపీని దూరం చేసుకున్నారు. రాజకీయంగా ఒంటరి అయ్యారు. భారీ మూల్యం చెల్లించుకున్నారు. ప్రత్యేక హోదాయే ఏపీ సంజీవిని అని.. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని జగన్ ఊరూ వాడ తిరిగి ప్రచారం చేశారు. నిరుద్యోగ యువత జగన్ మాటలను నమ్మి ఓటేశారు. ఏకపక్షంగా మద్దతు పలికారు. దాని ఫలితమే అంతులేని విజయం. కానీ ఇలా అధికారంలోకి వచ్చారో లేదో ప్రత్యేక హోదాను జగన్ నీరుగార్చేశారు. మూడేళ్లుగా అదో తెలియని పదంగా ప్రత్యేక హోదానే మరిచిపోయారు. ఇప్పడు ప్రధాని ఏపీకి వచ్చారని.. అడగక పోతే బాగుండదని తెలిసి మరోసారి ప్రత్యేక హోదాను తెరపైకి తెచ్చారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Also Read:Modi Target: మహారాష్ట్ర భుజంపై తుపాకీ పెట్టి తెలంగాణ తమిళనాడును కాలుస్తున్న మోడీషాలు

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular